Suryaa.co.in

Features

ఆధునిక విజ్ఞానానికీ వేదాలకూ సంబంధం లేదు

ఎవరైనా తాము ఆధ్యాత్మిక శక్తితో పుష్పక విమానాల్లో తిరుగుతామంటే ఎవరు కాదన్నారు? స్త్రీ అండాలను కుండల్లో వేసి పిల్లల్ని పుట్టిస్తామంటే ఎవరు కాదన్నారు? నీటిలో తేలే రాళ్లతో నదుల మీద, సముద్రాల మీద, వంతెనలు కడతామంటే ఎవరు వద్దన్నారు? ప్రజా ధనం మిగులుతుంది. దేశానికి మేలు జరుగుతుంది. ఇంతెందుకు పొద్దున్నే టీ, కాఫీలు తాగమని వీరికి ఏ రుషులు చెప్పారో మరి? సనాతన రుషి వారసత్వాన్ని కొనసాగించాలంటే గోచీలు పెట్టుకోవాలి గానీ, ఆధునిక వస్త్రధారణ దేనికీ? మనం ఆక్సిజన్‌ పీల్చుకొని, కార్బన్‌ డై ఆక్సైడ్‌ వదిలేస్తున్న సమాచారం వేదాల్లో ఎందుకు లేదు.

పోనీ ఆక్సిజన్‌ హైడ్రోజన్‌ల కలయిక వల్ల నీరు తయారైందన్న ప్రాథమిక సమాచారం కూడా ఇవ్వని వేదాలు ఆధునికుడికి ఎలా ప్రామాణికమవుతాయి? కట్టు కథలు చెప్పే ఇలాంటి మహా ఉపన్యాసకులు పెద్ద పదవుల్లో ఉన్నా సరే… కుహనా మేధావుల కట్టుకథలను బాధ్యత గల పౌరులు పట్టించుకోకపోవడమే మంచిది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రానికీ వేదాలకూ, పురాణ గ్రంథాలకూ ఏదో ఒక గట్టి సంబంధం ఉందని హిందూ మత జాతీయవాదులు ప్రచారం చేస్తుంటారు. పూర్వ కాలపు భారతీయ రుషులు అందించిన గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ముందు పశ్చిమ దేశాల నుండి మనకు అందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏ మాత్రం గొప్పది కాదని చెబుతుంటారు. వీళ్లు చెప్పే మాటలకు భారతీయులంతా రొమ్ము విరుచుకుని గర్వపడాలని, విదేశీయులంతా అసూయతో కుళ్లుకోవాలని వారు భావిస్తుంటారు. కానీ, అది జరిగేది కాదు.

ప్రపంచ దేశాలన్నింటి నుండి కొత్తకొత్త ఆవిష్కరణలు ఒక్కచోటికి చేరి, అది ఆధునిక విజ్ఞానంగా మారి విశ్వమానవాళికి అందుబాటులోకి వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది. వస్తూనే ఉంటుంది. చాలా ముఖ్యమైన వైజ్ఞానిక పరిశీలనలు తొలి దశలో అరబిక్‌, ఇండియా, చైనా నాగరికతల నుండి కొంత మేరకు వెలువడ్డాయన్నది నిజం. కానీ ప్రపంచం ప్రగతి పథంలోకి నడవడానికి అది మాత్రమే సరిపోలేదు. యూరోప్‌ దేశాల నుండి 16, 17 శతాబ్దాలలో వైజ్ఞానిక పరిశోధనల వెల్లువ హోరెత్తింది. ఆ ఫలితాలు క్రమంగా తూర్పు దేశాలకు కూడా అందాయి. ఇదీ వాస్తవం.

దీన్ని పక్కనబెట్టి అన్ని రంగాలలో భారత్‌ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలబడిందనడం కేవలం అతిశయోక్తి. ఈ అతిశయోక్తుల వల్ల జరిగే ప్రమాదమేమంటే భారతదేశం చేసిన కృషికి కూడా విలువ లేకుండా పోతోంది. ఈ దేశంలోని ఆధ్యాత్మిక చింతనకు, లలిత కళలకు, క్రికెట్‌ ఆటకు తప్పకుండా ప్రత్యేకత ఉంది. వాటితో దేశానికి గుర్తింపు వచ్చింది నిజమే. బాధ్యతతో సృజించిన సాహిత్యం జన చైతన్యానికీ, మిగతావి జనాన్ని రంజింపజేయడానికి ఉపయోగపడ్డాయి. కానీ దేశం ప్రగతి బాటలో నడవడానికి ఇవేమీ నేరుగా ఉపయోగపడలేదు. ఉపయోగపడవు కూడా!

