-అమరావతి రాజధాని నగరపాలక సంస్థ ఏర్పాటుపై గ్రామసభలు చివరిరోజుకు చేరుకున్నాయి
– తుళ్లూరు మండలం రాయపూడిలో అధికారులు గ్రామసభ నిర్వహించారు
– ప్రభుత్వ ప్రతిపాదనను రాయపూడి రైతులు మూకుమ్మడిగా వ్యతిరేకించారు
అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రభుత్వం 19 గ్రామాల్లో గ్రామసభలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేటితో గ్రామ సభలు ముగిశాయి. అన్ని గ్రామాల్లోనూ అమరావతి క్యాపిటల్ సిటీ ప్రతిపాదనపై వ్యతిరేకంగా ప్రజలు తీర్మానాలు చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చారు.19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకించారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం 29 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అమరావతి రాజధాని నగరపాలక సంస్థ ఏర్పాటుపై గ్రామసభలు చివరి రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు మండలం రాయపూడిలో అధికారులు గ్రామసభ నిర్వహించారు.ప్రభుత్వ ప్రతిపాదనను రాయపూడి రైతులు మూకుమ్మడిగా వ్యతిరేకించారు.
రాజధానిని విచ్ఛిన్నం చేసి 19 గ్రామాలతో కార్పొరేషన్ చేయాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నించారు. అమరావతి పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేయకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇచ్చిన సమయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చి గ్రామసభలు నిర్వహించారని, ఇప్పుడు మండల స్థాయి అధికారులతోనే సభలు
నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అప్పట్లో భూసమీకరణకు భూములు ఇచ్చినందుకు ఎన్నో హామీలు ఇచ్చారని.. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పుడు ఈ గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలకు విలువ ఉంటుందని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను నమోదు చేసుకున్న అధికారులు ఓటింగ్ నిర్వహించారు. గ్రామస్థులంతా అమరావతి కార్పొరేషన్ ఏర్పాటును ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు.