దివ్యాంగుల కోటాలో రైతుబజార్లో స్టాల్ ను కేటాయించండి

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి వినతి
గుడివాడ, నవంబర్ 3: దివ్యాంగుల కోటాలో గుడివాడ రైతుబజార్లో స్టాలు కేటాయించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను కోరారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం పాత రామాపురానికి చెందిన నత్తా మధు కలిశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గుడివాడ రైతుబజార్లో స్టాల్ కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. స్టాల్ కేటాయించి ఉపాధి కల్పించాలని మధు కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ స్టాల్స్ కేటాయింపు విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్తో మాట్లాడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం తదితరులు పాల్గొన్నారు.