– జగన్ జగడం కోరుకుంటున్నారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అణచివేసే కొద్దీ ఆత్మగౌరవం రెట్టింపవుతుంది. జగన్ ఇప్పటి వైభవానికి అప్పటి యుపిఏ సర్కారు అణచివేత వైఖరే కారణమన్నది విస్మరించకూడదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో అణచివేత కొద్దికాలమే ఫలితమిస్తుంది. సర్వకాలం తనదనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటుండదు. ఇందిర, రాజీవ్, ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత వంటి నేతల చరిత్ర దానికి నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్రపై, జగనన్న సర్కారు దాష్ఠీకం కూడా అలాంటిదే. ఇప్పుడున్న ఆర్ధిక సంక్షోభ సమయంలో, రైతులను కెలకడం కోరి కయ్యం తెచ్చుకోవడమే.
నిజానికయితే.. 151 మంది ఎమ్మెల్యేల మెజారిటీతో తిరుగులేని సంతృప్తికర స్థాయిలో ఉన్న జగన్, అసలు మిగిలిన విషయాలేమీ పట్టించుకోకుండా, సుపరిపాలనపైనే దృష్టి పెట్టాలి. తండ్రి వైఎస్ మాదిరిగా శత్రువులను సైతం మిత్రులను చేసుకోవాలి. అప్పుడే కదా.. తాను అనుకున్న ‘30 ఏళ్ల సీఎం’ కల నెరవేరేది?! అప్పుడే కదా తాను చెప్పినట్లు తన ఫొటో ప్రతి ఇంట్లో ఉండేది?! కానీ ఆయనకు పగలూ,రాత్రీ ఆ పదహారునెలల జైలు జీవితం- అందుకు కారకులైన వారిని జైల్లో పెట్టించాలన్న ప్రతీకారేచ్ఛనే కనిపిస్తోంది. అసలు సమస్యకు అదే మూలం అని తెలుసుకుంటే, జగనన్న ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో సులభంగా అర్ధమవుతుంది. ఎందుకంటే అది సైకాలజీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి!
కొందరికి సమస్యలు లేకపోవడమే పెద్ద సమస్య. సమస్యలుంటేనే కొందరు హాయిగా నిద్రపోగలరు. అది జగన్‌కు సరిగ్గా వర్తిస్తుందన్నది, ఈ రెండున్నరేళ్ల కాలంలో సులభంగానే అర్ధమవుతుంది. రాజకీయంగా, ఆర్ధికంగా, సాంకేతికపరంగా ఇప్పట్లో జగనన్న సర్కారుకు వచ్చిన గత్తరేమీ లేదు. విపక్షాల గురించి ఆలోచించకుండా, హాయిగా కాలుమీద కాలేసుకుని పాలించవచ్చు. మరి అలా చేస్తే ఆయన జగన్ ఎందుకవుతారు? ఇప్పుడదే కదా సమస్య! తన నిర్ణయాలతో.. ఉనికి కోసం, పరువు కోసం పోరాడుతున్న టీడీపీని.. తిరిగి తనను సవాల్ చేసే పరిస్థితిని జగనన్నే కొని తెచ్చుకున్నారు. ఆ పార్టీ ఆఫీసుపై రౌడీమూకలను ఉసిగొల్పి, ఉచిత ప్రచారం-సానుభూతి జమిలిగా కల్పించారు. తన పార్టీ పప్పుగా ముద్ర వేసి అల్లరి చేసిన అదే లోకష్‌ను.. ఇప్పుడు తన పాలననే అల్లరిపట్టించేంత రాటుదేలేలా, తీర్చిదిద్దుతున్న పుణ్యం కూడా జగనన్నే కట్టుకున్నారన్నది మనం మనుషులం అన్నంత నిజం. గత ఎన్నికలకు ముందు.. టీడీపీ పతనం కోరుకున్న బీజేపీ-జనసేనను, తిరిగి అదే టీడీపీని సాధ్యమైనంత త్వరగా జతచేయడంలో జగనన్న కృషిని కొట్టివేయలేం. ఇవన్నీ జగన న్న పుణ్యాలేనన్నది వైకాపేయుల కితాబు!
ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ప్రాతిపదిక కావచ్చు. కానీ చావుకు-లంఖణానికీ అదే సూత్రం కాదు. తనకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినందున, తానేం చేసినా చెల్లుతుందన్న మొండి వైఖరికి జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. అధికారం ఉన్నందున అధికారులు, తాను ఏం చెప్పినా వాటిని అమలు చేయవచ్చు. కానీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ, వారి విధేయతలో మార్పు రావడం అనివార్యం. ఎందుకంటే ఉద్యోగులు చాలా లౌక్యులు. పోస్టింగులు, ప్రమోషన్ల కోసం నిస్సిగ్గు- నిర్లజ్జగా పాలకుల పల్లకీ మోయవచ్చు. పార్టీ కార్యకర్తలు కూడా ఈర్ష్యపడేలా భజన చేయవచ్చు. కానీ పరిస్థితి.. తామెత్తుకున్న పాలకపార్టీలకు అనుకూలంగా లేదంటే, రాజకీయ నేతలకంటే సులువుగా ప్లేటు తిప్పడంలో.. వారిని మించిన వారు మరొకరుండరన్నది చరిత్ర చెప్పిన సత్యం. అలాంటి చారిత్రక సత్యాలను మనం చాలా చూశాం. విధేయతలు మారడానికి కొన్ని సంఘటనలు చాలు.
విపక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను బేరం పెట్టిన నాటి సీఎంఓ ప్రముఖుడే, మళ్లీ జగన్ వద్దకు చేరారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనల్లో.. ఆయన కాళ్ల కింద కూర్చుని అతి విధేయత ప్రదర్శించిన మరో అధికారి, మళ్లీ జగన్ వద్ద చక్రం తిప్పుతుండటం దానికి చిన్న ఉదాహరణ మాత్రమే. చెప్పుకుంటూ పోతే, అధికారుల ఆర్ట్ ఆఫ్ లీవింగ్ చాలా ఉంది. సుదీర్ఘకాలం రాజకీయాలు, జర్నలిజంలో ఉన్న వారికి అది అనుభవమే.
ఇప్పుడు అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో.. ఓవర్ యాక్షన్ చేస్తున్న ఇదే పోలీసులు, రేపు విధేయత మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అసలు రైతులు వారి మానాన వారు పాదయాత్ర చేస్తుంటే ఆంక్షలెందుకు? వాళ్లేమీ రాజకీయ ప్రసంగాలు చేయడం లేదు కదా? రైతుల నడకతో పాలకపార్టీ పడిపోదుకదా? పాదాలు అరగదీసుకుని తిరుమలకు వెళుతున్నారు.
వైసీపీ గళధారులన్నట్లు, అది టీడీపీ ప్రాయోజిత కార్యక్రమమే కావచ్చు. దానికి ఆ పార్టీ బహిరంగంగానే మద్దతునీయవచ్చు. ఒక వర్గం మీడియా దానిని హిమాలయమంత ఎత్తున ప్రచారం ఇవ్వవచ్చు. జర్నలిస్టులు ఓవర్‌యాక్షన్ చేస్తూ, చానెళ్ల టీఆర్‌పీ పెంచుకునే ప్రయత్నం చేస్తుండవచ్చు. అంతమాత్రాన కొడాలి చెప్పినట్లు.. జగనన్న వంటి మేరునగధీరుడు, పులివెందులు పులి- సింహం.. ఆఫ్టరాల్ పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్రకే బెదిరిపోవడం ఏమిటిన్నదే ఆశ్చర్యం!
అవును. తమ్మినేని సీతారాం, బొత్స సత్తిబాబు లాంటి మాటల ప్రకారం.. శ్మనానంలో నివసిస్తున్న అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు, పాలకులు పరేషానవ్వాల్సిన పనేలేదు. కొడాలి నాని వంటి మంత్రుల మాటల్లోనే చెప్పాలంటే.. పెయిడ్ ఆర్టిస్టులు నిర్వహించే పాదయాత్రను పాలక పార్టీ అసలు లెక్కచేయాల్సిన పనేలేదు. తడిబట్టేసుకుని సుకూన్‌గా ఉండొచ్చు. కొన్ని గ్రామాలకే పరిమితమయిన రాజధాని ఉద్యమం గురించి, పాలకపార్టీ ఉలిక్కిపడాల్సిన అవసరం అంతకంటే లేదు. టీడీపీని సమర్ధించే పెట్టుబడిదారులు, కమ్మ వ్యాపారవేత్తలు భూములు కొన్నవారి ప్రాయోజిక అమరావతి రైతుల పాదయాత్రకు.. అణువంత కూడా ఆగం కావల్సిన పనిలేదు. కానీ.. పాదయాత్రలో 157 మంది మాత్రమే పాల్గొనాలని, ఉపన్యాసాలు ఇవ్వకూడదని, లౌడ్‌స్పీకర్లు వాడకూడదన్న ఆంక్షలెందుకున్నదే అందరి ఆశ్చర్యానికి కారణం. అసలు ఆ దిక్కుమాలిన 157 సంఖ్యే విచిత్రం! బహుశా జగనన్న పార్టీ గెలిచిన 151 మందితోపాటు, టీడీపీ నుంచి బయటకొచ్చి మద్దతునిచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య , ఆ ఆంక్షల అంకెకు కారణం కావచ్చన్న కొలికపూడి శ్రీనివాసరావు వ్యంగ్యోక్తి నిజం కావచ్చేమో?!
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుట్టి, సంచలనం నమోదు చేసిన తొలి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. అసలు అధికారంలోకి రావడానికి పాదయాత్ర అనేది సులభం- కష్టతరమైన నిచ్చెనమెట్టన్నది ఆయన చూపిన మార్గమే. ఒకరకంగా తెలుగు రాజకీయాలను మలుపు తిప్పిన మహానేత వైఎస్.ఆయన విపక్షనేతగా ఉండగా.. చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించినప్పుడు సీఎం చంద్రబాబు. వైఎస్ పాదయాత్రకు ఆది నుంచి తుది వరకూ, అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు ఎలాంటి అడ్డంకులూ సృష్టించలేదు. అటు వైఎస్ కూడా దానికి సంబంధించి పల్లెత్తు విమర్శ కూడా చేయలేదు. తన పాదయాత్రలో వైఎస్.. నాటి సీఎం బాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. అన్ని వర్గాలనూ టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా సమీకరించారు. అయినా.. అప్పటి డీజీపీ ఇప్పటిమాదిరిగా.. 157 మంది మాత్రమే వైఎస్ పాదయాత్రలో పాల్గొనాలని నిషేధాజ్ఞలు జారీ చేయలేదు. నిజంగా ఇప్పటి సీఎం జగన్ మాదిరిగా.. అప్పుడు చంద్రబాబు నిషేధాజ్జలు విధించి, పాదయాత్రపై పోలీసులను ప్రయోగించి ఉంటే, వైఎస్ సీఎం అయ్యేవారు కాదన్నది నిష్ఠుర నిజం.
నిజానికి వైఎస్ కంటే ముందు.. పాదయాత్ర సంస్కృతికి శ్రీకారం చుట్టిన నేత మందకృష్ణ మాదిగ. ఏబీసీడీ వర్గీకరణ కోసం ఆయన చంద్రబాబు హయాంలోనే, పాదయాత్ర – సైకిల్ యాత్ర నిర్వహించిన చారిత్రక నిజం ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన పొలిటీషియను కాదు కాబట్టి. అది వేరే విషయం.
