ములుగు: తెలంగాణలో అత్యంత ఘనంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా పోలీసు శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. జాతరకు వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా,శాంతి భద్రతల భంగం కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లా పోలీసులతో పలు మార్లు సమావేశమైన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్,నేరాల నివారణ, వివిఐపిలకు భద్రత తదితర అంశాలపై చర్చించారు. జాతర సందర్భంగా భద్రతా విధుల కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 9వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. జాతరకు 1.25కోట్ల మంది హాజరయ్యే అవకాశం వుందని పోలీసులు భావిస్తున్నారు. జాతర కోసం 3.5లక్షల ప్రైవేట్ వాహనాలు, 4వేల ఆర్టీసీబస్సులు జాతరకు తరలివచ్చే అవకాశం వుందని అంటున్నారు. వాహనాల నిర్వహణ,ట్రాఫిక్ నిర్వహణ పోలీసులకు సవాల్ గా మారనుంది.
శాంతి భద్రతల నిర్వహణకు 382 సీసీటీవీలు, రెండుడ్రోన్ కెమెరాలు, 20 డిస్ ప్లే బోర్డులను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జాతరను మానిటర్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. జాతరకు తరలి వచ్చే వాహనాల కోసం 33 చోట్ల పార్కింగ్ స్థలాలు, 37 వెహికల్ హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 4 కి.మీ. ఒక పోలీస్ ఔట్ పోస్టు, ప్రతి 2కి.మీ. ఒక పెట్రోలింగ్ టీమ్ ఏర్పాటుచేస్తున్నారు. అలాగే ఆరు టోవింగ్ వెహికల్స్, 11 క్రేన్స్, 20 జేసీబీలు సమకూరుస్తున్నట్టు తెలిపారు. జాతరకు వచ్చే వారికి ఫేస్ మాస్క్ లు, శానిటైజర్లను కూడా పంపిణీ చేయనున్నారు. ప్రజల సౌకర్యార్ధం 50పబ్లిక్ ఇన్ఫర్ మేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.