– 2024 ఎన్నికల్లో సానుభూతి ఎజెండాకు బాబు ఇప్పుడే శ్రీకారం చుట్టాడేమో..!
– చంద్రబాబుది బాధ పెట్టించే తత్వమే గానీ.. బాధ పడే తత్వం కాదు
– బాబు అందరిచేత కన్నీళ్ళు పెట్టించేవాడేగానీ.. కన్నీళ్ళు పెట్టేవాడు కాదు
– మధ్యాహ్నం 12.26 నుంచి 2 గంటల వరకు ఏం మాట్లాడని బాబు.. పార్టీ ఆఫీసుకు వెళ్ళి ఏడ్చాడంటే అది ఫ్యాబ్రికేటెడే
– బాబు అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి ఒక్కో అబద్ధాన్ని సృష్టించి, తన మీడియా ద్వారా మార్కెటింగ్ చేయడం అలవాటే
– అసెంబ్లీలో భువనేశ్వరి ప్రస్తావనగానీ, మహిళల ప్రస్తావని గానీ రానే రాలేదు
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్
మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
వ్యవసాయం మీద చర్చ కావాలని టీడీపీ నేతలే బీఏసీ సమావేశంలో ఒక అంశంగా అడిగి, వ్యవసాయం-రైతు సంక్షేమంపై అసెంబ్లీలో నిన్న చర్చ జరుగుతుండగా, నేను చర్చ మొదలు పెట్టిన రెండు-మూడు నిమిషాలకే టీడీపీ సభ్యులు అడ్డుకోవడం ప్రారంభించారు. వ్యక్తిగతంగా నాపై దాడి ప్రారంభించారు. నేను పార్టీలు మారానని, జగన్ మోహన్ రెడ్డిగారిని దూషించారని మాట్లాడారు.
ఆ సమయంలో చంద్రబాబు మైక్ అడిగితే.. స్పీకర్ అనుమతిస్తే, అన్నీ మాట్లాడుకుందాం, బాబాయ్, గొడ్డలి, తల్లి అని చంద్రబాబు మాట్లాడారు. దాంతో బాబాయ్, గొడ్డలి అని టీడీపీ నేతలు పదే పదే నినాదాలు ఇచ్చారు. దాంతో పార్టీ లేదు-బొక్కాలేదు అని అచ్చెన్నాయుడు అన్న మాటలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రతిగా నినాదాలు చేశారు.
వ్యవసాయంపై చర్చలో భాగంగానే డైరీల అభివృద్ధి, ప్రైవేట్ డైరీల మోసం, అమూల్ ను రాష్ట్రానికి తెచ్చి, సహకార రంగానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, వీటికి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు… హెరిటేజ్ మీద కూడా చర్చ వచ్చింది. దాంతో చంద్రబాబు లేచి, ఉద్రేకపూరితంగా మాట్లాడారు. సభలో ఇరువర్గాల మధ్య వాద, ప్రతివాదాలు జరుగుతుండగా, అంబటి రాంబాబు లేచి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే, ఆయనపైన కూడా వ్యక్తిగతంగా మాట్లాడారు.
దాంతో అంబటి రాంబాబు కూడా అన్నీ మాట్లాడుకుందాం.. వంగవీటి మోహన్ రంగా హత్య గురించి, మాధవ రెడ్డి హత్య గురించి మాట్లాడుకుందాం అని చెప్పారు. అంతే తప్ప, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించిగానీ, అసలు మహిళల ప్రస్తావన అన్నదే సభలో రాలేదు. ఎవరూ ఆ పేరు ఎత్తడం గానీ, వేరే ఉద్దేశాలుగానీ ఎక్కడా రాలేదు. చంద్రబాబు సతీమణి గురించి మాట్లాడినట్టుగా, మహిళల గురించి మాట్లాడినట్టుగా చంద్రబాబు ప్రచారం చేయడం చాలా విచిత్రంగా ఉంది.
గాలిలో నుంచి సృష్టించిట్టుగా, నేరుగా తన భార్యను వైయస్ఆర్సీపీ సభ్యులు కించపరిచినట్టుగా చంద్రబాబు మాట్లాడటం ఏమిటో, టీడీపీ ఆఫీసుకు వెళ్ళి ఏడవడం ఏమిటో అసలు అర్థం కాలేదు. మధ్యాహ్నం 12. 26 గంటలకు ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. స్టేట్ మెంటు ఇవ్వడానికి స్పీకర్ గారు మైకు ఇచ్చారు, అప్పుడు కూడా మైకులో, తన భార్యను కించపరిచారనిగానీ, అవమానించారనిగానీ ఎక్కడా చెప్పలేదు.
ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆయన సతీమణి గురించి తప్పుడుగా మాట్లాడినట్టు, ఉద్వేగంతో, ఎమోషనల్ అయిపోతూ, రెండు చేతులు అడ్డుపెట్టుకుని కన్నీళ్ళు పెట్టినట్టు టీవీ ఛానళ్ళలో చూశాం. చంద్రబాబుది బాధ పెట్టించే తత్వమే కానీ, బాధ పడే తత్వం కాదు. చంద్రబాబుది కన్నీళ్ళు పెట్టించే తత్వమేగానీ, కన్నీళ్ళు పెట్టే తత్వం కాదు. చంద్రబాబు రాజకీయ జీవితం చూసిన ఎవరికైనా కచ్చితంగా ఇదే అనిపిస్తుంది.
ఎన్టీఆర్ గారి రెండో భార్య లక్ష్మీపార్వతి విషయంలో ఎలా ప్రవర్తించారో చూశాం. అలానే మా ఎమ్మెల్యే రోజాగారిని అసెంబ్లీ ప్రాంగణంలోనే తన పార్టీ వాళ్ళతో మాట్లాడించిన మాటలు చూశాం.. ఇవన్నీ చూస్తే, చంద్రబాబుది ఎవరితోనైనా కన్నీళ్ళు పెట్టించే క్యారెక్టర్ అని అర్థమవుతుంది. జరగనిదానిని జరిగినట్టుగా చిత్రీకరించి ఏరకంగా సానుభూతి కోరుకుంటున్నారో చూస్తున్నాం.
సానుభూతి అన్నది సడన్ గా కన్నీళ్ళు పెట్టుకుని ఎపిసోడ్ నడిపిస్తే రాదు. మేం అంతా సంస్కారవంతంగా ఉన్నవాళ్ళమే. అందరికీ భార్యలు, అక్కచెల్లెళ్ళు ఉన్నవాళ్ళమే. కుప్పంలో గానీ, స్థానిక ఎన్నికల్లోగానీ టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినప్పుడు, భవిష్యత్తులో ఈ పార్టీని నడపాలంటే, వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు సానుభూతి డ్రామాను క్రియేట్ చేసి శ్రీకారం చుట్టాడని అనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో సానుభూతితో వెళ్ళాలనే ఎజెండాను చంద్రబాబు తీసుకున్నారనిపిస్తుంది.
1975 నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకుడు చంద్రబాబు. అటువంటి వ్యక్తి సీఎం అయితేనేగానీ సభకు రాను అన్నాడు. అంటే, ఆయనకు పదవి కావాలి, ముఖ్యమంత్రి సీటు కావాలి. రాజకీయానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా.. ఎన్టీఆర్ గారిని కూలదోసినప్పుడుగానీ, ఇప్పుడు గానీ పదవే ప్రాణం అన్నట్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు.
మధ్యాహ్నం 12.26 గంటల నుంచి 2 గంటల వరకు చంద్రబాబు ఏం మాట్లాడకుండా, నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడంటేనే, అప్పుడు ఏడ్చి సానుభూతి డ్రామా చేశాడంటేనే ఇది ఫ్యాబ్రికేటెడ్ అని అర్థమవుతుంది. కరెక్టుగా స్క్రిప్టు ప్రకారం ప్రిపేర్ అయి వచ్చాడని అర్థం కావడం లేదా.. ఒక చట్ట సభను కౌరవ సభగా పోలుస్తారా.. ఎవరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు. మేమంతా కౌరవలమా.. ? ఇంత అనుభవం ఉండి, విలువలతో కూడిన రాజకీయం చేయకపోతే.. ఇక రాజకీయానికి ఏం అర్థముంటుంది…?
వ్యవసాయరంగం గురించి ఒక్క మాట కూడా చంద్రబాబు నిన్న మాట్లాడలేదు. ఆయనకు నిరంతరమూ రాజకీయమే. చంద్రబాబు దగ్గర ఒక అబద్ధాల ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో నుంచి ఒక్కో అబద్ధాన్ని సృష్టించి, తనకున్న పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థతో, తనకు వత్తాసు పలికే పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం చేస్తారు. దానిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నిరంతరం ప్రయత్నించే వ్యక్తి చంద్రబాబు.
ఎస్.. జగన్ మోహన్ రెడ్డి బలమైన నాయకుడిగా ఈరోజు ఆవిర్భవించారు. ఒంటరిగా వచ్చి కుంభస్థలాన్ని కొట్టినట్టుగా అసెంబ్లీలో 151 స్థానాలు, పార్లమెంటులో 22 స్థానాలు సాధించి, దేశంలోనే యువ నాయకుడిగా, అత్యంత గొప్పగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా ఖ్యాతిగడిస్తున్నారు. ప్రతి పథకంలో మహిళలకు అగ్ర తాంబూలం వేస్తున్నారు. మహిళలకు అన్నిరంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
ఇదా మహిళల్ని కించపరిచే కార్యక్రమం..? మహిళల పేరుతోనే ఇంటి పట్టాలు ఇస్తున్నాం. మహిళలు శక్తివంతులైతేనే.. కుటుంబాలు, తద్వారా రాష్ట్రం, దేశం బాగుంటుందని జగన్ గారు ఎప్పుడూ చెబుతారు. జగన్ మోహన్ రెడ్డిగారు మహిళల పట్ల ఎంత గౌరవంగా, మర్యాద ఉంటారో రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మకూ తెలుసు. మహిళల్ని అమ్మా.. అని జగన్ పిలుస్తారు.
