కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలు చోట్ల టీడీపీకి.. ఇంకొన్ని చోట్ల వైసీపీకి గట్టిగానే షాకులు తగులుతున్నాయి. అయితే.. మంత్రుల స్వగ్రామంలో.. నివాసముండే ప్రాంతాల్లో కూడా టీడీపీ జెండా ఎగిరిందంటే మామూలు విషయం కాదు. అలాంటి సందర్భాలు ప్రస్తుత ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి.
బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. బుగ్గన నివాసం ఉండే 15 వార్డులో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతంచెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి. బేతంచెర్లలో మొత్తం 20 వార్డులుండగా.. వైసీపీ 14, టీడీపీ 6 వార్డుల్లో విజయం సాధించింది.
ఇప్పటికే ఇదే జిల్లాలో జరిగిన సర్పంచ్, వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ ఊహించని షాక్‌లే తగిలాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి నాగపుల్లారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జనార్ధన్ విజయం సాధించారు. 12 ఓట్ల తేడాతో జనార్ధన్ గెలుపొందారు. నంద్యాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులోనే ఇలా ఓటమిపాలవ్వడం గమనార్హం.
అలాగే ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురంలోనూ వైసీపీ వార్డు అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థి మహేశ్వరి విజయం సాధించారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామపంచాయతీ ఎన్నికలో టీడీపీ రెబల్ అభ్యర్థి వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.