వివేకా హత్యలో అసలు దోషులు ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే

– వారి వెనకుండి, వారిని కాపాడుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే
– సీబీఐ కడపఎంపీ అవినాశ్ రెడ్డిని, ఆయన తండ్రి వై.ఎస్. భాస్కర్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రిని కూడా విచారిస్తేనే, వివేకాహత్యకేసుకి ముగింపు వస్తుంది
– హత్యానంతరం జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై పలుఅనుమానాలున్నాయన్నాయంటూ వివేకాకుమార్తె డాక్టర్ సునీత హైకోర్టులో వేసిన పిటిషన్ లో ప్రస్తావించడం జరిగింది – సునీత తనపిటిషన్లో పేర్కొన్న అంశాలపై సజ్జలరామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?
– టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
గతరెండున్నర సంవత్సరాల నుంచీ హూ కిల్డ్ బాబాయ్ అన్నప్రశ్నకు ప్రజలు సమాధానం వెతుకుతూనే ఉన్నారని, ఆ ప్రశ్న రాష్ట్రప్రజలకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని, కొద్ది రోజులక్రితం షేక్ దస్తగిరి అనేవ్యక్తి, వివేకాహత్యకుసంబంధించి కీలకమైన అంశాలు వెల్లడి స్తూ వాంగ్మూలంఇచ్చాడని, అతనుచెప్పిన అంశాలతోపాటు, వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న పలుఅంశాలు, హత్యవెనకున్న కీలకవ్యక్తుల పాత్రను, ప్రమేయాన్ని బహిర్గతంచేస్తున్నాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజలంతా ఆప్రశ్నకు సమాధానంకోసం రెండున్నరేళ్లనుంచి ఎదురుచూస్తున్నారు దస్తగిరి వాంగ్మూలం బయటకురాగానే సజ్జలరామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వారి నాయకుడిని కాపాడుకునేందుకు ఏదేదో మాట్లాడి, బుకాయించాలని చూశారు. శ్రీకాంత్ రెడ్డి ఏదిపడితే అది మాట్లాడకుండా, ముందువివేకాహత్యకు సంబంధించిన అంశాలు చాలా స్పష్టంగాఉన్న దస్తగిరి వాంగ్మూలం మరియు డాక్టర్ సునీత హైకోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ ను చదవాలని సూచిస్తున్నాం.
వివేకానందరెడ్డి హత్యపై ఆయనవద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరివాంగ్మూలంలో సంచలనాత్మకమైన విషయాలున్నాయి. అవి చదివితే వైసీపీ బ్యాచ్ కు వాస్తవాలు బోధపడతాయి. ఎర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, దస్తగిరిలు హత్యలో పాల్గొన్నారని, వారందరినీ గంగిరెడ్డే లీడ్ చేశాడని దస్తగిరి తనవాంగ్మూలంలో చెప్పాడు. వివేకాహత్యలో భాగస్వాములు అయినందుకు, సహకరించినందుకు గాను డీ.శంకర్ రెడ్డి అనేవ్యక్తి నుంచి రూ.40కోట్లు వస్తాయని, అవిఅందరం పంచుకోవచ్చనికూడా ఎర్రగంగిరెడ్డి, దస్తగిరితో చెప్పాడని కూడా వాంగ్మూలంలో ఉంది.
వివేకాహత్య తర్వాత ఏదైనాజరిగితే, తమను డీ.శంకర్ రెడ్డే కాపాడతాడని, అతనే వ్యవహారాలన్నీ చక్కబెడతాడనికూడా ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగిరి తనవాంగ్మూలంలో పేర్కొన్నాడు. వివేకాహత్య జరిగిన తర్వాత అందరూ గంగిరెడ్డి ఇంటికివెళ్తే, అక్కడకూడా శంకర్ రెడ్డే మనల్ని కాపాడతాడు.. మిగిలిన పేమెంట్ కూడా అందిస్తాడని కూడా గంగిరెడ్డి మిగతా వారితో చెప్పాడని కూడా దస్తగిరి తనవాంగ్మూలంలో స్పష్టంచేశాడు. వివేకాను హత్య చేసిన నలుగురువ్యక్తుల వెనుకఉండి హత్యను నడిపించింది డీ.శంకర్ రెడ్డి అనేవ్యక్తి. ఈ మొత్తం వ్యవహారమంతా డీ.శంకర్ రెడ్డే దగ్గరుండి నడిపించాడని కూడా దస్తగిరి వాంగ్మూలంతో స్పష్టమవుతోంది.
