– ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?
– విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలి?
– వైసీపీ ప్రభుత్వం రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలి…..నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలి
– లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా…ఆలోచనతో స్పందించాలి
– ఉద్యోగుల నిసనలపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పందన
అమరావతి: ఛలో విజయవాడలో పాల్గొనే ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు అనుసరించిన అణిచివేత తీరును టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను ముందస్తు అరెస్టులు చెయ్యడం దుర్మార్గం అన్నారు.
ఉద్యోగుల నిరసనలపై గతంలో ఏ ప్రభుత్వం ఇలా నియంతృత్వంగా వ్యవహరించలేదని అన్నారు. పిఆర్ సి విషయంలో ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలకు వస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులను తీవ్రవాదుల్లా అరెస్టులు చేసిన తీరుపై మండిపడ్డారు.
వారు రాష్ట్ర ప్రజలు కాదా…రాష్ట్రంలో భాగస్వాములు కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ పక్షాలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ నిర్భంధాలు సిఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు.పాఠశాలల వద్ద పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం… విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమే అని చంద్రబాబు అన్నారు. ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగమన్న విషయాన్ని సిఎం జగన్ గుర్తించాలన్నారు. లక్షల మంది సమస్యపై ప్రభుత్వం అహంకారంతో కాకుండా ఆలోచనతో వ్యవహరించాలని సూచించారు.
ప్రతి సందర్భంలో ఉద్యోగులను అవమానించే విధంగా సిఎం జగన్ ప్రవర్తించడం వల్లనే ఈ స్థాయి నిరసనలు జరిగాయన్నారు. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్….ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారు అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హమీలను ఉద్యోగులు ప్రశ్నించడమే తప్పా అని అన్నారు. జగన్ విశ్వసనీయతపై కడుపుమండిన ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సిఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ఏర్పాడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తాము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని…..కానీ జగన్ సర్కార్ ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదని విమర్శించారు. ఉద్యోగులు కొత్త పిఆర్సి వద్దు…పాత జీతమే ఇవ్వండి అంటున్నారంటే…. ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అర్థంమవుతుందన్నారు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి….ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.