కర్ణాటకలో విద్యార్థినులు బురఖా/హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు రావడాన్ని అడ్డుకుని వివాదం సృష్టించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దేశ భవిష్యత్తును నిర్మాణం చేయాల్సిన విద్యాసంస్థలలో నేడు మతం పేరుతో స్వచ్చే, సమానత్వం హరించి, అభద్రత, ఆందోళలకు కారణం కావడం బాధాకరం.
ఇది దేశం మొత్తం ఆలోచించాల్సిన విషయం. ఇది కేవలం ముస్లిం బాలికల బురఖా సమస్య కాదు. దేశంలోని విద్యాసంస్థలలో స్వేచ్ఛ, స్వతంత్రం, పిల్లల విచక్షణ జ్ఞానం, ఆలోచన శక్తిని దెబ్బతీసే దుశ్చర్య.
సమున్నత భారత రాజ్యాంగం మూడో భాగం, 29వ ఆర్టికల్
“భారతదేశంలో నివసిస్తున్న పౌరులలో ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందుతున్న విద్యా సంస్థలలో ప్రవేశాన్ని మత, జాతి, కుల, భాషా ప్రాతిపదికకలపై ఏ పౌరునికి నిరాకరించరాదు.’ అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది.
ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కోర్టు కూడా అనేకమార్లు స్పష్టం చేస్తూ మైనారిటీలు మాత్రమే కాదు మెజారిటీ ప్రజలు కూడా ఈ హక్కును పొందవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.వాస్తవానికి రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను కూడా బీజేపీ పట్టించుకోకుండా మతోన్మాద చర్యలతో ప్రజలను విభజించి ఓట్లు పొంది రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తుంది.
చివరికి భారతదేశం నా మాతృభూమి, భారతీయులు అందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసి దేశభక్తితో కలిసిమెలిసి ఉంటున్న పసి మనసుల్లో కూడా విష బీజాలు నాటేందుకు కుట్ర చేస్తోంది. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రతి తల్లి, తండ్రి ఆలోచన చేయాలి. బడికి వెళ్లిన తమ పిల్లలు ఇటువంటి మతోన్మాదుల ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రేపు మన ఇంటికి వచ్చి కూడా అల్లరి మూకలు గొడవ చేసే పరిస్థితి వస్తుంది.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఒటమి నుంచి తప్పించుకోవటానికి కర్ణాటకలో బురఖా విషయం తెరపైకి తెచ్చారనే అనుమానం కలుగుతుంది. వాస్తవానికి హిందువులకు పరమపవిత్రమైన గంగానదిలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడంతో అక్కడి యోగి ప్రభుత్వం తీవ్ర నిరసనలు ఎదుర్కొంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు హిందువుల మనోభాలు ముఖ్యం కాదు అధికారం, తమ భావజాల వ్యాప్తి మాత్రమే ముఖ్యమని ప్రజలు గ్రహించి బీజేపీకి దూరమయ్యారు. అందవల్లే మళ్లీ యువతను ఆకర్షించి ఓట్లు దండుకునేందుకు కర్ణాటకలో బురఖా గొడవను సృష్టించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్రలను అందరూ గ్రహించాలి.
వాస్తవానికి ముస్లిం బాలికలు బురఖాలు ధరించడం, ప్రత్యేకమైన సమయంలో హిందూ బాలలు అయ్యప్ప, భవానీ మాలలు ధరించి విద్యాసంస్థలకు వెళ్లడం కలిసిమెలిసి ఉండటం, ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకోవడం అనేక సంవత్సారాలుగా కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ కొనసాగాలి. అదే భారతీయత గొప్పదనం. ప్రపంచంలో మన దేశానికి ఉన్న ప్రత్యేకత. గౌరవం కూడా ఇదే.
ఇప్పటికైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను అడ్డుకోవాలి. లేకపోతే దేశానికే ప్రమాదం. పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం.ఇటువంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి . ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాలి అని కోరుతున్నాను.