Suryaa.co.in

Political News

మూడు రైతు చట్టాలను ప్రధాని మోదీ ఎందుకు రద్దు చేశారు ?

మామూలుగా చూస్తే ‘ ఇది రైతుల విజయం ‘ ‘ ప్రజాపోరాట విజయం ‘ అని అనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకొంటే దానిమీద చాలా గట్టిగా నిలబడే ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఈ రైతు చట్టాల విషయంలో వెనక్కి తగ్గారు ? అని మరికొందరికి అనుమానం వస్తున్నది.
కొంచెం లోతుగా ఆలోచిస్తే తప్ప , గత కొన్ని నెలలుగా నిఘా వర్గాల ద్వారా ప్రధాని తెప్పించుకొంటున్న సమచారం పరిశీలిస్తే తప్ప , కాంగ్రెస్ నుండి బయటికివచ్చిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమ్రిందర్ సింగ్ గత 2 నెలల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను , జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ను కలిసి పంచుకొన్న సమాచారం , పంజాబ్ నుండి పంపుతున్న గ్రౌండ్ రిపోర్ట్ ను అధ్యయనం చేస్తే తప్ప ఈరోజు ప్రధాని 3 రైతు చట్టాలను ఎందుకు రద్దు చేసి రైతులకు శుభవార్తను చెప్పారో మనకు తెలియదు.ఇపుడు ఈ కింది విషయాలు చదవండి.
3 రైతు చట్టాలు నిజానికి రైతుకు మేలు చేసేవే. వాటిని నిష్పాక్షికంగా చదివిన వారికెవరికైనా ఈ సత్యం తెలుస్తుంది.ఇంకా చెప్పాలంటే ఈ రైతు చట్టాల బిల్లు ను ముందుగా తెచ్చింది 2012 లో డా. మన్ మోహన్ సింగ్ గారి UPA/CONG ప్రభుత్వమే. ఆ చట్టాలకంటే రైతులకు మేలు చేసే అంశాలు ఈ చట్టాల్లో మరికొన్ని అదనగా వున్నాయి కూడా. 3 చట్టాల్లో ఒకటైన The Farmer’s Produce Trade & Commerce [ Promotion & Facilitation ] Act 2020 అనే ఒక దాంట్లో 3 వ చాప్టర్ , 8 వ సెక్షన్ లోని ఒక క్లాజ్ మాత్రమే రైతుల ఆందోళనకు ప్రధాన కారణం అయ్యిందని , దిల్లీ – సింగూర్ సరిహద్దువద్ద , ఉత్తరప్రదేశ్ -దిల్లి సరిహద్దు వద్ద గత ఏడాదిన్నరగాసమ్మె చేస్తున్న రైతులుచెపుతునట్టు జాతీయ మీడియా లో జర్నలిస్టులు అంటున్నారు.
ఆ క్లాజ్ ఏమంటే ఒక వేళ రైతు కు , అతనితో ఒప్పందం చేసుకొన్న వ్యాపారి లేదా , కంపెనీకి మధ్య గొడవ వస్తే , అక్కడి sub -divisional magistrate నియమించే ఒక కమిటీ ముందు రైతు హాజరు కావాల్సివుంటుంది. కానీ రైతు సంఘాలతో జరిపిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఈ క్లాజ్ ను తొలగిస్తానని చెప్పింది. కానీ రైతు ఉద్యమాన్ని హైజాక్ చేసిన ఖలిస్తాన్ ఉద్యమ నాయకులు తమ పోరాటాన్ని విరమించడానికి ఒప్పుకోలేదు.
మొదటి నుంచి ఉద్యమాన్ని నడిపిస్తున్న SKM [ సమ్యుక్త కిసాన్ మోర్చా] గత ఆరునెలలనుండి ఈ రైతు ఉద్యమాన్ని హిందు-సిక్కు గొడవ గా మార్చడానికి గట్టిగా ప్రయత్నం చేస్తోందని నిఘ వర్గాలు పసికట్టాయి. అంటే 1984 కు ముందు పంజాబ్ లో ఎంత భయంకరమైన పరిస్థితులుండేవో అలాంటి పరిస్థితిని మళ్ళీ తీసుకురావడానికి రైతు నాయకులం అని చెఫ్ఫుకుతిరుగుతున్న ఖలిస్తాన్ అనుకూల నాయకులు ప్రయత్నిస్తున్నారు.
