– 1000 మెగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ అత్యధిక నీటిని వినియోగిస్తుంది
– నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్‌ను విస్మరించడం అను అనుచితం
– స్థానిక అటవీ అధికారులు కూడా ఒత్తిడికి లొంగి అనుమతి ఇచ్చారు
– ఈ ప్రాజెక్టు భూమిలో 90 శాతం ‘పెద్ద చుక్క కొండ’ రిజర్వ్ అడవి పరిధిలో..
– కేంద్ర పర్యావరణ, అడవులు & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఏఎస్ శర్మ లేఖ
విశాఖ: విశాఖ గూగుల్ డేటా సెంటర్‌తో మరిన్ని పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణఅటవీ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, కోర్టు తీర్పులను కూడా బేఖాతరు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తర్లువాడ గ్రామంలో గూగుల్ (రైడెన్ ద్వారా) అదానీ సంయుక్తంగా నిర్మిస్తున్న డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ పరిశీలన అధికార సంస్థ (APSEIAA) జారీ చేసిన పర్యావరణ అనుమతిని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఏఎస్ శర్మ వ్యతిరేకించారు.
కేంద్ర పర్యావరణ, అడవులు & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్‌కు ఆయన రాసిన లేఖలో “ప్రభుత్వ ఒత్తిడికి లోనై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ పరిశీలన అధికార సంస్థ అనుచితంగా అనుమతి ఇచ్చింది అని ఆరోపించారు.
ఈ ప్రాజెక్టు భూమిలో 90 శాతం ‘పెద్ద చుక్క కొండ’ రిజర్వ్ అడవి పరిధిలో ఉన్నప్పటికీ, కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యానికి కేవలం 1.53 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ, అనుమతి ఇవ్వడం చ చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 18, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ పరిశీలన అధికార సంస్థ జారీ చేసిన అనుమతి లేఖ (AP INFRA2 EC VSP 04 2026 2517)ను ప్రస్తావిస్తూ “సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లో అడవి చూపించలేదని” చెప్పి, నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్‌ను విస్మరించడం అను అనుచితమని.. స్థానిక అటవీ అధికారులు కూడా ఒత్తిడికి లొంగి అనుమతి ఇచ్చారని శర్మ ఆరోపించారు.
MEFCC 2006 EIA నోటిఫికేషన్‌లోని ‘జనరల్ కండిషన్’ ప్రకారం, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నోటిఫై చేసిన సంరక్షిత ప్రాంతాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాలు (ESZ) 10 కి.మీ. పరిధిలో ఉంటే ఆ ప్రాజెక్టును ‘కేటగిరీ A’గా పరిగణించాలి. కంబాలకొండ అభయారణ్యం చుట్టూ MEFCC సో. 1366(E), ఏప్రిల్ 28, 2017 ద్వారా ESZ నోటిఫై చేసిన విషయం శర్మ లేఖలో గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర పర్యావరణ ప్రభావ పరిశీలన అధికార సంస్థ ‘B’ కేటగిరీగా పరిశీలించి అనుమతి ఇవ్వడం దుర దృష్టకరమని అన్నారు.
టి.ఎన్. గోదవర్మన్ తిరుమల్పాడ్ కేసులో (2024-2025) సుప్రీంకోర్టు అడవి భూములపై ఏ అటవీయేతర కార్యకలాపానికైనా ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసిన విషయాన్ని శర్మ లేఖలో ఉదహరించారు. ప్రస్తుత అనుమతి న్యాయస్థానం ఆదేశాలను అగౌరవపరుస్తోందని వ్యాఖ్యానించారు.
ఒక గిగావాట్ (1000 మెగావాట్) సామర్థ్యం గల డేటా సెంటర్ అత్యధిక నీటిని వినియోగిస్తుందని, నీటి కొరత ఉన్న విశాఖపట్నంలో ఇది మరిన్ని పర్యావరణ సమస్యలను సృష్టిస్తుందని శర్మ హెచ్చరించారు. అందువల్ల ఈ ప్రాజెక్టును తప్పనిసరిగా ‘A’ కేటగిరీగా MEFCC ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ కమిటీ (EAC), అట సలహా కమిటీ (FAC)ల ద్వారా పరిశీలించాలని శర్మ డిమాండ్ చేశారు.