– తుళ్లూరు CRDA కార్యాలయం ముందు పెద్దఎత్తున ధర్నా
– ఆకలితో అలమటిస్తున్నామంటూ ఖాళీ ప్లేట్లతో నిరసన
– అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్
– ధర్నాకు నాయకత్వం వహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు, రాజధాని నేతలు రవి తదితరులు
– అధికారులకు వినతిపత్రం సమర్పించిన పేదలు
ఈ ధర్నా సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ….రాజధాని ప్రజల నోట్లో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మట్టి కొట్టాయి. నోటి కాడ కూడు లాగేసాయి. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్ రాజధాని ప్రాంత వాసులకు నమ్మకద్రోహం చేశారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని మాట ఇచ్చి విస్మరించారు.
రాజధాని వాసులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. రాజధానికి భూములు ఇచ్చారు, వ్యవసాయం లేకుండా పోయింది, ఉపాధి లేదు. రాజధాని పేదలకు ఇచ్చే పెన్షన్ నాలుగు నెలల నుండి చెల్లించడం లేదు, పెన్షన్ 2,500 రూపాయల నుండి 5000 రూపాయలక పెంచుతాన్న మాట నిలబెట్టుకోలేదు.
రాజధానిను చిట్టడవి లాగా మార్చేశారు. వ్యవసాయ పనులు లేవు, రాజధాని పనులు నిలిచిపోయాయి, భవన నిర్మాణాలు సాగటం లేదు, జాతీయ ఉపాధి హామీ పనులు రాజధానిలో పూర్తిగా తొలగించారు. చేసుకోవడానికి పనిలేక, ప్రభుత్వ సహాయం రాజధాని పేదలు ఆకలితో అలమటిస్తున్నారు.
వాలంటీర్లు ,పారిశుధ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశా తదితర వారి కుటుంబాలకు ఉద్యోగాలు అనే సాకుతో 2500 రూపాయలు పెన్షన్ కూడా రద్దు చేశారు. దళితులకు అన్యాయం చేశారు, అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ కాదు కదా , కనీసం కౌలు కూడా ఇవ్వటం లేదు. పేదలు 50 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ఇళ్ల కోసం డిపాజిట్లు చెల్లించి మూడు సంవత్సరాలు గడిచింది. రాజధాని లో నిర్మించిన 5 వేల ఇళ్లు వృధాగా పడి ఉన్నాయి. రైతులకు రిటర్న్ బుల్ ప్లాట్లు అభివృద్ధి ఏమాత్రం లేదు, తట్టెడు మట్టి కూడా వేయడం లేదు. ఉచిత విద్య ,వైద్యం హామీలు గాలికొదిలేశారు రాజధానిలో పనుల కోసం రాష్ట్ర నలుమూలల నుండి పేదలు వలస వచ్చేవారు, ఇప్పుడు పరిస్థితి రివర్సయింది. రాజధాని పేదలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. మొత్తంగా రాజధాని వాసులు అందరిని ప్రభుత్వాలు నట్టేట ముంచాయి. 3 రాజధానుల పేరుతో అమరావతి ప్రాంత ప్రజల పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టినట్టు వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ మట్టి నీరు ఇచ్చి ప్రజల నోట్లో మట్టి కొట్టారు. కేంద్ర బడ్జెట్ లో నయాపైసా అమరావతి కోసం కేటాయించడం లేదు. అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
రాజధానిలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండాపోయింది. పారిశుద్ధ్య కార్మికులకు 18 వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి పదివేల రూపాయలు తోనే సరిపెతుతున్నారు. రాజధానిలోనీ ప్రజలందరినీ రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా ముద్ర వేస్తూ, నూటికి 75 శాతం మందిగా ఉన్న పేదలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారుభూ సమీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది.
రాజధాని పేదలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలి. రాజధాని ప్రజలకు పని చూపించాలి. పెన్షన్ బకాయిలు చెల్లించాలి. దళితులకు సమాన ప్యాకేజీ ఇవ్వాలి. కౌలు చెల్లించాలి.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర సచివాలయం, విజయవాడ సి .ఆర్ డి.ఏ కార్యాలయం ముందు ఆందోళన చేపడతాం. ఆందోళన ఉధృతం చేస్తాం.
రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. రాజధానిలోని పేదలు, రైతులు, కూలీలు అన్ని వర్గాల ప్రజల ఆందోళనకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించాలి. సంఘీభావంగా
నిలవాలి. సిపిఎం.. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని కోరుతోంది.
రాజధాని పేదలు, ప్రజలందరికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఆందోళన సిపిఎం కొనసాగిస్తుంది. CRDA కార్యాలయం వద్ద రాజధానిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు పేదలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఖాళీ ప్లేట్లు చేపట్టి ఆకలి బాధలను తెలియచెప్పారు. ప్లే కార్డులు ధరించి నినాదాలతో హోరెత్తించారు.