వారు చాలావరకూ విజయం కూడా సాధించారు కూడా. దీనికి సాక్ష్యం ఏమంటే గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్న వారిలో హిందవులు లేరు , వాళ్ళు వెనుకకు వెళ్ళిపోయారు. ఒకవేళ ఏ హిందూ రైతులైనా పోరాటంలో మేమూ పాల్గొంటాం అంటే [ వాళ్ళు చాలా తక్కువ ] వాళ్ళను ఈ సిక్కు నాయకులు రానివ్వడంలేదు.
1984 కు ముందు పంజాబ్ ను మన భారతదేశం నుండి విడగొట్టడానికి ‘ ఖలిస్తాన్ వేర్పాటు ఉద్యమం ‘ వచ్చింది. దానికి నాయకత్వం వహించింది బింద్రన్వాలే అనే వ్యక్తి. ఈ బింద్రన్ వాలే అనే ఒక సాధారణ వడ్రంగిని ఎగదోసి నాయకుడిని చేసింది ఇందిరాగాంధీ గారే. పాముకు పాలు పోస్తే [ నాగుల చవితినాడు కాదు , ఇంటిలో నాగరాజ విగ్రహానికి కాదు – ఇక్కడ విషపూరితమైన మనస్తత్వమున్న వ్యక్తి అని అర్థం చేసుకోవాలి] ఏమౌతుందో మనకు తెలుసు. ఆ బింద్రన్ వాలే ఆలోచనతో ఏకీభవించిన సత్వంత్ సింగ్ , బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు బాడిగార్డులే ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపారు.
మళ్ళీ ఆనాటి భయంకర పరిస్థితులు సృష్టించడానికి ఖలిస్తాన్ వాదులు సిద్దమౌతున్నారని , వారికి విదేశాలు – ప్రత్యేకించి పాకిస్తాన్ , కెనడా నుండి మద్దతు లభిస్తోందని నిఘావర్గాలు , కెప్టెన్ అమ్రిందర్ సింగ్ కేంద్రప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అంతే కాదు , ఈ ఖలిస్తాన్ నేతలు AAP నేత అరవింద్ కేజ్రీవాల్ తో సంబంధాలు కలిగివున్నారని , రాబోయే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ను గెలిపించాలని , ఆ తరువాత పంజాబ్ ను దేశం నుండి విడగొట్టాలని దీర్ఘకాలిక కుట్రను నిఘావర్గాలు తెలుసుకొన్నాయి , ఇదే విషయాన్ని అమ్రిందర్ సింగ్ , కూడా కేంద్రానికి చెప్పాయని నిపుణులు అంటున్నారు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకొన్న ప్రధాని మోదీ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని రైతు చట్టాలను రద్దు చేస్తునట్టు ప్రకటించారు. ఆయన ఈరోజు ఎన్నుకోవడం కూడా ఒక master stroke. ఈరోజు సిక్కుల గురువైన గురునానక్ జయంతి , అలాగే ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో మరణించిన ఇందిరాగాంధి గారి జయంతి కూడా. రాజకీయంగా కాంగ్రెస్ తో ఎన్ని విభేదాలున్నా దేశ భద్రత విషయానికొస్తే తన ప్రభుత్వం కాంగ్రెస్ కు వ్యతిరేకం కాదు.
కాంగ్రెస్ ను కలుపుకుపోవడానికి కూడా సిద్ధమని , ఇందిరాగాంధి భారతదేశానికి ప్రధాని అని , ఆమెను చంపినవారు మళ్ళీ అలాంటి దేశద్రోహ చర్యలకు పాల్పడకుండా ‘ దేశమంతా ఒక్కటిగా వుందనే ‘ సంకేతాన్ని ప్రధాని ఈరోజు చూపించే ప్రయత్నం చేసారు. రాజకీయకోణం లో ఆలోచిస్తే రాబోతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాకేష్ తికాయిత్ ప్రభావమున్న పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో నష్టపోకుండా వుండటానికి కూడా ఈనిర్ణయం ఉపయోగపడొచ్చు. తన అభిప్రాయాన్ని పక్కనబెట్టి , దేశ భద్రత కోణంలో ఆలోచించి తీసుకొన్న నిర్ణయం ఇది. స్వాగతించాలి.

LEAVE A RESPONSE