Suryaa.co.in

Andhra Pradesh

భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత:లేళ్ళ అప్పిరెడ్డి

ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత అని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. పౌరాణిక ప్రాశస్త్యానికి, సాంప్రదాయానికి ఆలవాలం అవులని తెలిపారు. ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటి ఆవరణలోని వరసిద్ధి వినాయక దేవాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, డీసీసీబీ ఛైర్మన్‌ లాలుపురం రాముతో కలిసి లేళ్ళ అప్పిరెడ్డి ప్రారంభించారు.
అనంతరం లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, భారతదేశానికి రైతు వెన్నుముక అయితే… అన్నదాతలకు ఆత్మబంధువు ఆవు అని పేర్కొన్నారు. ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్‌లో రైతు నేస్తాలుగా ఆవులు వర్ధిల్లుతున్నాయన్నారు. అన్నదాతలతో అవినాభావ సంబంధం గల ఆవులకు – రైతులతో నిత్యం సంబంధ బాంధవ్యాలు నెరిపే మిర్చియార్డులో గోశాల ఏర్పాటు చేయడం సముచితమని అభిప్రాయపడ్డారు.
ఔషద సేవనలో… ఆచార వ్యవహారాలకు… ఆరాధనా ప్రక్రియలో… అవులు, వాటి ఉత్పత్తులకే అధిక ప్రాధన్యాతగా ఆయన వివరించారు. అందుకే భారతీయులచే అనాది నుంచి గోవు ఆరాధ్య దేవతగా పూజలందుకుంటుందని ఆయన వెల్లడించారు. మిర్చియార్డు పాలకవర్గం, మిర్చి వ్యాపారస్తుల సహాయ సహకారాలతోనే యార్డులో గోశాల ఏర్పాటు సాధ్యమైందని అప్పిరెడ్డి తెలిపారు. ఇదే క్రమంలో ఈ నెల 11వ తేదీ నుంచి ఇక్కడే అయ్యప్ప భక్తులకు అన్నదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వరసిద్ధి వినాయకుడు సన్నిధిలో గోశాల ఏర్పాటు చేయడంతో పాటు అయ్యప్పలకు అన్నదానం చేసే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు.
మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ, గుంటూరు మిర్చియార్డు రైతులదని పేర్కొన్నారు. పాలకవర్గంగా తాము వ్యాపార ధోరణితో కాకుండా సదా రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తున్నట్లు చెప్పారు. అన్నదాతల అభ్యున్నతికి పాటుపడుతున్న మిర్చియార్డులో రైతులకు అనేక రకాలుగా అండదండగా నిలవడమే కాక గోమాతగా హిందువులచే ఆరాధింపపడే ఆవులకు గోశాల ఏర్పాటు చేసి ఒక సరికొత్త సంస్కృతికి నాంధి పలికిన ఘనత అప్పిరెడ్డికే దక్కుతుందని తెలిపారు. దీంతో పాటు 11వ తేదీ నుంచి యార్డులోనే అయ్యప్ప భక్తులకు అన్నదానం చేసే ఒక మంచి కార్యక్రమానికి అప్పిరెడ్డి శ్రీకారం చుట్టడం కూడా యార్డుకు శుభపరిణామమని తెలిపారు.
డీసీసీబీ ఛైర్మన్‌ లాలుపురం రాము మాట్లాడుతూ, మానవ జాతికి ఆవుకన్నా మిన్నగా ఉపకారం చేసే జీవజాలం మరోటి లేదని తెలిపారు. అందుకే గోవును ఎక్కువ మంది మాతగా పూజిస్తుంటారన్నారు. అంతటి ప్రాశస్త్యం గల ఆవులకు ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేయడం, వాటికి సేవ చేయడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మిర్చియార్డు పాలకవర్గం, అధికారులు, మిర్చి వ్యాపారస్తులు, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), మార్కెట్‌బాబు, కాండ్రగుంట గురవయ్య, రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, గేదెల రమేష్, మారుతీ కోటిరెడ్డి, బోడపాటి కిషోర్, సాధు రాజేష్, పార్టీ నేతలు సోమి కమల్, యర్రం కృష్ణారెడ్డి, టెంట్‌హౌస్‌ బాబు, ఓర్సు శ్రీనివాసరావు, ఫరియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE