– వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డా. హైమవతి
విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సవలేదని, ఇటువంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డా. హైమవతి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్న వారిని వారి ఇళ్లలోనే హెం ఐసోలేషన్లో వుంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె తెలియ చేశారు. విశాఖ, సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కేంద్రం పంపిందని ఆమె వివరించారు.
వారి వారి ఇళ్లలలో ఐసొలేషన్లో వుండేలా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలో విదేశీ ప్రయాణికులు నేరుగా దిగేందుకు అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవని ఆమె గుర్తు చేశారు. కేంద్రం అమలు చేస్తున్న వందే భారత్ పథకం కింద విజయవాడ విమానాశ్రయానికి కొన్ని విమానాలొస్తున్నాయని, అందులో మన రాష్ట్రానికి వచ్చే వారికి కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలలో ఇప్పటికే వైద్య బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాల పర్యవేక్షణలో నిరంతరమూ స్క్రీనింగ్ టెస్టులు కొనసాగిస్తున్నారని డా.హైమవతి తన ప్రకటనలో వివరించారు.