ఈరోజు బాలకృష్ణ మీడియాలో మాట్లాడిన మాటల్ని చూశాక, వాస్తవాలు ఆయనకు తెలిసి ఉండవు అనిపించింది. నోటితో కాదు ఓటుతో జవాబు చెప్పాలి వీళ్ళకు.. అంటూ బాలకృష్ణ మాట్లాడిన మాటలకు అర్థమేంటి..? సానుభూతితో ఓట్లు సంపాదించుకోవాలనే చంద్రబాబు గారి కుట్ర కాదా ఇది…? మేము కుసంస్కారులమా..? మీరా..? ఎవరు రాజకీయం చేస్తున్నారు..?
జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి సభలో చంద్రబాబు మాట్లాడినప్పుడు, చంద్రబాబు మాట్లాడిన మాటల్ని రికార్డుల నుంచి తొలగించమని నేనే అడిగాను, అసెంబ్లీ రికార్డుల్లో కూడా అది ఉంది. నిన్న మంత్రుల దిష్టి బొమ్మలు తగులబెట్టి, ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీలు చేసి.. నోటితో కాదు ఓటుతో సమధానం చెప్పాలని మీరు మాట్లాడుతున్నారు అంటే, అది రాజకీయం కాక ఏమిటి..?
7 సార్లు మిమ్మల్ని కుప్పం ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. అదొక్కటే కాదు, రాష్ట్రానికి కూడా చెప్పుకునేందుకు ఒక్క మంచి కార్యక్రమమైనా చేసింది లేదు. దాని ఫలితమే అన్ని ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని ఛీ కొట్టి ఓడిస్తున్నారు.
పైగా, రాజకీయంగా ఒక వర్గ శత్రువుగా జగన్ మోహన్ రెడ్డిగారిని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తూ చంద్రబాబు సానుభూతి రాజకీయం చేస్తున్నాడు. ప్రతిసారీ కుట్రలు, కుతంత్రాలతో కాదు, విలువలతో ఒక్కసారి అయినా రాజకీయం చేయండి బాబూ.. అని చెబుతున్నాం.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నాకు ఒక తల్లి లాంటిది, ఒక అక్క లాంటిది. అసలు జరగనిదానికి, అనని మాటలకు.. అన్నట్టు ప్రచారం చేస్తే… ఇక్కడేదో జరిగిపోయిందేమో అని ఆమె కూడా బాధపడి ఉంటుంది. . అననిదాన్ని, అన్నట్టుగా చంద్రబాబే చిత్రీకరిస్తే ఎవరైనా బాధపడతారు. సాక్షాత్తూ రోజా ఎమ్మెల్యేగా ఉంటే.. ఆమెను పట్టుకుని అసెంబ్లీ ప్రాంగణంలో.. బ్లూ ఫిలింలలో యాక్ట్ చేసిందని వారి పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడించినప్పుడు, ఆమె కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారని నిన్న ఆమె మాట్లాడిన మాటలు చూశాం. ఇటువంటి చంద్రబాబు గారు అసలు ఎందుకు ఏడ్చారు, ఆయన ఏడవటం ఏంటి.. రెండు చేతులతో ముఖం దాచుకుని కుమిలి కుమిలి బాధపడటం ఏంటి అని అంతా అనుకున్నాం. ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబుకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ, పనిచేస్తుంది. ఇంత వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగానీ, చంద్రబాబు గానీ ఒక్క మాట అడిగారా.. అంటే లేదు. రైతు పక్షపాత ప్రభుత్వంగా మేము రైతులను ఆదుకుంటాం. ఎక్కడా ఒక్క రైతు పంట నష్ట పోయినా ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏ సీజన్ లో పంట నష్ట పరిహారం ఆ సీజన్ లోనే ఇస్తున్నాం. ఇప్పుడు జరిగిన పంట నష్టానికి సంబంధించి కూడా ఈ సీజన్ లోనే ఇస్తాం.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలపాటు ఢిల్లీని స్తంభింపజేస్తూ రైతులు చేసిన ఉద్యమానికి, కేంద్రం, స్వయానా ప్రధానమంత్రే స్పందించి చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అది రైతు ఉద్యమ శక్తి. ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఎటువంటి నష్టం జరగదు. క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా, దళారులు, మిల్లర్ల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వమే ఎంఎస్పీకి కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. రైతులకు సంఘీభావంగా ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. వీటిని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మీడియా సమావేశంలో పార్టీ ఎంపీ శ్రీమతి వంగా గీత కూడా పాల్గొన్నారు.