– హారతులతో స్వాగతం పలికిన మహిళలు
– TRS వెంటే మేము అని నినదించిన ప్రజలు
హుజూరాబాద్ ఉప ఎన్నిక లో TRS అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు తధ్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం మామిడాలపల్లి, గొల్లపల్లి, ఎలబాక, గన్ ముక్కల, మల్లన్న పల్లి, బ్రాహ్మణ పల్లి, నర్సింగా పూర్, వల్లభా పూర్ తదితర గ్రామాల లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ MLC ఎగ్గే మల్లేశం, MLA మనోహర్ రెడ్డి లతో కలిసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
మామిడాలపల్లిలో డోలు మోగించి ప్రచారాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల్లో మంత్రికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడుల కోసం ఎకరానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. పేదింటి ఆడపడుచుల పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.
కులవృత్తులకు చేయూత అందించడం ద్వారా ఆయా వృత్తులపై ఆధారపడి న కుటుంబాలు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎవరు అడగకుండానే గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నTRS ప్రభుత్వానికి అండగా నిలవాలని, బలహీన వర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి గెల్లు గెలుపుతోనే సాధ్యం అన్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి మాజీమంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం పై అర్ధం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని చెప్పారు.
బండి సంజయ్ MP గా గెలిచి 2 సంవత్సరాలు దాటిందని, ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చావో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ గెలిస్తే BJP పార్టీకి ప్రస్తుతం ఉన్న ఇద్దరు MLA లకు తోడు మూడో MLA అవుతారు తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగదు అన్నారు. ఇప్పటి వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు అన్ని TRS ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయని చెప్పారు.
ఓటమి భయంతో BJP నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దని చెప్పారు. ఇంకా 2 సంవత్సరాలకు పైగా TRS ప్రభుత్వం ఉంటుందని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, సహాకారం అందుతాయని అన్నారు.
ఈటెల గెలిస్తే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు: తలసాని
సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజల్లో స్పష్టత ఉంది. 74 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎవరూ ఇన్ని కార్యక్రమాలు చేయలేదు. రైతులకు రైతు బంధు, రైతు భీమా ఇస్తున్నాం. వడ్లను ప్రభుత్వమే సమయానికి కొంటోంది. ఓడిపోతామనే భయంతో ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనదని ప్రచారం చేశారు.. ఇప్పటికే ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లు కొంటున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం వన్ పై చిలుకు ఉద్యోగాలను భర్తీ చేసింది.. అనేక రంగాల్లో లక్షలాది మందికి ఉపాధి వచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కులవృత్తులను ప్రోత్సహిస్తున్నాం.. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు తెచ్చాము.
ఈటెల గెలిస్తే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. విద్యార్థి ఉద్యమ నాయకుడు.. పేదింటి బిడ్డను గెలిపిస్తాం అని ప్రజలు అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏదోఏదో మాట్లాడుతున్నారు.. చేసేది ఉంటే చెప్పాలి. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ కు దిక్కు లేదు.. హుజురాబాద్ లో బీజేపీ ఉందా..?
కమ్యూనిస్టు సిద్దాంతాలు చెప్పే ఈటెల రాజేందర్ మతతత్వ పార్టీలో చేరారు.. ప్రజలకు ఏం చెప్తారు?
ఈటెలది స్వయంకృతాపరాధం.. దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. పేదోన్ని అంటున్నాడు.. పేదోడికి 8 ఎకరాల్లో ఇల్లు ఉంటుందా? కేంద్రంలోని ఇండియా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలి.. ఒక ప్రాజెక్టు ఇవ్వాలి కదా? గెల్లు శ్రీనివాస్ యాదవ్ బ్రహ్మాండమైన మెజారిటీ గెలుస్తున్నారు.. ప్రజల్లో మంచి అవగాహన ఉంది. సీఎం కేసీఆర్ తో అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది.. రావనుకున్న నీళ్లు, కరెంటు వచ్చింది.. ఒకప్పుడు కరెంటు లేక రాత్రి పూట బావ దగ్గరికి వెళ్లి నిద్ర పోయే వాళ్ళని చెబుతున్నారు. సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలనేదే మా ఆకాంక్ష.
పైలెట్ ప్రాజెక్టుగా మొదలైన దళిత బంధును ఆపారు.. కొంత మేర సంతోషపడ్డా.. నవంబర్ 4వ తేదీ తర్వాత మళ్లీ కొనసాగుతుంది. ఈటెల రాజేందర్ పెద్ధోడు.. గెల్లు శ్రీనివాస్ చిన్నవాడు అంటున్నారు.. నాగార్జున సాగర్ లో నోముల భగత్.. జానారెడ్డి మీద గెలిచాడు.. సేవకు వయసు పరిమితం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రజలకు శ్రీరామ రక్ష. ఈటెల రాజేందర్ తనను తాను పెద్దగా ఊహించుకున్నాడు.. తానొక్కడే పోతే ప్రపంచం కింద మీద అవుతుందన్నట్టుగా మాట్లాడాడు.
అన్నీ తన వల్లే వచ్చాయని ఈటల రాజేందర్ అంటున్నాడు.. కాలేశ్వరం నీళ్లు, కెసిఆర్ కిట్టు ఇవన్నీ ఈటల వల్లే వచ్చాయా? ఇవాళ హుజురాబాద్ లో జరుగుతున్న పనులు ఈటల రాజేందర్ కు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఎంపీగా గెలిచిన బండి సంజయ్ రెండున్నరేళ్లలో నియోజకవర్గానికి రాకుండా ఉంటారా? బండి సంజయ్ ఒక్కపైసా అయినా కేంద్రం నుంచి తీసుకొచ్చాడా? రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాడు.. వాళ్ళ పరిస్థితి మన అందరికీ తెలుసు.