వందల ఏళ్లు దేశం, బ్రిటిష్‌ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉంది గనుక, ఇక్కడి ప్రతిభావంతులకు ఇంగ్లాండ్‌లో చదువుకోవడానికి వీలైంది. అందుకే ఆ కాలంలో ఎక్కువ మంది బారిస్టర్లై తిరిగొచ్చారు. తర్వాత కాలంలో వీళ్లంతా స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొన్నారు. కానీ వైజ్ఞానికుల సంఖ్య ఎప్పుడూ తక్కువే. మనకు ఒక్క సివి.రామన్‌ తప్ప నోబెల్‌ సాధించిన భారతీయ వైజ్ఞానికులు మరొకరు లేరు. మరి కొంతమంది భారతీయులు నోబెల్‌ సాధించినా, వారంతా విదేశాల పౌరసత్వం స్వీకరించి అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నవారు. స్వాతంత్య్రం లభించిన తర్వాత దేశంలో వైజ్ఞానిక స్పృహ వ్యాపింపజేయాలన్న పట్టుదలతో తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వైజ్ఞానిక పరిశోధనలను ప్రోత్సహించారు. ఇప్పుడున్న జాతీయ సంస్థలన్నీ దాదాపు ఆయన ప్రారంభించినవే.

అయితే ఇప్పటి ప్రభుత్వం వాటికి నిధులు కూడా ఇవ్వలేని హీనస్థితికి జారిపోయింది. పైగా శాస్త్రవేత్తలు ప్రాచీన కాలం నాటి రుషుల్ని ఆదర్శంగా తీసుకోవాలని నేటి ప్రభుత్వ పెద్దలు ప్రబోధిస్తున్నారు. వాస్తవంగా ఇదీ దేశంలోని పరిస్థితి. వైజ్ఞానిక స్పృహలేని ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే అవి కంటి చూపు కోల్పోయిన ప్రభుత్వాలని జనం ఇప్పుడు గుర్తిస్తున్నారు.

ఈ దేశంలో కొందరు ఆధ్యాత్మిక వేత్తలు, యోగులు పుట్టారు. జనాన్ని ప్రభావితం చేశారు. నిజమే కానీ, వారి బోధల వల్ల దేశం ఆధునిక యుగంలోకి రాలేదు. వారి వల్ల ఆర్థిక ప్రణాళికలు రూపొందలేదు. ప్రాజెక్టులు కట్టబడలేదు. నూతన వ్యవసాయ పద్ధతులు కనుగొనబడలేదు. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి రాలేదు. ‘మనదైన మన గొప్ప సంస్కృతి’ అనే పేరుతో కాలాన్ని, దేశాన్నీ వెనక్కి నడిపించే హక్కు ఎవరికీ లేదు. మనం ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వచ్చామంటే ఆధునికయుగ వైజ్ఞానిక స్పృహతోనే వచ్చాం. ఈ దేశంలో ఆధ్యాత్మిక సంస్కృతి, పురాతన సంస్కృతి, జానపద సంస్కృతి వంటివి వర్ధిల్లుతూ వచ్చాయని ఒప్పుకుందాం. వాటి ప్రత్యేకతలను గుర్తుంచుకుందాం.

అంతవరకే… కానీ, వాటినే ఇంకా కొనసాగిద్దామనుకోవడం తెలివితక్కువతనం అవుతుంది. చార్మినార్‌ కుతుబ్‌ మినార్‌ లాంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించు కుంటాం. గతాన్ని నెమరువేసుకుంటాం… అంతే. మన ఇస్రో రాకెట్‌ ప్రయోగాలను చూసి గర్వపడతాం. ఎందుకంటే వాటివల్ల ఆధునిక జీవనానికి మేలు జరుగుతూ ఉంది కాబట్టి. గతం ఒక పర్యాటక కేంద్రం.

