Suryaa.co.in

Andhra Pradesh

పేదలు దరిద్రులుగానే ఉండాలా ?

– ఇళ్ల పేరిట వేల కోట్ల దోపిడీ
-తాడేపల్లి మోడల్ ఇంటిలో సజ్జల కుటుంబం ఒక్క రోజు ఉండాలి
-రైతు నాయకులతో సమస్యలపై సమీక్షకు సిద్ధం
– పింఛన్ల పేరిట కోట్లాది రూపాయల ప్రకటనలు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజ‌య‌వాడ‌ : రాష్ట్రంలో పేదలు దరిద్రులుగానే ఉండాలా? ఇళ్ల పేరిట వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. విజయవాడ దాసరిభవన్లో ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, జి.ఓబులేసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ లతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

రామకృష్ణ మాట్లాడుతూ రెండున్నరేళ్ల తర్వాత సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాల నిర్మాణాత్మక సూచనల్ని ఆహ్వానిస్తామంటూ స్పందించడాన్ని స్వాగతించారు. రాష్ట్రంలోని 33 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ 10 వేల కోట్లు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చుచేయడాన్ని ఆహ్వానించారు. ఈ ఇళ్ల నిర్మాణంలో పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణులకు 3 సెంట్లు ఇవ్వాలని తాము ముందు నుంచి చెబుతూనే ఉ న్నామని గుర్తుచేశారు . అనేమీ ప్రభుత్వం పట్టించుకోకుండా, ఏకపక్ష వైఖరితో ఇళ్లను నిర్మించడాన్ని తప్పుపట్టారు. ఈ ఇళ్లు గేటెట్ కమ్యూనిటీలాగా ఉంటాయంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తగదన్నారు.

నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, ఒక్క రోజు తాడేపల్లిలో నిర్మించిన మోడల్ ఇంటిలో సజ్జల కుటుంబ సభ్యులు వెళ్లి నివసించాలని సూచించారు. జగన్ ఇంటి బాల్రూమ్ అంత సైజులో కూడా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లు లేవన్నారు . పేదల ఇంటి నిర్మాణం పేరుతో రూ.4 వేల కోట్లను కొల్లగొట్టారని మండిపడ్డారు. పైపెచ్చు మళ్లీ ఆ ఇళ్లను పేదలు విక్రయించుకునేందుకు ఓటీఎస్ విధానం తెచ్చారనీ, వాటిని వైసీపీ నేతలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పూర్తిగా అవినీతి మయంగా ఈ ఇళ్ల పథకాన్ని మార్చి, మళ్లీ ఎన్నికలకు వైసీపీ నేతలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారని ధ్వజమెత్తారు.

ఇది ప్రభుత్వం చేపట్టిన మంచి పథకమే అయినప్పటికీ, అవినీతి మయంగా మారడం దురదృష్టకరమన్నారు . పేదలను మరింత పేదలుగా తయారు చేస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు లేకుండా ఇళ్లను నిర్మించడం ఏం ఉ పయోగపమంటూ ప్రశ్నించారు. సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే, అమరావతిలో నిర్మించిన 5,600 ఇళ్లను పేదలకు అప్పజెప్పకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, గత ప్రభుత్వ హయంలో నిర్మించిన 56 వేల టిడ్కో ఇళ్లను ఎందుకు కేటాయించడం లేదని, నిర్మాణంలో ఉన్న 2 లక్షల ఇళ్లను ఎందుకు పూర్తి చేయడం లేదంటూ ప్రశ్నించారు.

ఇళ్ల నిర్మాణం, పింఛన్ల పేరిట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదవాడి అభివృద్ధి కోసం ఆలోచించాలని డిమాండు చేశారు. ఈ రెండున్నరేళ్లల్లో రాష్ట్రంలో బెత్తెడు అభివృద్ధి జరగలేదని, వ్యవసాయ రంగం, ఐటీ, పారిశ్రామికాభివృద్ధి, రహదారుల నిర్మాణం, ఉద్యోగాల కల్పన కొనసాగలేదని వివరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రాన్ని ప్రభుత్వం నిలదీయడం లేదన్నారు. ఇంతవరకు మోదీకి వెళ్లి సీఎం ఆర్జీ కూడా ఇవ్వలేక పోయారన్నారు.

గంగవరం పోర్టును ఆదానీకి అప్పగించారని తూర్పారబట్టారు. ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాల్నే. మళ్లీ ఆర్భాటంగా ప్రకటిస్తూ, ప్రచారం చేయడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. ఈనెల 1 వ తేదీన పింఛన్లు పెంపు పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన ప్రచారం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాలు ( ఆర్దికే ) ల ద్వారా రైతుల సమస్యలు తీరుతున్నాయని, వారికి మద్దతుధర పొలం గట్టుపైనే ఇస్తున్నామంటూ సజ్జల చెప్పిన విషయాలు అన్నీ అవాస్తవాలన్నారు.

నెల్లూరుజిల్లాతోపాటు రాయలసీమలో అధిక వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదని, రైతులకు క్రాఫ్, ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదని వివరించారు. నిజంగా ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి , రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వాన రైతు సంఘాల నేతలతో పర్యటనలు చేయించి, వారి ద్వారా పంట నష్టంపైన, రైతులు సమస్యలపైన నివేదికలు తీసుకోవాలని, అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

చెరకు రైతుల బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదని, సుబాబుల్ రైతుల సమస్యలపై ప్రకాశం, కృష్ణాజిల్లాల్లో రైతులు ధర్నాలు చేస్తున్నారన్నారు. సీపీఐ తరఫున నిర్మాణాత్మకమైన సలహాలను ప్రభుత్వానికి రాత పూర్వకంగా ఇచ్చేందుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు . కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ, మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, తడచిన ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండు చేస్తూ ఈ నెల 6 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధర్నాలకు పిలుపునిచ్చిందన్నారు. సుబాబుల్ రైతుల సమస్యల పరిష్కారంపై 10వ తేదీన చలో సీఎం క్యాంపు కార్యాలయానికి రైతు సంఘాలు పెద్దఎత్తున తరలివెళ్లనున్నామని వెల్లడించారు.

LEAVE A RESPONSE