– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, నవంబర్ 3: రాష్ట్రంలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల్లో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం జరుగుతుందని, ఈ మేరకు సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవి మాట్లాడుతూ గుడివాడ ప్రభుత్వాసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నామన్నారు. ఆసుపత్రిలో ఈఎన్టి, గైనిక్ వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కొత్తగా ఫిజియోథెరపి వైద్యులు డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆప్తాల్మాలజీ వైద్యులు డాక్టర్ ప్రశాంతిలు బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ఇకపై ప్రభుత్వాసుపత్రిలోనే కంటి సమస్యలకు అవసరమైన వైద్యం అందించడంతో పాటు శుక్లాల శస్త్రచికిత్సలను కూడా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడుతూ పిడియాట్రిక్ వార్డులో మెరుగైన వైద్యం అందించేందుకు రూ.20 లక్షల వ్యయంతో అధునాతన వైద్య పరికరాలను సమకూర్చడం జరిగిందని చెప్పారు. రూ. 2 కోట్ల వ్యయంతో ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.