హత్య తర్వాత దస్తగిరి, తనకుఅంటిన రక్తపుమరకలు కడుక్కోవడానికి, శుభ్రపరుచుకోవడానికి దగ్గర్లోని రాజారెడ్డిఆసుపత్రికి వెళ్లానని కూడాస్వయంగాచెప్పాడు. ముఖ్యమంత్రి తాతగారిపేరుతో ఉన్న రాజారెడ్డి ఆసుపత్రి తప్ప, నిందితుడు దస్తగిరికి మరెక్కడికి వెళ్లాలని ఎందుకుఅనిపించలేదు? అక్కడికి వెళితే తాను సురక్షితంగా ఉంటానని, ప్రశ్నించేవారుండరన్న ధీమాతోనే దస్తగిరి అక్కడికివెళ్లి, రక్తపుమరకలు కనుక్కున్నాడా? ఆసుపత్రి మనదైనప్పుడు, ఆధారాలు రూపుమాపడం పెద్దసమస్య కాదుకదా అన్నదైర్యంతోనే దస్తగిరి అలాప్రవర్తించినట్టు అతని వాంగ్మూలాన్నిబట్టి స్పష్టమవుతోంది.
ఈ వ్యవహారంలో వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టులో జనవరి 24, 2020న వేసిన పిటిషన్లోని అంశాలనుకూడా అందరూ గమనించాలి. హత్యలో కీలకంగా వ్యవహరించిన డీ.శంకర్ రెడ్డి ప్రస్తావనను సునీత, తన పిటిషన్లో చేర్చారు. సదరు డీ.శంకర్ రెడ్డి కడపఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డికి అత్యంతసన్నిహితుడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతను అవినాశ్ రెడ్డికి రైట్ హ్యాండ్. అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిగారికి, ఆయన శ్రీమతి భారతి గారికి ఎంత దగ్గరి బంధవోకూడా రాష్ట్రమంతా తెలియాలి. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తాతగారైన వెంకటరెడ్డికి ఇద్దరుభార్యలుంటే, పెదభార్యకు చినకొండారెడ్డి ఒక్కడే కొడుకు. ఆ చినకొండారెడ్డికి నలుగురు కొడుకులు, ఒకకూతురంటే ఆ కొడుకుల్లో ఒకరు అవినాశ్ రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డి.
చినకొండారెడ్డికి ఉన్న ఏకైక కుమార్తె ముఖ్యమంత్రి శ్రీమతిగారైన భారతి గారితల్లి. అంటే వై.ఎస్. అవినాశ్ రెడ్డి స్వయంగా జగన్ గారి శ్రీమతి గారైన భారతిగారికి సొంతమామకొడుకు. రాజశేఖర్ రెడ్డి గారి తాతైన వెంకటరెడ్డి పెదభార్య మునిమనవడు వై.ఎస్ అవినాశ్ రెడ్డి. వై.ఎస్.వెంకటరెడ్డి గారి రెండోభార్యకు నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలుంటే, వారిలో ఒకరు జగన్ తాతగారైన రాజారెడ్డి. ఈ బంధమంతాచూస్తుంటే, హత్యోదంతంలో పాలుపంచుకున్న కీలకవ్యక్తులందరూ ముఖ్యమంత్రి గారికి దగ్గరిబంధువులు, ఒకే కుటుంబంలోనివారు, వై.ఎస్.ఇంటిపేరుగలవారే.
ఆవిధంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ముఖ్యమంత్రి గారి భార్యైన భారతిగారికి స్వయంగా మామకొడుకు అయిన అవినాశ్ రెడ్డి అనుంగు అనుచరుడే శంకర్రెడ్డి. అతనే వివేకా హత్యలో కీలకపాత్రధారి. వీటన్నింటితో పాటు, వివేకా కుమార్తె డాక్టర్ సునీత హైకోర్ట్ లో వేసిన పిటిషన్లోని పేరాగ్రాప్ నంబర్ 6లో వివేకానందరెడ్డి హత్యజరిగిన తర్వాత మొట్టమొద టిగా, పోలీసులురాకముందే తెల్లవారుజామున 6.30ని.లకు ఘటనాస్థలికి చేరుకున్నది వై.ఎస్. అవినాశ్ రెడ్డి, అతని అనుచరుడు డీ.శంకర్ రెడ్డేనని చెప్పారు. అవినాశ్ రెడ్డి, డీ.శంకర్ రెడ్డిలు వివేకా హత్యతర్వాత ఆఘమేఘాలపై మృతుడిఇంటికెళ్లి సాక్ష్యాధారాలు రూపుమాపడానికి ప్రయత్నించారని సునీత గారు తనపిటిషన్లో చెప్పారు.
వై.ఎస్. అవినాశ్ రెడ్డి వివేకాఇంటికి చేరుకున్నాక, వై.ఎస్.ప్రకాశ్ రెడ్డి, వై.ఎస్.ప్రతాపరెడ్డి, డాక్టర్ వై.ఎస్. అభిషేక్ రెడ్డిలు చేరుకున్నారని కూడా సునీతచెప్పారు. సాక్ష్యాలు రూపుమాప డానికి, వై.ఎస్ కుటుంబసభ్యులందరూ స్వయంగా ప్రయత్నించారని కూడా ఆమె స్పష్టం గా తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతహడావుడిగా, అందరికంటే ముందు వివేకా ఇంటికి చేరుకోవాల్సిన అవసరం అవినాశ్ రెడ్డికి ఏమిటి? ఏంచేయడానికి, ఏ సాక్ష్యాలు రూపుమాపడానికి ఆయన తన అనుచరుడు శంకర్ రెడ్డితో కలిసి, పోలీసులకంటే ముందే, మృతుడి ఇంటికెళ్లాడు? సాక్ష్యాధారాలు రూపుమాపే ప్రయత్నాలు ముఖ్యమంత్రి సన్నిహితులు ఎందుకు చేశారు? సాక్ష్యాధారాలు రూపమాపడానికి అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డే ప్రయత్నించారన్న సునీత పిటిషన్లోని అంశాలకు జగన్ ఏం సమాధానంచెబుతారు?
స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్యతో బలవంతంగా సెక్షన్ 302 (హత్యానేరం) కాకుండా, సెక్షన్ 174 సీఆర్పీసీ (కారణాలు నిర్ధారణకానిమరణంగా) ఎందుకు పెట్టిం చారో తెలియాలి. గొడ్డలిపోట్లు కళ్లముందుకనిపిస్తున్నాకూడా, హత్యకుగల కారణాలు లేవని శంకరయ్యతో ఎవరుసెక్షన్ 174 నమోదుచేయించారో కూడాచెప్పాలి. వివేకా హత్య జరిగిన తర్వాత సాక్షిఛానల్ లో మాత్రం గుండెపోటని చెప్పి నమ్మించడానికి ప్రయత్నించినమాట అందరికీ తెలుసు. ఆ సమాచారం కూడా సాక్షివారికి శంకర్ రెడ్డి ఇచ్చాడని సునీత చాలా స్పష్టంగా తన పిటిషన్లో తెలియచేశారు.
కడప సాక్షి యూనిట్ ఇన్ ఛార్జ్ అయిన బాలకృష్ణకు, శంకర్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి, ఆరకంగా వార్త ప్రసారం చేయాలని చెప్పినట్లు పిటిషన్లో పిటిషన్లో డాక్టర్ సునీతచెప్పింది వాస్తవంకాదా? శంకర్ రెడ్డితోసహా, ఏ2 విజయసాయిరెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి మరియు అనేకమంది సీనియర్ వైసీపీనేతలు కూడా వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి నమ్మించడానికి ప్రయత్నించారు. సాక్షి మీడియాను అడ్డంపెట్టుకొని అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డి , విజయసాయిరెడ్డిలు వివేకాహత్యను కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని, ప్రజలను నమ్మించడానికి విఫలయత్నంచేశారని సునీత పిటిషన్లోని అంశాలే స్పష్టంచేస్తున్నాయి. వివేకాహత్యజరిగిన మర్నాడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసి, సీబీఐ విచారణ జరిపించాలని కూడా సునీత తనపిటిషన్లో చెప్పారు. హత్యజరిగిన మర్నాడే, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారి అయిన అమిత్ గార్గ్ నేత్రత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని( సిట్ ను) నియమించగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి, తాను బాధ్యతలు స్వీకరించిన మొదటి రెండువారాల్లోనే జూన్ 13, 2019న సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ అయిన అమిత్ గార్గ్ ను తప్పించి, సిట్ స్థాయి తగ్గించి, కేవలం ఒకఎస్పీ స్థాయి అధికారి అయిన అభిషేక్ మహంతిని సిట్ అధిపతిగా నియమించారు.
