పంతులమ్మగా వేలాది మందికి విద్యాబుధ్దులు నేర్పిన రంగనాయకమ్మ
జీవించి ఉండగానే కాంశ్య విగ్రహం ఆవిష్కరణతో అరుదైన ఘనత
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, హిందీ అకాడమీ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాతృమూర్తి యార్లగడ్డ రంగనాయకమ్మ (86) మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ సమీఫంలో వానపాముల గ్రామంలో వయోభారంతో మృతి చెందారు. నలభై సంవత్సరాలకు పైగా బేతవోలు పరిసర ప్రాంతాలలో పంతులమ్మగా ఎందరికో విద్యాబుధ్దులు నేర్పి వారి ఉన్నతికి రంగనాయకమ్మ బీజం వేసారు. లక్ష్మి ప్రసాద్ తండ్రి అంకినీడు సైతం ఉపాధ్యాయిలుగానే గుడివాడ ప్రాంతంలో ఎంతో కీర్తి పత్రిష్టలు గడించారు. విద్యావేత్తలుగా ఈ దంపతుల చేసిన అవిరళ కృషితో ప్రస్తుతం ఉన్నత స్ధితిలో ఉన్న విద్యార్ధులు వారికి అరుదైన ఘనతను అపాదించారు. తమ ఉపాధ్యాయులుగా వీరిని గౌరవించే క్రమంలో ఇటీవల ఈ దంపతుల కాంశ్య విగ్రహాలు గుడివాడలో ఆవిష్కరించారు. సాధారణంగా మృతి చెందిన వారిని స్మరించుకుంటూ విగ్రహావిష్కరణలు జరుగుతుంటాయి. అందుకు భిన్నంగా వీరి వద్ద విద్యాబ్యాసం చేసిన పూర్వ విద్యార్ధులు వీరిరువురి విగ్రహాలు అవిష్కరించి తమ ప్రత్యేకతను చాటు కున్నారు. లక్ష్మి ప్రసాద్ తండ్రి యార్లగడ్డ అంకినీడు రెండు దశాబ్ధాల క్రితం పరమపదించారు. యార్లగడ్డ రంగనాయకమ్మ అంత్యక్రియలు బుధవారం ఉదయం వానపాముల గ్రామంలో నిర్వహించనున్నట్లు అచార్య యార్లగడ్డ తెలిపారు.
సంతాపం తెలిపిన మంత్రులు కొడాలి, పేర్ని, వెల్లంపల్లి
యార్లగడ్డ రంగనాయకమ్మ మృతి పట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) తీవ్ర సంతాపం ప్రకటించారు. రంగనాయకమ్మ వల్ల విద్యార్జన గావించిన ఎందరో విద్యార్ధులు విదేశాలలో స్ధిర పడి మాతృభూమి ఉన్నతికి దోహదపడ్డారన్నారు. అర్ధిక పరమైన అంశాలతో సంబంధం లేకుండా చదువుకుంటామని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయిలుగా సేవ చేసారని కొడాలి ప్రస్తుతించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ కృష్ణా జిల్లా స్ధాయిలో పంతులమ్మ అంటే గుర్తుకు వచ్చే పేరు యార్లగడ్డ రంగనాయకమ్మ మాత్రమేనన్నారు. అంకినీడు, రంగనాయకమ్మ దంపతుల తోడ్పాటుతో ఉన్నత పాఠశాల విద్య వరకు ముందుకు సాగిన వేలాది మంది విద్యార్ధులు ఆ పునాదితో విదేశీ విద్యను సైతం సులువుగా ఆకళింపు చేసుకోగలిగారన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంతాప సందేశం విడుదల చేస్తూ విద్య విలువను గుర్తెరిన ఈ దంపతులు దానిని పదిమందికి పంచటం ద్వారా పరోక్షంగా వారి కుటుంబాలలో ఆర్ధిక ఉన్నతికి కారణం అయ్యారని ప్రస్తుతించారు. తల్లిని కోల్సోయిన అచార్య యార్లగడ్డకు భగవంతుడు మనో నిబ్బరం ప్రసాదించాలన్నారు.