Suryaa.co.in

Andhra Pradesh

స్వప్రయోజనాల కోసం మాట్లాడడం దుర్మార్గం

-ప్రత్యేక హోదాకు పంగనామాలు
– బీజేపీ చేతకానితనంతో కల్లిబొల్లి కబుర్లు
– ప్రధాని సిగ్గు విడిచి మాట్లాడడం తగదు – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

అమరావతి : రాష్ట్ర పునర్విభజన హామీలు అమలు చేయకుండా ఏడు సంవత్సరాలుగా కాలయాపన చేసిన బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టిపై మాట్లాడడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. అత్యున్నతమైన ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర విభజనపై అసంబద్ధ వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఇప్పుడు కబుర్లు చెపితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రధాని మోడీ వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాతో పాటు పునర్విభజన సమయంలో హామీలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన బీజేపీ ఈ సమస్యలపై పోరాడలేని ప్రాంతీయ పార్టీ ల అసమర్థ ముఖ్యమంత్రులవలన ఆంధ్ర ప్రదేశ్ ను అంధకార ప్రదేశ్ గా మార్చిందని ధ్వజమెత్తారు. ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో దేశాన్ని నాశనం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని, ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని శైలజనాథ్ స్పష్టం చేశారు.

సువిశాల పటంలో దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపథంలో పెడితే అధికారంలోకి వచ్చిన బీజేపీ కూకటి వేళ్ళతో సహా పెకిలించేసే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదన్న అంశాన్ని ప్రధాని మోదీ గుర్తించాలని హితవు పలికారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, అంతటి మహోన్నత పార్టీని టుక్డే టుక్డే పార్టీ అనడం సరికాదన్నారు. అయినా మోదీ పాలనలో ఏం ఒరిగిందని నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేశారే తప్ప సామాన్యులు ఏం చేశారన్నారు.

LEAVE A RESPONSE