Suryaa.co.in

Telangana

గొర్రెల యూనిట్లకు లబ్ధి దారులు వాటాధనం చెల్లించాలి

ప్రభుత్వం సబ్సిడీ పై పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్ ల కోసం లబ్దిదారులు తమ వాటాధానం డీడీలు చెల్లించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక పథకం ద్వారా గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. గొర్రెల యూనిట్ ల పంపిణీ లో ప్రభుత్వ వాటా 75 శాతం కాగా, 25 శాతం లబ్దిదారుడి వాటా అని చెప్పారు. మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు.
పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ ధరను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించగా, వెంటనే స్పందించి యూనిట్ గొర్రెల ధరను లక్ష 25 వేల రూపాయల నుండి లక్ష 75 వేల రూపాయలకు పెంచారని మంత్రి అన్నారు. ఇప్పటికే డీడీ చెల్లించిన 4,761 మంది లబ్దిదారులు పెరిగిన యూనిట్ ధరకు అనుగుణంగా 12,500 రూపాయల అదనపు వాటాధానంను చెల్లించారని తెలిపారు. వీరిలో 1119 మందికి గొర్రెల యూనిట్ లను పంపిణీ చేసినట్లు వివరించారు. అర్హులైన లబ్దిదారులు అందరు వాటాధానం చెల్లించి గొర్రెల యూనిట్ లను పొందాలని కోరారు. డీడీలు చెల్లించిన లబ్దిదారులకు వెంట వెంటనే గొర్రెల యూనిట్ లను అందజేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
ఈ నెల 20 వ తేదీ లోగా చేప, రొయ్య పిల్లల పంపిణీ ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి తలసాని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 18336 నీటి వనరులలో 50.60 కోట్ల చేప పిల్లలను 30 రిజర్వాయర్ లలో 1.92 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు.

LEAVE A RESPONSE