Suryaa.co.in

Editorial

తెలంగాణ బీజేపీ ‘కోర్ కమిటీ’పై కుదరని కుస్తీ

– నచ్చిన వారికే ఆహ్వానం
– సీనియర్ల సమావేశాలకూ కొందరికే పిలుపు
– ఇప్పటిదాకా కోర్ కమిటీ వేయని బీజేపీ
– సీనియర్ల అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)

పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేసే కోర్ కమిటీ సంఖ్యపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోకపోవడంపై తెలంగాణ బీజేపీ సీనియర్లలో విస్మయం వ్యక్తమవుతోంది. కీలక నేతలు సభ్యులుగా ఉండే ఈ కమిటీలో చేసిన నిర్ణయాల మేరకు, పార్టీ కార్యక్రమాలు, నియామకాలు జరుగుతుంటాయి. అయితే ఇప్పటివరకూ తెలంగాణలో కోర్ కమిటీని అధికారికంగా ఏర్పాటుచేయకపోవడంపై సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

laxmanడాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో మంత్రి శ్రీనివాస్‌జీ, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్, మురళీధర్‌రావు, రాంచందర్‌రావు, రాజాసింగ్ సభ్యులుగా ఉండేవారు. సహజంగా అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్, కౌన్సిల్ నుంచి ఎమ్మెల్సీ, కేంద్రంలో మంత్రులు, జాతీయ కార్యవర్గంలో ఉండేవారు కోర్ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తుంటారు. అయితే అమిత్‌షా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేవలం 5 గురు మాత్రమే కోర్ కమిటీలో ఉండాలని నిర్ణయించారు.

ఆయన కేంద్రమంత్రిగా వెళ్లిన తర్వాత ఆ సంప్రదాయం మారిపోయి, సంఖ్య కూడా పెరిగింది. అయితే కోర్ కమిటీలో ఎంతమంది ఉండాలన్న సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో, సంఘటనా మంత్రి కోరుకున్న వారినే, కోర్ కమిటీకి పిలిచే కొత్త సంప్రదాయం మొదలయింది. ఒక్కోసారి ఒకరిని కోర్ కమిటీకి పిలుస్తున్నారు. ఇదంతా రాష్ట్ర సంఘటనా మంత్రి, ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌జీ మనోగతం ప్రకారమే జరుగుతోంది తప్ప, అందులో రాష్ట్ర అధ్యక్షుల ప్రమేయం ఏమీ లేదని సీనియర్లు చెబుతున్నారు.

లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి కొనసాగిందని గుర్తు చేస్తున్నారు. సహజంగా రాష్ట్ర ఇన్చార్జి, కో ఇన్చార్జిలుగా ఉండేవారు సంఘటనా మంత్రికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి, వారంతా ఈ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోరని, దాన్ని సంఘటనా మంత్రులు సద్వినియోగం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ సీనియర్లు వివరిస్తున్నారు.

kishan-bandi-sanjayప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. అందులో రాజాసింగ్ అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్, ఎంపీగా ఉన్న కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి, సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక జాతీయ కమిటీలో మురళీధర్‌రావు, డికె అరుణ, వివేక్, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, డాక్టర్ లక్ష్మణ్ జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. వీరంతా జాతీయ కార్యవర్గంలోdk-aruna-garikapati-mohan-rao వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. కాబట్టి సహజంగా వీరంతా కోర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే కేవలం ఏడుగురు మాత్రమే కోర్ కమిటీలో ఉంటారని, మిగిలిన వారిని ముఖ్యమైన భేటీలకు పిలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో స్పష్టత లేకపోవడం, పైగా ఇంతవరకూ అధికారికంగా కోర్ కమిటీ ఏర్పాటుచేయకపోవడంపై సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అయితే కోర్‌కమిటీలో ఎంతమంది ఉండాలన్న దానిపై ఏపీ మాదిరిగా సెంట్రల్ ఆఫీసు నుంచి స్పష్టత లేకపోవడంతో, మంత్రి శ్రీనివాస్‌జీ కోరుకున్న వారికే కోర్ కమిటీ భేటీలకి ఆహ్వానం అందుతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధంగా కోర్ కమిటీ భేటీలకు ఆ రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోథర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఇష్టం ఉన్న వారినే పిలిచే సంప్రదాయంపై అక్కడి సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన వైనాన్ని తెలంగాణ నేతలు గుర్తు చేస్తున్నారు.
చివరకు ఎంపీలను సైతం కోర్ కమిటీకి దూరంగా ఉంచిన వైనంపై ఆగ్రహించిన వారంతా అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. దానితో దిద్దుబాటుకు దిగిన జాతీయ నాయకత్వం, కోర్ కమిటీ సభ్యులను నియమిస్తూ తొలిసారి సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చింది. స్వయంగా సెంట్రల్ ఆఫీసు నుంచే ఆదేశాలు రావడంతో సునీల్ దియోథర్ దూకుడుకు బ్రేక్ వేసినట్టయింది.

తెలంగాణలో కూడా అదే విధంగా కోర్ కమిటీపై సెంట్రల్ ఆఫీసు నిర్ణయం తీసుకోవాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. లేక పోతే మంత్రి శ్రీనివాస్‌జీకి ఇష్టం ఉన్న వారినే, కోర్ కమిటీలో కొనసాగించే ప్రమాదం ఉందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక సీనియర్ల సమావేశాల పేరిట నిర్వహించే కార్యక్రమాలకూ, తమకు నచ్చిన వారికే ఆహ్వానాలు అందుతున్న వైనంపైనా పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

LEAVE A RESPONSE