ఆ తర్వాత చంద్రబాబునాయుడు విపక్షంలో ఉండగా, మీకోసం యాత్ర నిర్వహించినప్పుడు సీఎంగా ఉన్న వైఎస్, ఎక్కడా ఆయన యాత్రకు అడ్డంకులు సృష్టించలేదు. నిజంగా వైఎస్ ఇప్పటి తన కుమారుడి మాదిరిగా, అవరోధాలు కలిగించి ఉంటే..అసెంబ్లీలో 47 మంది ఉన్న టీడీపీ బలం, 76 వరకూ చేరేదే కాదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నిర్వహించిన పాద యాత్రకు.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గానీ, పోలీసు గానీ అడ్డంకులు కల్పించే సాహసం చేయలేదు. చంద్రబాబు నడక కోసం , రోడ్డుకు ఒకవైపున కొన్ని చోట్ల ప్రభుత్వమే మట్టి వేసిన దాఖలాలు చూశాం. బాబు చేసిన ఆ పాదయాత్రనే, విభజిత రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యేందుకు దోహదపడింది.
నిజంగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా, ఇప్పటి జగన్ మాదిరిగా అవాంతరాలు సృష్టిస్తే, చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవారు కాదు. కానీ అప్పుడు సీఎంగా ఉన్న కిరణ్‌గానీ, అంతకుముందు వైఎస్, ఇంకా అంతకుముందు సీఎంగా ఉన్న చంద్రబాబు గానీ, అలాంటి ‘స్థాయి తక్కువ పనులు’ చేయకుండా హుందాగా వ్యవహరించారు. అదొక హుందాతనమైన రాజకీయశకం.
ఆ తర్వాత గత ఎన్నికల ముందు విపక్షనేత జగన్.. కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, చరిత్ర సృష్టించారు. అప్పుడు సీఎంగా ఉన్న ఇప్పటి విపక్ష నేత చంద్రబాబుగానీ, నాటి డీజీపీ గానీ ఆయన అడుగులకు ఆంక్షలు విధించిన సందర్భాలు, భూతద్దం వేసి వెతికినా కనిపించదు. ఇప్పటి డీజీపీ మాదిరిగా 157 మంది మాత్రమే పాదయాత్రలో ఉండాలని, బహిరంగ సభలు నిర్వహించకూడదని, అప్పటి డీజీపీ ఎక్కడా ఆంక్షలు విధించిన దాఖలాలు కనిపించవు. పైగా జగన్ స్వేచ్ఛగా బహిరంగసభలు, రోడ్‌షోలు నిర్వహించారు. ఆయన సభలకు వేల సంఖ్యలో జనం, వందల సంఖ్యలో కార్యకర్తల కాన్వాయ్ కనిపించేది. ప్రతిరోజు 2 వేల మంది, సొంత క్యాడర్ పాద యాత్రలో ఉండేలా చూసుకున్నారు. అయినా జగన్‌కు ఒక్క ఎస్పీ కూడా నోటీసులు జారీ చేసే ధైర్యం చేయలేదు. పైగా విపక్ష నేతగా ఉన్న ఆయన సెక్యూరిటీపై, ఇంటలిజన్స్ సమీక్షలు నిర్వహించేది. ఇవన్నీ నాలాంటి జర్నలిస్టులు ఆయన పాదయాత్రలో చూసిన అనుభవాలు!
ప్రజాసంకల్పయాత్ర పేరిట జగన్ చేసిన పాదయాత్ర, ఆయనను జనాలకు చేరువ చేసింది. ఒక్క చాన్స్ ఇవ్వాలన్న ఆయన అభ్యర్ధనను.. ఆంధ్ర సమాజం నమ్మి, మన్నించింది. 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని మెజారిటీ ఇచ్చి, అసెంబ్లీకి పంపించింది. నిజంగా ఇప్పటి అమరావతి రైతులపై కనిపిస్తున్న ఆంక్షలే.. నాటి టీడీపీ సర్కారు జగనన్న పాదయాత్ర లో కనిపించి ఉంటే.. ఇప్పటి డీజీపీ మాదిరిగా, అప్పుడు కూడా 157 మందే పాల్గొనాలని లక్ష్మణ రేఖ గీసి ఉంటే.. జగనన్న జనాలకు చేరువయ్యేవారా అన్న భావన.. మెడపై తల ఉన్న ఎవరికయినా రాక తప్పదు.