ఈ అంశంకూడా సునీత గారు తనపిటిషన్లో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, ప్రజలకు ఉపయోడపడే పనులుచేయకుండా, మొదటి రెండువారాల్లోనే వివేకాహత్యకేసుని దర్యాప్తు చేస్తున్న సిట్ అధిపతిని అదరాబాదరాగా మార్చాల్సిన అవసరం దేనికి వచ్చింది?
చంద్రబాబునాయుడు నియమించిన సిట్ ను కూడా నీరుగార్చే ప్రయత్నాన్ని, అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి దేనికి మొదలుపెట్టారో, తాడేపల్లి జీతగాడు సజ్జల మరియు శ్రీకాంత్ రెడ్డి సమాధానంచెప్పాలి. జూన్ 13, 2019న మొదటిసారి సిట్ అధికారిని మార్చగా, తిరిగి మరలా రెండోసారి అక్టోబర్ 10, 2019న సిట్ కి నేత్రత్వం వహిస్తున్న అభిషేక్ మహంతిని మార్చి, ఆయనస్థానంలో కేకే. అన్బురాజన్ గారిని నియమించడం జరిగింది. ఈ విధంగా అధికారంలోకి వచ్చిన 6నెలల లోపే రెండుసార్లు సిట్ అధికారులను జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చాడో ప్రజలకు సమాధానం చెప్పాలి?
తనకు అత్యంత సమీపబంధువులైన అవినాశ్ రెడ్డి, ఆయనతండ్రి భాస్కర్ రెడ్డిలను కాపాడటానికే జగన్మోహన్ రెడ్డి సిట్ అధికారులను రెండుసార్లు మార్చారా? ఎవరిని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ఆపనిచేశాడు.. శంకర్ రెడ్డినా…లేక అవినాశ్ రెడ్డినా..లేక తనను తాను కాపాడుకోవడానికి చేశారా? దీనిపై జగన్ రాష్ట్రప్రజలకు సమాధానంచెప్పాల్సిందే.
వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత 28-11-2019న రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారికి ఒక లేఖద్వారా తనకు ప్రాణహాని ఉందని, తక్షణమే తనకు రక్షణకల్పించాలని కోరడం జరిగింది.
ఆ విధంగా వివేకా కుమార్తె సునీత వేడుకోవాల్సిన గత్యంతరం ఆమెకు ఎందుకు పట్టిందో, జగన్ ప్రభుత్వంలోనే ఆమెప్రాణాలకు ఎందుకు రక్షణకొరవడిందని ఆమె ఆందోళన చెందిందో ముఖ్యమంత్రిగారు జవాబుచెప్పాలి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి దిశాచట్టం గురించి గొప్పలుచెబుతున్నాడు. మరి ఆయన ప్రభుత్వంలో, ఆయన సోదరే, తనప్రాణాలకు రక్షణలేదని, భద్రతకావాలని ఎందుకు డీజీపీని కోరిందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. ఇంత స్పష్టంగా ముఖ్యమంత్రి సోదరైన సునీత ఇన్నిఅంశాలు చెబుతుంటే, ఇప్పటికీ సజ్జల, శ్రీకాంత్ రెడ్డి నోటికొచ్చింది మాట్లాడటంసిగ్గుచేటు. హత్య జరిగిన మర్నాడు గవర్నర్ ని కలిసి సీబీఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి, తరువాత దానిపై ఎందుకుమాట్లాడలేదు?
