కృష్ణాజిల్లా, అవనిగడ్డ: కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా గ్రామంలో రెండు వర్గాల నడుమ ఆధిపత్య పోరుకు దారి తీసింది. కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన కొందరు వైసిపి నేతలు గ్రామ సమీపంలోని కృష్ణానది పాయ నుండి ఇసుకను అక్రమంగా ఎడ్లబండ్లతో తరలిస్తూ గ్రామస్తులకు విక్రయిస్తూ ఉండగా ఈ ధరతో కొనలేని కొందరు గ్రామస్తులు సమీప గ్రామాల నుండి ఎడ్లబండ్లను పిలిపించుకుని కూలి రేట్లకే కావాల్సిన ఇసుకను తోలుకుంటున్నారు.
దీనితో ఆగ్రహించిన గ్రామానికి చెందిన వైసీపీ నేతలు బయటి గ్రామం నుండి వచ్చిన ఇసుక బండ్లను అడ్డగించి బండి ఒక్కంటికి 350 రూపాయలకు ఇసుక తోలితే తమకు నష్టం ఏర్పడుతుందని బయట గ్రామాలవారు తోలడానికి వీల్లేదని అడ్డగించగా..తక్కువ ధరకు ఇసుక తరలించుకుంటుంటే అడ్డగించడానికి మీరవరంటూ వైసిపి నేతలపై తిరగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇసుక తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇసుక తోలే ప్రదేశం సి.ఆర్.జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ అధికారులు ఎడ్లబండ్లతో ఇసుక తోలుకునేందుకు ఎలా అనుమతిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందని గ్రామానికి చెందిన పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై మోపిదేవి తహసీల్దార్ మస్తాన్ స్పందిస్తూ స్థానిక ఇళ్ల నిర్మాణ అవసరాలకు మినహాయించి ఎవరైనా వ్యాపారానికి ఇసుక వినియగిస్తే చర్యలు తీసుకుంటామని, సమీప గ్రామాల ప్రజలు ఎవరైనా సచివాలయం నుంచి అనుమతి తీసుకొని ఇసుక ఉచితంగా తీసుకోవచ్చని తెలిపారు.