Suryaa.co.in

Andhra Pradesh

అలా కట్టే విధానానికి స్వస్తి పలకాలి

– మాజీ ఎమ్మెల్సి ఏ.ఎస్ రామకృష్ణ
విద్యాదీవెన నిధుల్ని తల్లి అకౌంట్లలోకి వేసి ఆ తర్వాత కాలేజీల్లో కట్టే విధానానికి స్వస్తి పలకాల్సిందిగా టీడీపీ మాజీ ఎమ్మెల్సి ఏ.ఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.ఆయన మాట్లాడిన మాటలు మీకోసం.. జులై 28, 2021న జీవో నెం.77 ద్వారా రూ.502 కోట్లు బీసీ సంక్షేమ నిధుల్ని విద్యా దీవెనకు మళ్లించడం అన్యాయం. జులై 28, 2021న జీవో నెం. 226 ద్వారా రూ. 127 కోట్లు ఎస్సీ సంక్షేమ నిధుల్ని ఇతరవాటికి మళ్లించడం ద్రోహం. జులై 28, 2021న జీవో నెం. 119తో రూ.43 కోట్లు మైనార్టీ సంక్షేమ నిధులను కూడా మళ్లించారు. ఎగ్జామినేషన్ ఫీజ్, కళాశాలకు ఉపయోగపడే ఫీజ్ లను దారి మళ్లించి కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు.
మహిళా సాధికారతకు భంగం కలిగించారు. మహిళలను విద్యావంతులు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తల్లి అకౌంట్లలోకి స్కాలర్ షిప్ లు వేసి మళ్లీ కాలేజీల్లో కట్టే పద్ధతి సరికాదు. వైసీపీ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి. ఎయిడెడ్ వ్యవస్థని కుదేలు చేశారు. కాలేజీలు నాణ్యమైన విద్యను అందించాలంటే కాలేజీలకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాలి. ఫీజురీయంబర్స్ మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు పాలిటెక్నిక్ అయితే 15వేలు, ఐటీఐ వారికి 10వేలు, డిగ్రీ, ఆపైవారికి రూ.20వేలు ఇచ్చే స్కాలర్ షిప్ లను తల్లుల అకౌంట్లలో వేసి వాటిని కాలేజీల్లో కట్టడం సరికాదు. ఇది రాజకీయ ఉద్దేశమే.
సెప్టెంబర్ 21జీవోను కొట్టివేస్తూ హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులు చచ్చు సలహాలిస్తున్నారు. ప్రభుత్వం నిజానిజాలు తెలుసుకోవాలి. పర్యావసనాలు ఆలోచించాలి. కాలేజీలు నాణ్యమైన విద్యను అందించాలంటే కాలేజీలకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాల్సివుంది. మహిళలు, తల్లుల పట్ల ప్రేమ ఉన్నట్లు అమ్మఒడి, విద్యా దీవెన లాంటి గమ్మత్తైన పేర్లు పెట్టడం జగన్ ప్రభుత్వానికే సాధ్యం.
జగన్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కాకుండా, ఎన్నికల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. వెనుకబడ్డ విద్యార్థులకు సాయం చేద్దామనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఓట్లు దండుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రజలు విజ్ఞులు అన్నీ గ్రహిస్తున్నారు. చంద్రబాబునాయుడు రెండు డిఎస్సీలు వేసి 16 వందల మందిని ఉద్యోగాల్లో నియమించారు. జగన్ ఎన్నికలకు ముందు మాటలు చెప్పి మోసం చేశారు.

రెండున్నర సంవత్సరాలు గడచినా ఒక్క డిఎస్సీ రాలేదు.భవిష్యత్తులో వస్తుందన్న నమ్మకం లేదు. ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాన్ని బయట పెట్టాల్సిందిగా ఉపాధ్యాయులు అడుగుతున్నారు. విలీనం పేరుతో స్కూళ్లు మూసేయడం అన్యాయం. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవు. మున్సిపల్ స్కూళ్ల వ్యవస్థను నాశనం చేశారు. అన్ని పథకాలను తిరగదోడుతున్నారు. తిరోగమన దిశగా ప్రభుత్వం వెళ్తోంది. టీడీపీ హయాంలో 3వ స్థానంలో ఉండిన విద్యా వ్యవస్థ ఈ ప్రభుత్వంలో అట్టడుగుకు చేరింది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగినా విద్యావ్యవస్థకు ఖర్చు పెడుతున్నది అంతంతమాత్రమే. తిరోగమన విధానానికి చెల్లుచీటి ఇవ్వాలి. కాలేజీ అకౌంట్లకే నేరుగా విద్యా దీవనె నిధులు వేయాలని మాజీ ఎమ్మెల్సి ఏ.ఎస్ రామకృష్ణ తెలిపారు.

LEAVE A RESPONSE