–అయిదేళ్లుగా భారీనష్టాలలో కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు
– విద్యుత్ జేఏసీ విజ్ఞప్తిమేరకు సిఎంతో చర్చిస్తాం
–రాష్ట్రం మీద ప్రేమే ఉంటే మోడీతో మాట్లాడి సోము వీర్రాజు నిధులు ఇప్పించాలి
–మీడియాతో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతికశాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల విద్యుత్ డిస్కమ్‌లు రు30వేలకోట్ల భారాన్ని భరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం తన నివాసం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ జేఏసీతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ్రారెడ్డి, తాను మాట్లాడడం జరిగిందని, జేఏసీ కోరిన కోరికలన్నీ దాదాపుగా నెరవేరుస్తున్నామన్నారు. అయితే వారు కృష్ణ పట్నం విద్యుత్ ప్రాజెక్టును ప్రైవేటుకు లీజుకు ఇవ్వవద్దని కోరారని, అయితే గత అయిదేళ్ళుగా ఈ ప్రాజెక్టు భారీ నష్టాలను చవిచూస్తుందని, దీనిని భరాయించడం ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉందన్నారు. దీనిపై ఇప్పటికే మంత్రి మండలి ఆమోదం కూడా జరిగిందని, ప్రైవేటుకు లీజుకు ఇచ్చే అంశంపై జేఏసీ అడిగిన విజ్ఞప్తికి తాము ఎటువంటి స్పష్టమైన హామీని ఇవ్వలేదని, అయినా వారి విజ్ఞప్తిమేరకు ముఖ్యమంత్రి దృష్టికి అంశాన్ని తీసుకువెళతామన్నారు.
ఇక పీఆర్‌సీకి సంబంధించి కమిషన్ కాదు..కమిటీ వేయాలంటూ విజ్ఞప్తి వచ్చిందని, దీనిని కూడా సీఎం దృష్టికి తీసుకువెళుతున్నామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఎప్పుడైనా ఒకటి అరా సమస్యలు రావడం సహజమని, దానిని వక్రీకరించాలని చూస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో యూనిట్ విద్యుత్ రు2.50లకు అందుబాటులో ఉంటే ఏకంగా రు4.87లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని , దీనివల్ల విద్యుత్ డిస్కంలు ఏకంగా రు30వేల కోట్ల భారాన్ని భరాయిస్తున్నాయన్నారు. అయినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతున్న మాటలు విచిత్రంగా ఉంటున్నాయన్నారు. కేంద్రం నిధులు ఇస్తామంటే ఒద్దని, అప్పులు ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు. నిధులు ఇవ్వకుండా తిప్పుకుంటూ నిధులు ఇస్తున్నా తీసుకోకుండా అప్పులు చేస్తున్నారని మాట్లాడడం సరికాదని, కేవలం ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడడం సరికాదన్నారు. ఎవరైనా డబ్బులు ఇస్తామంటే వద్దని, అప్పులు చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజంగా సోము వీర్రాజుకు రాష్ట్రంపై ప్రేమే ఉంటే మోడీతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు ఇవ్వమని కోరాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు.