బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం వైసీపీకి చెంపపెట్టు..

– కన్నా లక్ష్మీనారాయణ..
బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టమైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు. గుంటూరు లోని తన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. బద్వేలు ఉప ఎన్నిక బిజెపి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించిందని అన్నారు సీఎం సొంత జిల్లాలో లక్ష మెజారిటీ సాధిస్తామని గొప్పలు చెప్పిన నేతలు ఆ మెజారిటీ రాకపోవడంతో అంతర్మథనంలో పడ్డారు అని అన్నారు.
గడపగడపకు వెళ్లి వాలంటర్లతో సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి పోటీలో లేనప్పటికీ బిజెపి ఆదరణ చూసి బెంబేలెత్తిన అధికార పార్టీ నేతలు అంగబలం, అర్థబలం ప్రయోగించారని అన్నారు. మండలానికి ఒక మంత్రి ముగ్గురు మంత్రులకు మరొక మంత్రి ఇన్చార్జిగా ప్రతి మండలానికి ఐదుగురు ఎమ్మెల్యేలు, కుల నాయకులు ఇలా అందరినీ రంగంలోకి దించి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు.
బద్వేలులో గెలుపు జగన్ కు ఒక హెచ్చరిక అని ప్రజాస్వామ్యబద్ధంగా అది గెలుపే కాదని, నైతికంగా బిజెపి గెలిచిందని వివరించారు. అధికార దుర్వినియోగం తో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకతను గుర్తించిన వైసిపి ప్రతి ఓటుకు నోటు ఇచ్చి దొడ్డిదారిలో గెలిచారని విమర్శించారు.ప్రభుత్వంపై వ్యతిరేకత బద్వేలు ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అని అన్నారు. బిజెపి ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తో కలిసి పని చేస్తామని అన్నారు. రాజధాని ఎక్కడుందో చెప్పలేని దుస్థితి ఈ ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. రాజధాని రైతుల పాదయాత్రకు కర్ణ సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని, ఉద్యోగ భద్రత కు స్టీల్ ప్లాంట్ మనుగడకు ఎలాంటి డోకా ఉండదని వివరించారు.కన్నాతో పాటు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయల కిషోర్ బాబు, జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ లు పాల్గొన్నారు.