– నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
– అమరావతి బహుజన జెఎసి బాలకోటయ్య
తిరుపతిలో జరగనున్న దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశంలో మూడు రాజధానులకు నిధులు అడగాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించటం హాస్యాస్పదమని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. మూడు రాజధానులతో పాటు మరో పది రాజధానులు కలిపి మొత్తం 13 రాజధానులకు నిధులడిగితే బావుంటుందని, జిల్లాకో రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని అభివర్ణించారు.ఒక్క రాజధానికి రెండున్నరేళ్ళ పాలనలో రూపాయి బిళ్ళ తీసుకురాలేని ప్రభుత్వం మూడు రాజధానులు నిధులు అడగుతామనే అంశాన్ని తప్పుబట్టారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2014 _17 మధ్య రూ.2,500 కోట్ల రూపాయలు కేటాయించిందని, అందులో రూ.1,500 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఈ రూ.1,500 కోట్లు నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి దాదాపు 10 వేల కోట్ల రూపాయలతో అమరావతిలో భవన నిర్మాణాలు, సచివాలయం, శాసనమండలి, హైకోర్టు నిర్మాణాలు జరిగినట్లు తెలిపారు. ఒకపక్క ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉంటూ రాజధాని రైతులు మహా పాదయాత్ర చేపడితే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులకు నిధులు అంటూ మండలిలో ప్రతిపాదించటం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు గా ఉందని ఆయన తెలిపారు .
రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా మూడు రాజధానులు పేరుతో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా వైకాపా నాయకులు తెర వెనుక నుండి మూడు రాజధానులు పాదయాత్ర చేద్దామని మంటలు రేపుతున్నట్లు ఆయన ఆరోపించారు .13 జిల్లాల చిన్న రాష్ట్రానికి విభజన మంటలు వద్దని చెప్పిన ముఖ్యమంత్రి రాజధానులనూ రివర్స్ టెండరింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు . మహా పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసైనా రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకోవాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.