– జగనన్నను జరూర్ వదిలేయండి.. ప్లీజ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘దేవుడి దయ వల్ల, మనందరి ప్రభుత్వం వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తాలే అన్నా. దాన్ని నాకు వదిలేయండన్నా’’
– ఎన్నికల ముందు ఉద్యోగులకు జగన్ హామీ
‘‘ఎలక్షన్లో సీపీఎస్ గురించి మాకూ తెలియదు. అవగాహన లేక చెప్పాం’’
– ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజా ప్రకటన
‘‘ ప్రజలకు మద్యం తాగాలంటేనే భయం వేసేలా రేట్లు పెంచుతాం. షాక్ పుట్టిస్తాం. మేం మీలాగా రహస్యంగా చేయం. మద్యం తాగాలన్న కోరికను చంపేందుకు రేట్లు పెంచుతాం. సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తాం. మా ప్రభుత్వం మద్యం అమ్మకాల మీద ఆధారపడదు ’’
– అసెంబ్లీలో జగన్, అంబటి రాంబాబు
‘‘మద్యం ధరలు 25 శాతం తగ్గిస్తున్నాం. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ అమ్మకాలు నివారించేందుకు కృషి చేస్తున్నాం’’
– తాజాగా జగనన్న సర్కారు నిర్ణయం
జగనన్న ఇచ్చిన ఈ పాత స్టేట్మెంట్లు పట్టుకుని, కొత్తగా తీసుకున్న నిర్ణయాలను వాటికి జతచేసి, సోషల్‌మీడియా జగనన్న సర్కారును బనాయించడం బొత్తిగా బాగోలేదు. యుశ్రారైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పినట్లు, సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జలన్న అప్పటికీ తమకు ఏమీ
తెలియకుండానే సీపీఎస్ రద్దు గురించి హామీ ఇచ్చామని, ఇప్పుడు అనుభవమయి తత్వం బోధపడింది కాబట్టి, అది కుదిరేపని కాదని నిజాయితీగా, నిండుమనసుతో చెప్పిన తర్వాత కూడా, సోషల్ మీడియా సీపీఎస్ హామీని గుర్తు చేసి ముల్లుగర్రతో గుచ్చడం ఏమీ బాగోలేదు.
‘దిసీజ్ వాస్తవం’.. అని జగనన్న స్టైల్లో, సజ్జలన్న చెప్పిన తర్వాత కూడా ఇంకా జగనన్న సర్కారును బనాయిస్తే ఎట్ల? తప్పు కదూ?! వదిలేయండబ్బా. అప్పటికీ నోరు విప్పాల్సిన ఉద్యోగ సంఘాలే నవరంధ్రాలూ మూసుకుని, అసలు చేయని ఉద్యమానికి ముందస్తుగా తెల్లజెండా ఎగరేసి విరమించినట్లు ప్రకటిస్తే, మధ్యలో ఈ సోషల్‌మీడియా గత్తరేంటంట? కందకు లేని దూల కత్తికెందుకన్నట్లు, ఉద్యోగ సంఘాలకు లేని బాధ సోషల్మీడియాకెందుకంట? జగనన్న మాట తప్పరు. మడమ తిప్పరన్న బిరుదు ఉండవచ్చు. బిరుదులేముందబ్బా? అదేమన్నా ఐఎస్ఐ స్టాంపా? అవసరాల మేరకు మార్చుకోవచ్చు. అట్లా బిరుదులున్నాయని బిగుసుకుని కూర్చుంటే, బడ్జెట్ బండెలా నడుస్తాదీ? గుడ్లు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ నొప్పేందో!
సరే సీపీఎస్ ఇస్యూ పోయి, మద్యం ధరలు తెరపైకి తెచ్చారు బాగానే ఉంది. ఇందులో జగనన్న చేసిన తప్పేమిటంట? అప్పుడెప్పుడో ఎన్నికల ముందు- గెలిచిన తర్వాత అసెంబ్లీలో జగనన్న, అంబటన్న జమిలిగా లిక్కర్రేట్లపై ఏదో ఆవేశంలో.. సజ్జలన్న చెప్పినట్లు, తెలియక ఏదో మాట్లాడారే అనుకోండి. అంతమాత్రానా వాటికి పాత వీడియోలు జతచేసి, కొత్త నిర్ణయాలను లింకు చేయాలా? మనుషులు తప్పులు చేయరా? ఏం జగనన్న మనిషి కాదా? అప్పుడు మందు ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా రేట్లు పెంచుతామని చెప్పిన జగనన్న సర్కారు, ఇప్పుడు వాటిని 25 శాతం తగ్గిస్తే, చప్పట్లు కొట్టి శభాషనాల్సిందిపోయి.. ఈ బనాయించుడేందంట? ఏం మనుషులు మారకూడదా?
ఇంతకూ అసెంబ్లీలో అంబటన్న నవరసాలు దొర్లిస్తూ ఏం చెప్పారు?.. తాగుబోతులు మందు ముట్టుకుంటే షాక్ కొట్టాలి. అదే మా విధానం అని కదా చెప్పింది? మా నాన్న తాగడం మానేశాడని ఒక పిల్లవాడు
అనుకోవాలి. నా భర్త జగన్మోహన్రెడ్డి గారు వచ్చిన తర్వాత తాగుడు మానేశాడని ఒక భార్య అనుకోవాలి. చంద్రబాబు హయాంలో బాటిల్ ధర చీప్‌గా ఉండేది. జగనన్న వచ్చిన తర్వాత మా ఆయన బాటిల్ పట్టుకుంటే షాక్ కొడుతోందని భార్య అనుకోవాలి. మేం మందు పట్టుకుంటే షాక్ కొట్టాలనే రేట్లు పెంచుతామని చెప్పే చేస్తున్నాం. ఇందులో దాపరికం ఏముంది? అని కదా అంబటన్న అసెంబ్లీలో మైకు
విరచకుండా చెప్పింది? ‘రాంబాంబ’న్న ఇవన్నీ చెబుతుంటే, జగనన్న కూడా ముసి ముసి నవ్వులు నవ్వారు కదా? మర్చిపోతే ఎలా స్వామీ? మరి జగనన్న కూడా ఏం చెప్పారు? మా ప్రభుత్వం వచ్చిన
తర్వాత మూడు దశల్లో మద్య నిషేధం నిషేధిస్తామని, ఫైవ్‌స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే పెట్టాం అనే కదా చెప్పింది?
ఇదంతా ఓపెనే కదా? గూగుల్ మాతని అడిగితే పాత వీడియోలు వచ్చేస్తాయి కదా? అంతోటిదానికి పడరానివారేదో ఘనకార్యం సాధించినట్లు, జగనన్న-అంబటన్న మందు రేట్లపై చేసిన వీడియో ప్రసంగాలు
ఇప్పుడు రిలీజు చేసి, దానిని గత్తర చేసి జగనన్న గవర్నమెంటు గబ్బు పట్టించడం అవసరమాచెప్పండి? సీపీఎస్‌పై సజ్జలన్న సెలవిచ్చినట్లు.. మందుపై జగనన్న కూడా అప్పుడంటే ఏదో తెలియక- అవగాహన
లేక- క్లారిటీ లేక ఏదో చెప్పారని సర్దుకుపోక, ఈ లొల్లేదంట?
సరే.. అప్పుడంటే దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధం పెడతామని జగనన్న ఆవేశపడ్డారే అనుకోండి. ఏదో కుర్రతనం. అనుభవ రాహిత్యం. కందుకూరి వీరేశలింగం మాదిరిగా ఏదో సమాజాన్ని
సంస్కరిద్దామనుకున్నారే అనుకోండి. అవన్నీ నిజమని నమ్మితే ఎలా? సజ్జలన్న చెప్పినట్లు, అవగాహన లేక లక్షాతొంభై అని ఉండవచ్చు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల అనుభవంలో తత్వం బోధపడింది కాబట్టి, జగనన్నయ్య నేలమీదకొచ్చారని ఎందుకనుకోకూడదు?
ఆ తత్వం బోధపడబడబట్టే కదా.. లిక్కర్ కార్పొరేషన్‌కు సంక్షేమ పథకాల బాధ్యత అప్పగించింది? అంటే సాధ్యమైనంత మేరకు జనాలతో తాగించి, ఆ సొమ్ములతోనే సంక్షేమాన్ని లాంగిచమనే కదా జగనన్నయ్య
సర్కారు కవి హృదయం? అది కూడా అర్థం చేసుకోలేని వారు ఆంధ్రాలో ఉండటమే అనర్హులు.
ఓకే.. ఓకే.. అన్నీ తెలియక ఇచ్చిన హామీలని ఒప్పుకుంటున్న జగనన్న సర్కారు.. చివరకు మూడు రాజధానుల ప్రకటన కూడా, ‘తెలియక చేశామని’ చెప్పక తప్పదన్న లోకేషన్న జోస్యాన్ని కూడా నిజం చేస్తారా ఏంటీ? ఏమో.. అనుభవమయిన తర్వాత తత్వం ఇమ్రాన్‌ఖాన్ ఫాస్ట్ బౌలింగ్ మాదిరిగా అర్ధమవుతుంటే ఏదైనా సాధ్యమేనేమో?! పాలకులకు అనుభవం మీదట అన్నీ అర్ధమవుతుంటాయి. ప్లీజ్.. దాన్ని బనాయించకుండా ఒదిలేద్దురూ?!
అది జగనన్నపై జాలితో కాదు. అప్పులతో అవస్థలు పడుతున్నాం ఆదుకోండని.. అర్ధనిమీలిత నేత్రాలతో ఆర్ధికమంత్రిని అర్ధిస్తున్న మన ఎంపీల అప్పుల అరుపులు చూసయినా అర్ధం చేసుకోండి. అప్పుల సాగరం ఈదుతున్న జగనన్న సర్కారుపై రాళ్లేయకుండా, సహృదయంతో సహకరించండి. అదే పదివేలు.