-మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు, నేతలకు ఎమ్మెల్యే బెదిరింపులు
-వైసీపీలో చేరకపోతే నిర్దాక్షిణ్యంగా ఇళ్లు కూలగొట్టించేస్తున్నారు
-బాధితుల న్యాయపోరాటానికి పూర్తి సహకారం
-వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేది నేనే..అందరికీ పక్కాగృహాలు కట్టిస్తాను
-పెద్దవడ్లపూడి, పేరుకలపూడి పర్యటనలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వైసీపీలో చేరతావా? లేదంటే జేసీబీని పంపమంటావా? అని వైసీపీ ఎమ్మెల్యే ఆయన వంధిమాగధులు మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు, నేతల్ని బెదిరిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో పెద్దవడ్లపూడి, పేరుకలపూడి గ్రామాలలో ఆయన పర్యటించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారయంత్రాంగం కూలగొట్టిన ఇళ్లని పరిశీలించి, బాధితుల్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో పేద ప్రజలకి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ధనవంతులు-వైసీపీ నేతలలో ఒక్కరి ఇంటి జోలికి వెళ్లని అధికారులు, నిరుపేదల ఇళ్లు నిబంధనలకి విరుద్ధంగా కూలగొట్టేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ గెలిస్తే పేదల ఇళ్లు కొట్టించేస్తారని ఆరోపించిన ఎమ్మెల్యేనే ఇప్పుడు ఇళ్లు ధ్వంసం చేయించడం దారుణమన్నారు. చట్టాలు- నిబంధనలు పాటించకుండా, అర్ధరాత్రి జేసీబీలతో దశాబ్దాలుగా వుంటున్న వారి ఇళ్లు కూలగొట్టి పేదల్నినడిరోడ్డుని పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలైతే ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లులన్నీ ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు.
పేదల గూడు కూల్చేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కూలగొట్టింది పక్కోడి ఇల్లని ఊరుకుంటే, ప్రతీ ఇంటిపైకి జేసీబీ వస్తుందని హెచ్చరించారు. అంతా ఏకమై న్యాయపోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే బాధితులందరికీ పక్కాగృహాలు కట్టిస్తానని హామీ ఇచ్చారు.
ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితుల ఆవేదన వారి మాటల్లోనే ….
ఇంట్లో పిల్లకి పెళ్లి పెట్టుకున్నాం. ఇంతలోనే మా ఇల్లు కూల్చేశారు. పెళ్లి ఎలా చేయాలి? మమ్మల్నినడిరోడ్డున పడేశారు- షేక్ బాజీ
40 ఏళ్లుగా ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి మా ఇళ్లని కూలగొట్టేశారు-శైలజ , తిరుపతమ్మ
20 ఏళ్ల క్రితం కష్ట పడి 7 లక్షలతో ఇల్లు కట్టుకున్నాం. ఒక్క రాత్రిలో మా ఇంటిని పడేశారు. క్రిస్మస్ పండగ ఎలా జరుపుకోవాలి?- మేరీ
మేము ఇటీవల స్థానిక ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం పనిచేశాం. టిడిపి మద్దతుదారుల్ని గెలిపించుకున్నాం. ఆ తరువాత నుంచి వైసీపీలో చేరాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. మేము పార్టీ మారలేదు. దీంతో మా ఇళ్లు అర్ధరాత్రి జేసీబీలతో వచ్చి కూలగొట్టేశారు- పేరుకులపూడి గ్రామస్తులు
నాకు కళ్లు కనపడ్డం లేదయ్యా అని సత్యవతి అనే మహిళ లోకేష్ దృష్టికి తీసుకురాగా, తానే ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు.
కక్షసాధింపుచర్యల్లో భాగంగానే ఇళ్ల తొలగింపు-గుంటూరు జిల్లా కలెక్టర్‌కి నారా లోకేష్ లేఖ
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని, నిబంధనలు పాటించకుండానే ఇళ్లు తొలగిస్తున్నారని, తక్షణమే జోక్యం చేసుకోవాలని గుంటూరు కలెక్టర్‌కి నారా లోకేష్ లేఖ రాశారు. మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు సర్కిల్, పెదవడ్లపూడి పరిధిలో ఎటువంటి లీగల్-రాతపూర్వకమైన నోటీసులు లేకుండా ఏకపక్షంగా దుకాణాలు, ఇళ్లు అధికారయంత్రాంగం తొలగించడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపాలని ఆ లేఖలో కోరారు.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న లోకేష్
పేరుకలపూడి గ్రామంలో జరిగిన సెమీక్రిస్మస్ వేడుకల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ కానుకలు అందజేశారు.