– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
తన వల్లే దళితబంధు ఆగిందని నిరూపిస్తే ఉరేసుకుంటా అని మేం విసిరిన సవాల్ కు టీఆర్ఎస్ తోకముడిచింది. ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్ అంబేద్కర్ సెంటర్ వద్దకు రావాలని సవాల్ విసిరితే ఒక్క టీఆర్ఎస్ నేత పత్తా లేకుండాపోయారు. బిజెపి వల్లే దళితబంధు ఆగిందంటోన్న హరీష్ సహా ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు మా సవాల్ స్వీకరించే ధైర్యం చేయలేదు. దీంతో టీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. మేం సవాల్ విసిరన దానిప్రకారం అంబేద్కర్ సెంటర్ వద్దకు వెళ్లాం. కాని టీఆర్ఎస్ నాయకులు తోకముడిచారు. అసలు దళితబంధు అమలుపై టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం నిలిపివేతపై టీఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలు చెబుతోంది. కల్లబొల్లి మాటలు, అమలుకాని హామీలు, అసత్యపు ప్రచారంతో ప్రజలను పదేపదే మభ్యపెడుతోంది. హరీశ్ రావు ఆర్థికమంత్రి కాదు.. అబద్ధాల మంత్రిగా చరిత్రకెక్కిండు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే కొత్త డ్రామాలకు తెరదీశారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్.. దళితులకు డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేయించింది.
బ్యాంకులో పడిన నిధులను లబ్ధిదారులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ బిజెపి మొదటి నుండి డిమాండ్ చేస్తూనే ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వక్ర బుద్దితోనే నిధులు డ్రా చేసుకోకుండా ఆపేసింది. దళిత బంధు పథకాన్ని నిలిపివేసేలా వ్యవహరించి ఈ నెపాన్ని మాపై నెట్టాలని చూసింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి నేను రాసిన లేఖలో ఎక్కడ దళిత బంధు ఇవ్వొద్దని పేర్కొనలేదు. ఒకవేళ దళితబంధును ఆపినట్లు టీఆర్ఎస్ నాయకులు చూపించినట్లయితే హుజురాబాద్ లోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉరివేసుకోవడానికి నేను సిద్ధమని సవాల్ విసిరితే స్వీకరించలేని పిరికిపందలు.. మళ్లీ అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. పదేపదే అబద్దాలు మాట్లాడటం తప్ప హరీశ్ రావుకు, టీఆర్ఎస్ నాయకులకు వచ్చింది ఏమీలేదు.
గతంలో దళితులకు ఇచ్చిన హామీలను ఎలా విస్మరించారో.. దళితబంధు కూడా ఆ కోవకు చెందినదిగానే నిరూపితమైంది. బిజెపి ఎప్పుడూ దళితబంధు వ్యతిరేకం కాదు. పారదర్శకంగా అందరికీ దళితబంధు వర్తింపజేయాలని డిమాండ్ చేసిందే బిజెపి. అబద్ధాలకు కేరాఫ్ గా నిలిచిన టీఆర్ఎస్ కు హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం.