Suryaa.co.in

Editorial

తొలిసారి వంగవీటి ఇంటికి చంద్రబాబు

– రాధా హత్యకు రెక్కీపై ఆరా
– వారి వివరాలు వెల్లడించిన రాధా?
– కుటుంబానికి దన్నుగా ఉంటానన్న బాబు
– ఇకపై రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటానన్న రాధా
( మార్తి సుబ్రహ్మణ్యం)

దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలిసారిగా వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. వంగవీటి రంగా హత్య తర్వాత టీడీపీకి కాపులు దూరమైన నేపథ్యంలో, చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన భార్య రత్నకుమారి టీడీపీలో చేరి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలిసారి వంగవీటి రాధా నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాలను ఆకర్షించింది.

ఇటీవల తనపై రెక్కీ నిర్వహించారన్న వంగవీటి రాధా ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు స్పందించి, వారిని శిక్షించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాశారు. రాధాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని, పార్టీ మీ వెనుక

ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన ప్రభుత్వం రాధాకు 2+2 గన్‌మెన్లు కేటాయించినప్పటికీ, తనకు ప్రజలే రక్షణగా ఉంటారంటూ గన్‌మెన్లను వెనక్కి పంపించారు.
ఈ నేపథ్యంలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయవాడ క్లబ్ సమీపంలోని రాధా నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. రాధా, తన తల్లి రత్నకుమారితో కలసి చంద్రబాబుకు రెక్కీ వివరాలు వెల్లడించారు. ఆ సందర్భంగా తనపై రెక్కీ నిర్వహించేందుకు ఆదేశించిన వారి పేర్లను రాధా, పార్టీ అధ్యక్షుడికి చెప్పినట్లు సమాచారం.

కాగా, రాధా కేంద్రంగా జరుగుతున్న రాజకీయ కుట్రలను విశ్లేషించిన చంద్రబాబు, ఆయనను జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. జనంలోకి వెళ్లేముందు అప్రమత్తంగా ఉండతాలన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ చేస్తున్న రాజకీయాలను విశ్లేషించుకుని, నడుచుకోవాలని చెప్పినట్లు సమాచారం. మీ కుటుంబానికి పార్టీ నైతికంగా, రాజకీయంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా ఇకపై రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న చంద్రబాబు సూచనను రాధా అంగీకరించినట్లు పార్టీ వర్గాల సమాచారం. తాను ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తానని రాధా, పార్టీ అధినేత బాబుకు చెప్పారు. అదేసమయంలో రాధాకు తగిన రాజకీయ సలహాలివ్వాలని ఆయన తల్లి రత్నకుమారికి సూచించారు.

ఆధారాలిచ్చినా పట్టుకోలేరా: బాబు ఫైర్
తనపై రెక్కీ జరిగిందంటూ వంగవీటి రాధా ఇచ్చిన ఆధారాల ప్రాతిపదికనయినా నిందితులను పట్టుకోరా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా నివాసం నుంచి బయటకువచ్చిన చంద్రబాబు, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల పనితీరుపై ధ్వజమెత్తారు.
‘‘ రాధా పై రెక్కీ ఘటనపై ప్ర‌జ‌లు న‌మ్మే విధంగా పోలీసుల విచారణ ఉండాలి. ఘటన విషయం బయటకు వచ్చి ఇప్ప‌టికే వారం అవుతుంది… అయినా ఏమీ తేల్చ‌లేదు. నేను లేఖ కూడా డీజీపీ కి లేఖ

రాశాను…దాని ఆధారం గా విచార‌ణ చెయ్య‌లేరా? ఇలాంటి ఘటనల్లో కాల‌యాప‌న చెయ్య‌డం మంచిది కాదు. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని స్వ‌యంగా వంగ‌వీటి రాధా చెప్పారు. ఇంటివద్ద కారు తిరిగిన‌ట్లు ఎవిడెన్స్ వ‌చ్చిన త‌రువాత కూడా ఎందుకు దోషుల‌ను ప‌ట్టుకోలేదు. కొన్ని ఆధారాలు ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయినా కారు ఎవ‌రిదో ఎందుకు ప‌ట్టుకోలేక‌పోయారు. దోషుల‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది ’’అన్నారు.

LEAVE A RESPONSE