ప్రతిపక్షం తమకు పోటీ కాదనీ… రాష్ట్రంలోని పేదరికంతోనే తమ పోరాటమనీ… శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాష్ట్ర అభివృద్ధి కోసం… ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం… పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం… సీఎం జగన్ చిత్తశుద్ధితో చేపట్టిన కార్యక్రమాలకు విపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు.
గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తేలుకుట్ల యోగేశ్వరరావు తదితర తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో ఆమె ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పరిపాలన దక్షతకు యావత్ ప్రజానీకమే కాక విపక్షానికి చెందిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా ఆకర్షితులవుతున్నట్లు చెప్పారు. రాష్ట్రం మొత్తం ప్రశాంత వాతావరణంలో సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగుతుంటే… అది చూసి ఓర్వలేక చంద్రబాబు, లోకేష్‌తో సహా ఆ పార్టీకి చెందిన చోటామోటా నాయకులంతా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నీచ నికృష్ట రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీటన్నింటినీ ఓ వైపు ఎదుర్కొంటూనే మరోవైపు అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ పాటుపడుతున్నారని తెలిపారు. ఈ నేపధ్యంలో జగన్ పరిపాలన నచ్చి ఆయన నాయకత్వంలో నడవాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలోకి భారీగా నేతలు తరలివస్తున్నారని తెలిపారు. అలా వచ్చిన 19వ డివిజన్ కార్పొరేటర్ హనుమాయమ్మ, తెలుగుదేశం నేత యోగేశ్వరరావు తదితర కార్యకర్తలకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు.
టీడీపీలో ఇంకా మిగిలి ఉన్న కొద్ది మంది నేతలు కూడా ఆలోచన చేయాలని అప్పిరెడ్డి కోరారు. ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన కావాలా…? లేక దాన్ని అడ్డుకునే దుష్ట రాజకీయం కావాలో… తేల్చుకోవాలని వారికి పిలుపునిచ్చారు. అసలు తెలుగుదేశం పార్టీ తమకు పోటీయే కాదన్న వాస్తవాన్ని వారు గుర్తెరగాలని సూచించారు. ఈ రాష్ట్రంలో తాము పొరాడుతుంది తెలుగుదేశం పార్టీపై కాదనీ… ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పెచ్చుమీరిన పేదరికంపై పోరాడుతున్నామనీ… లేళ్ళ అప్పిరెడ్డి వివరించారు.
ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఫెయిలయితే… ప్రస్తుతం విపక్ష నేతగా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలిపారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వారే ప్రస్తుతం ఆ పార్టీ అగ్ర నేతలుగా చలామణి అవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ స్వార్ధ, సంకుచిత రాజకీయాలపై విరక్తి చెందే తాను ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనలాగే చాలా మంది ఆ పార్టీలో ఇమడలేక ఎక్కడికక్కడే వైసీపీలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు. అదే కోవలో తాజాగా 19వ డివిజన్ కార్పొరేటర్ హనుమాయమ్మ కూడా తన అనుయాయులతో తెలుగుదేశాన్ని వీడి వైసీపీ గూటికి చేరినట్లు ఆయన వివరించారు.
ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందన్నారు. ఇదే జగన్ జనరంజక పాలనకు నిదర్శనమని తెలిపారు. మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అన్ని వర్గాల ప్రజల్లో అపూర్వ ఆదరణ వ్యక్తమవుతుందన్నారు. కుల, మతాలు, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి అందరికీ లబ్ది చేకూర్చడం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, పార్టీ నేత షేక్ షౌకత్, 19వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ పల్లపు మహేష్, భట్రాజు కార్పొరేషన్ డైరెక్టర్ రామరాజు, కార్పొరేటర్లు షేక్ రోషన్, దూపాటి వంశీ, 19వ డివిజన్ పార్టీ నేతలు స్టార్ మస్తాన్, మురళి, 20వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఖాజా తదితరులు పాల్గొన్నారు.