అందాకా ఎందుకు? జగనన్న జైలుకు వెళ్లిన తర్వాత, ఆయన చెల్లెలు షర్మిల పాదయాత్ర బాధ్యత తీసుకున్నారు. దేశంలో ఒక మహిళ.. అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రికార్డు సృష్టించిన నాటి రోజుల్లో, అప్పటి కాంగ్రెస్ సర్కారు ఆమెకు ఎక్కడా ఆటంకాలు సృష్టింలేదు. నిజానికి సోనియాను ధిక్కరించిన జగన్ అండ్ ఫ్యామిలీ కార్యక్రమాలకు, అడ్డంకులు సృష్టించటం అప్పటి కాంగ్రెస్ సీఎంకు సులభం. పైగా టీడీపీనే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి, అణచివేసినా అడిగేవారెవరూ ఉండరు. కానీ, నాటి కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించింది.
ఇప్పుడు కేసీఆర్ సర్కారుపై ఒంటికాలితో లేస్తున్న.. జగనన్న సంధించిన బాణమయిన అదే షర్మిల, తెలంగాణలో మళ్లీ నిరాటంకంగా పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల తనను అంతలేసి మాటలంటూ.. పరుష పదజాలంతో విమర్శిస్తున్నా, కేసీఆర్ తన సహజశైలికి విరుద్ధంగా ఎలా-ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది పక్కకుపెడితే… షర్మిల పాదయాత్రకు ఎక్కడా అడ్డంకులు సృష్టించకపోవడమే ఆశ్చర్యం.
పైగా తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి .. ఏపీ డీజీపీ సవాంగ్ మాదిరిగా, షర్మిల పాదయాత్రలో 157 మందికి మించి ఉండకూడదన్న నిబంధన విధించలేదు. కోవిడ్ నిబంధల చట్టం ఎక్కడైనా ఒక్కటే కాబట్టి, షర్మిల పాదయాత్ర నియంత్రణకు అది కూడా ఒక సాకుగా చూపినా, అడిగేవాడెవరూ ఉండరు. ఒకవేళ డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా సవాంగ్ మాదిరిగా అడుగులపై ఆంక్షలు విధించి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో?!
మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ దళపతి బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్రకూ, తెలంగాణ సీఎం కేసీఆర్ గానీ, డీజీపీ మహేందర్‌రెడ్డి గానీ ఎలాంటి ఆంక్షలు, అడ్డంకులు కల్పించలేదు. ఆ విషయంలో సంజయ్ కూడా కేసీఆర్‌ను విమర్శించిన దాఖలాలు లేవు.
మరి.. పెయిడ్ ఆర్టిసులు, పెట్టుడు ఉద్యమమయిన అమరావతి రైతుల రాజధాని ఉద్యమానికి, అంత బలంగా ఉన్న పాలకులు బెదిరిపోవడమేమిటి? అమరావతి రైతుల అడుగులకు ఆంక్షలు విధించడం ఏమిటి? రైతులు గొడ్డును బాదినట్లు బాదడమేమిటి? 157 మంది మాత్రమే పాల్గొనాలని నిబంధనలు పెట్టడం ఏమిటి? మైకులు, బహిరంగసభలు, రాజకీయ పార్టీ నేతలు పాల్గొనకూడదన్న ఆంక్షలేమిటి? వైసీపీ గళధారులే చెప్పినట్లు.. నిజంగా రాజధానిపై ప్రేమ ఉంటే ప్రజలు, రాజధాని ఉన్న రెండు నియోజకవర్గాల్లో వైసీపీని ఎందుకు గెలిపిస్తారన్న వాదనే నిజమైతే.. రైతుల అడుగులకు ఆంక్షలెందుకు? అంటే.. వారి అడుగులతో పాలక పార్టీ ఆగమవుతుందన్న భయమా? ఏమో!