విజయవాడ: నగరంలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్ వద్ద రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీలర్ల అధ్యక్షుడు మండాది వెంకట్రావు మాట్లాడుతూ జీవో నెంబర్ 10 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్ హయాం నుంచే గన్నీ సంచులు డీలర్లకు ఇచ్చారని, అప్పటి నుంచి కమిషన్‌తో పాటు గన్నీ బ్యాగులు డీలర్లు అమ్ముకుంటున్నారన్నారు.. ఇప్పుడు బ్యాగుల కొరత పేరుతో ప్రభుత్వమే తీసుకుని ఒక్కో సంచికి 20 రూపాయలు ఇస్తామని చెప్పిందన్నారు..
ఇప్పుడు అధికారులు గన్నీ బ్యాగులకు డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదంటున్నారని, దీని వల్ల డీలర్లు ఆర్ధికంగా మరింత నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు కూడా రాకపోతే రేషన్ షాపులు ఎలా నడపాలని ప్రశ్నించారు.
వేలకు వేలు జీతాలు తీసుకునే అధికారులు అన్యాయంగా నిర్ణయాలు చేస్తున్నారని, పది నుంచి పదిహేనువేల ఆదాయంలో సగం కోత వేస్తున్నారన్నారు.. ఇలాగైతే డీలర్లు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్నారు. దశాబ్దాల తరబడి ఎండీఎం, ఐసీడీఎస్ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సిఎం జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని మండాది వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.