టీడీపీ నేత పట్టాభిపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు

హోంమంత్రి సుచరిత
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పరుషపదజాలం వాడిన టిడిపి నేత పట్టాభి పై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతూ అలజడులు సృష్టిస్తున్నారని టిడిపి నేతలపై ఆమె విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పథకాలను అమలు చేసుకుంటే ఓర్వలేక ఏదైనా ఒక సంక్షేమ పథకం ప్రారంభించే రోజే ఇలాంటి వివాదాలు తెరపైకి తేవడం ప్రతిపక్ష తెలుగుదేశానికి అలవాటైపోయింది అని అన్నారు.
ఇందులో భాగంగానే పట్టాభి గౌరవ ముఖ్యమంత్రి పై సభ్య సమాజం తలదించుకునేలా దుర్భాషలు మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇతనిపై కేసులు ఉన్నాయని జైలుకు వెళ్లి వచ్చారు అని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జగనన్న తోడు,జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం నేడు ప్రారంభించు కుంటున్న సమయంలో ఇలాంటి అలజడులు సృష్టించారని విమర్శించారు. ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు జీర్ణించుకోలేని కొందరు ఆయన అభిమానులు టిడిపి వారిపై ప్రతిఘటించే పరిస్థితులు ఉత్పన్నమై ఉంటాయని ఆమె వివరించారు.
ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు పచ్చ చొక్కా లు వేసుకోవాలని కోరారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ నిష్పక్షపాతంగా చిరునవ్వుతో కులాలకు మతాలకు అతీతంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయాలని అధికారులకు స్వేచ్ఛనిచ్చారు. అవినీతి అక్రమాలకు పాల్పడే అధికార పార్టీ వారినైనా ఉపేక్షించే వద్దని స్పష్టం చేసిన విషయాన్ని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు వారి నాయకుల వైఖరిపై కట్టడి చేయాల్సింది పోయి ప్రోత్సహించే విధంగా బందు కు పిలుపునివ్వడం దుర్మార్గమైన చర్యని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుచరిత వివరించారు.