రిట్ పిటిషన్ 394/2019 ద్వారా వివేకాహత్యకేసుని సీబీఐతో విచారణజరపాలంటూ జగన్ రెడ్డి గతంలో హైకోర్ట్ లో పిటిషన్ వేసిన మాట వాస్తవంకాదా? అయినా తరువాత అధికారంలోకి వచ్చాక తనసోదరుడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి, 8నెలలైనా ఎందుకు సీబీఐ విచారణకోరడంలేదో తనకుఅర్థం కావడంలేదని ఆమె తన పిటిషన్లో ప్రస్తావించి వాపోయింది నిజంకాదా? వివేకాకుమార్తె సునీతకు, తనసోదరుడు జగన్మోహన్ రెడ్డిపై ఎంతటి అపనమ్మకం, ఎన్ని అనుమానాలున్నాయో ఆమె కోర్టుకు మొరపెట్టుకుంటూ వేసిన పిటిషన్లోని అంశాలే చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పదేపదే సిట్ అధికారులను మార్చడంకూడా పలు అనుమానాలకు తావిస్తోందని కూడా ఆమె అన్నది నిజం కాదా?
వివేకాకుమార్తె సునీత జనవరి 24, 2020న సీబీఐ విచారణకోరుతూ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలుచేస్తే, ఆ తరువాత కేవలం రెండువారాలకే జగన్ రెడ్డి, తాను గతంలో సీపీఐ విచారణకోరుతూ వేసిన పిటిషన్ ను ఫిబ్రవరి 7వ తేదీన ఉపసంహరించుకున్నాడు. చెల్లి తనతండ్రిని ఎవరు చంపారో తెలుసుకోవడంకోసం సీబీఐ విచారణ కావాలని పిటిషన్ వేసిన రెండువారాలకే, అన్న సీబీఐ విచారణ అవసరం లేదంటూ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ వెనక్కు తీసుకోవడమేంటి? ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉంటుందా? ఆడబిడ్డ, తనసోదరి న్యాయంకోసం విలపిస్తుంటే, జగన్ తన పిటిషన్ వెనక్కు తీసుకోవడానికి మనసెలా వచ్చింది? వివేకానందరెడ్డి హత్య నూటికినూరుశాతం కడపఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల కనుసన్నల్లోనే జరిగింది.
అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డిలు స్వయంగా ఆగస్ట్ 31 2019 డీజీపీని కలిశారనికూడా డాక్టర్ సునీత తన పిటిషన్లో ప్రస్తావిస్తూ, ఆ తర్వాతే వివేకాహత్యకేసుదర్యాప్తులో వేగం తగ్గిందని కూడా అభిప్రాయపడ్డారు. ఒకపక్కన దస్తగిరివాంగ్మూలం, మరోపక్కన సునీత పిటిషన్లోని అంశాలు వివేకాహత్యకేసులోని అసలుదోషులు, పలానావారని స్పష్టంచేస్తుంటే, ముఖ్యమంత్రికి అవేవీ కనిపించలేదా? డీ.శంకర్ రెడ్డిని ముందుపెట్టి, తండ్రీకొడుకులైన అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు వివేకాను హత్యచేయించారని బల్లగుద్ది చెబుతున్నా. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల వెనకుండి ఈ తతంగం నడిపితే, వారికిఅన్నిరకాలుగా మద్ధతు తెలిపింది ఈ రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. సీబీఐ వారు తక్షణమే కడపఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించాలి. వారి వెనకుండి నడిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలి.
వివేకాహత్య అనంతరం జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై, వివేకా కుమార్తె డాక్టర్ సునీత హైకోర్ట్ లో వేసిన పిటిషన్లో అనేక అనుమానాలు వ్యక్తపరిచారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు ఎవరూచట్టానికి అతీతులుకారని సీబీఐగుర్తించాలి. వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత హైకోర్ట్ లో వేసిన పిటిషన్లో పేర్కొన్న అంశాలు, దస్తగిరి వాంగ్మూలందృష్ట్యా సీబీఐ వారు తక్షణమే కడపఎంపీ అవినాశ్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply