Suryaa.co.in

National

లోక్‌స‌భ‌లో బాల్య వివాహాల నిరోధ‌క స‌వ‌ర‌ణ బిల్లు

న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిరోధ‌క స‌వ‌ర‌ణ బిల్లు 2021ను ఇవాళ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర మ‌హిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని మ‌తాల్లో వివాహ వ‌య‌సు ఒక్క‌టిగా ఉండాల‌న్నారు. ఈ స‌వ‌ర‌ణ బిల్లుతో.. మ‌హిళ‌ల క‌నీస వివాహ వ‌య‌సును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల‌కు పెంచ‌నున్నారు.

మ‌హిళ‌ల వివాహ వ‌య‌సు బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చిన స‌భ‌లోని పురుష స‌భ్యుల‌కు మంత్రి స్మృతీ ఇరానీ థ్యాంక్స్ తెలిపారు. అయితే ఈ బాల్య వివాహ నిరోధ‌క స‌వ‌ర‌ణ బిల్లును స్టాండింగ్ క‌మిటీకి సిఫార‌సు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం చ‌రిత్రాత్మ‌కం అని, మ‌హిళ‌ల ప‌ట్ల త‌మ‌కు ఎటువంటి భేద‌భావం లేద‌న్నారు. మ‌హిళ‌ 18 ఏళ్ల‌కు గ‌ర్భ‌వ‌తి అయితే.. అప్పుడు గ‌ర్భ‌స్రావం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, అలాంటి ప్ర‌మాదాల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు అని మంత్రి ఇరానీ తెలిపారు. దేశ మ‌హిళ‌ల త‌ర‌పున ఈ బిల్లును తీసుకువ‌చ్చిన ప్ర‌ధానికి థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

అధిర్ రంజ‌న్ చౌద‌రి మాట్లాడుతూ.. తొంద‌రప‌డి ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టార‌న్నారు. ఎందుకు ఇలాంటి బిల్లుల‌ను ప్ర‌భుత్వం తీసుకువ‌స్తోంద‌న్నారు. ఈ బిల్లును స్టాండింగ్ క‌మిటీకి సిఫార‌సు చేయాల‌న్నారు. తృణ‌మూల్ ఎంపీ సౌగ‌త్ రాయ్ మాట్లాడుతూ.. మ్యారేజ్ బిల్లును వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపారు.
మైనార్టీలు ఈ బిల్లును వ్య‌తిరేకిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆర్టిక‌ల్ 25ను ఉల్ల‌ఘించిన‌ట్లు అవుతుంద‌ని విప‌క్ష స‌భ్యులు ఆరోపించారు. ప్ర‌భుత్వం ఈ బిల్లును విత్‌డ్రా చేసుకోవాల‌న్నారు. బిల్లు ఆర్టిక‌ల్ 19కు వ్య‌తిరేక‌మ‌ని ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈ బిల్లును వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 18 ఏళ్ల యువ‌తి ప్ర‌ధానిని ఎన్నుకోవ‌చ్చు అని, ఓ అమ్మాయి లివిన్ రిలేష‌న్‌లో ఉండ‌వ‌చ్చు అని, సెక్సువ‌ల్ రిలేష‌న్‌షిప్‌లో కూడా ఉండ‌వ‌చ్చు అని అస‌ద్ అన్నారు. కానీ 18 ఏళ్ల‌కే పెళ్లి హ‌క్కును ఎందుకు వ‌ద్దు అంటున్నార‌ని అడిగారు.

LEAVE A RESPONSE