ప్రస్తుత వాస్తవమే నివాస యోగ్యం. మనం ఆ తేడాను గ్రహించవలసి ఉంది. ప్రధానితో సహా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీల వంటి రాజకీయ నాయకులు వారితో ఏవో ప్రయోజనాలు ఆశించే గవర్నర్లు, జడ్జీలు, వైస్‌ చాన్సలర్లు, అధికారులు ఆత్మద్రోహం చేసుకుంటూ జనం మీదికి మూఢ విశ్వాసాల్ని వదులుతున్నారంటే దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారనే అర్థం! జనం చైతన్యవంతులయ్యారని, ప్రతిదీ విశ్లేషించుకుంటు న్నారని వీరు గ్రహించరు.

పదవితో ఎవరూ గొప్పవాళ్లు కాలేరు. సరైన దృక్పథంతోనే అవుతారు. ఇప్పటి తరాన్నే కాదు, భవిష్యత్తు తరాల్ని కూడా ప్రభావితం చేయగలవారే దార్శనికులవుతారు. దార్శనికులు కావడం తర్వాత సంగతి, ముందు వీళ్లు మనుషులైతే చాలు సంతోషిద్దాం! ఆధ్యాత్మికత పేరు చెప్పి, యోగాకు ఒక ప్రపంచ దినాన్ని కేటాయించి ఈ దేశం ప్రపంచానికి ‘సద్గురువు’ అని చెప్పుకోలేం. ఏసీ హాళ్లలో మీటింగ్‌లు ఏర్పాటు చేసుకొని, మంచి ఇంగ్లీషులో, మంచి యాసలో మూఢ నమ్మకాల్ని చాలా చక్కగా ప్రబోధిస్తున్న సద్గురువులను కళ్ల ముందు చూస్తూనే ఉన్నాం.

ఎవరైతే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతారో వారే జ్ఞాన బోధలు చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల జనానికి నష్టమే తప్ప లాభం చేకూరదు. ఎంతటి వారైనా సరే, విచక్షణాజ్ఞానం లేని వారు వివేకవంతులు కారు. దేశంలో తిరోగమన సిద్ధాంతానికి పెద్ద పీట వేసి, కర్ణుడి పుట్టుక, కౌరవుల పుట్టుక, గణేషుడి తొండం, సనాతన విమానాలు, భారతంలో సంజయుడి టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారం వంటి వాటిపై వితండ వాదనలు చేసిన వారు ప్రధాని మోడీ, ఆయన పార్టీ అనుచరులు!

ప్రధాని విద్యార్హతలేమిటని సమాచార హక్కు చట్టం కింద కొంతమంది ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడిగితే అది ‘గోప్యంగా’ ఉంచవల్సిన విషయమని వారు సెలవిచ్చారట. ఆయన ప్రధాని కాకముందు జరిపిన టెలివిజన్‌ ఇంటర్య్వూలో తను హైస్కూలు దాకా చదివానని చెప్పుకున్నారు. ‘తలాక్‌ చెప్పడం ద్వారా భార్యను వదిలిపెట్టిన ముస్లింను జైలుకు పంపేటప్పుడు, జశోదాబెన్‌ను వదిలిపెట్టిన హిందూ నరేంద్రమోడీని ఎందుకు జైలుకు పంపకూడదని అడగడానికి ఒక్క జర్నలిస్టు అయినా సిద్ధంగా ఉన్నారా? ముస్లింలకు బహిరంగ వ్యవహారమైంది మోడీ దగ్గరికి వచ్చే సరికి వ్యక్తిగత వ్యవహారం ఎలా అయ్యిందీ’ అని ఎంతో బాధ్యతాయుతంగా ప్రశ్నించారు ఏఐపీడబ్ల్యూఏ కార్యదర్శి కవితా కృష్ణన్‌.

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవక్‌గా సుదీర్ఘ కాలం పని చేసిన మోడీ పరిజ్ఞానం ఆ విధంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. జర్మన్‌ శాస్త్రవేత్త గ్రిగర్‌ మెండల్‌ (1822-84) జన్యువు గురించి చెప్పిన తర్వాతే జన్యుశాస్త్రం అభివృద్ధి చెందింది. వారసత్వ లక్షణాల గురించి పరిశోధనలు జరుగుతూ వచ్చాయి. లీవెన్‌ హక్‌ (1632-1723) డచ్‌ శాస్త్రవేత్త మైక్రోస్కోపు కనిపెట్టేదాకా సూక్ష్మకణాలను పరిశీలించే అవకాశమే మానవాళికి రాలేదు. అలాంటప్పుడు భారతంలో వంద అండాలను వంద కుండల్లో వేస్తే వారు వంద మంది కౌరవులయ్యారని చెప్పిన ఒక కల్పిత కథను శాస్త్రీయం అని ఎవరనుకుంటారు? నరేంద్రమోడీ అనుచరులు మాత్రమే అనుకుంటారు! ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు గౌరవాన్ని దిగజార్చగలిగిన ఆ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలరే అనుకుంటారు!

సతీ సహగమనం రద్దు చేయాలన్నప్పుడు, బాల్య వివాహాలు రద్దయినప్పుడు, వితంతువులకు పునర్వివాహం అన్నప్పుడు, స్త్రీలు ఆలయ ప్రవేశం కావాలన్నప్పుడు పెద్ద అపచారం జరిగిందని, దైవ ద్రోహం జరిగిందని, హిందూ మతం మీద దాడి జరిగిందని మోడీ-షాల అనుచరులైన హిందూ మతతత్వవాదులు గగ్గోలు పెట్టారు. దళితుల ఆలయ ప్రవేశానికి మారణహోమాలే జరిగాయి. వీరు అంటరానితనాన్ని, వర్ణ వ్యవస్థను, మనుధర్మాన్ని నెత్తికెత్తుకుంటారు.

మనిషి నీడను, స్పర్శను భరించలేరు గానీ, చనిపోయిన తర్వాత స్వర్గ ద్వారాలు తెరుస్తామంటారు. మానవీయ విలువలకు తిలోదకాలు వదిలి పవిత్రులమయ్యామని అనుకుంటారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని మానవ హననం ఇక్కడ ఉన్నందుకు గర్వపడదామా? ప్రపంచానికి ఏ విషయంలో ఆదర్శం? ఆత్మ విమర్శ చేసుకునే పనే లేదా? అందరూ సమానులు అందరికీ సమాన హక్కులన్న భౌతిక వాదులపై దాడులు చేస్తారా? వేదాల్లో, పురాణాల్లో అమోఘమైన విజ్ఞానం దాగి ఉంటే, ఆ విజ్ఞానాన్ని వీరు నిత్య జీవితంలో వాడుకోవాలి కదా?

ఎవరైనా తాము ఆధ్యాత్మిక శక్తితో పుష్పక విమానాల్లో తిరుగుతామంటే ఎవరు కాదన్నారు? స్త్రీ అండాలను కుండల్లో వేసి పిల్లల్ని పుట్టిస్తామంటే ఎవరు కాదన్నారు? నీటిలో తేలే రాళ్లతో నదుల మీద, సముద్రాల మీద, వంతెనలు కడతామంటే ఎవరు వద్దన్నారు? ప్రజా ధనం మిగులుతుంది. దేశానికి మేలు జరుగుతుంది. ఇంతెందుకు పొద్దున్నే టీ, కాఫీలు తాగమని వీరికి ఏ రుషులు చెప్పారో మరి? సనాతన రుషి వారసత్వాన్ని కొనసాగించాలంటే గోచీలు పెట్టుకోవాలి గానీ, ఆధునిక వస్త్రధారణ దేనికీ?

మనం ఆక్సిజన్‌ పీల్చుకొని, కార్బన్‌ డై ఆక్సైడ్‌ వదిలేస్తున్న సమాచారం వేదాల్లో ఎందుకు లేదు. పోనీ ఆక్సిజన్‌ హైడ్రోజన్‌ల కలయిక వల్ల నీరు తయారైందన్న ప్రాథమిక సమాచారం కూడా ఇవ్వని వేదాలు ఆధునికుడికి ఎలా ప్రామాణికమవుతాయి? కట్టు కథలు చెప్పే ఇలాంటి మహా ఉపన్యాసకులు పెద్ద పదవుల్లో ఉన్నా సరే… కుహనా మేధావుల కట్టుకథలను బాధ్యత గల పౌరులు పట్టించుకోకపోవడమే మంచిది.

( రచయిత బయాలజీ ప్రొఫెసర్‌, మెల్బొర్న్‌ నుంచి )

devaraju
– డా||దేవరాజు మహారాజు

LEAVE A RESPONSE