జన్మనిచ్చిన అమ్మ
పెంచి పెద్ద చేసిన నాన్న
చదువు నేర్పిన గురువు
ఆప్యాయత చూపే అన్న
తోడబుట్టిన చెల్లి
రక్తం పంచుకుపుట్టిన తమ్ముడు
వీరి పుట్టిన రోజులు చేస్తున్నావా..
అసలు అవెప్పుడో
గుర్తుంటాయా..
అభిమాన హీరో..
రాజకీయ నాయకుడు..
అతడేంటి..అతగాడి
అల్లుడైనా..కొడుకైనా..
వీరి పుట్టిన రోజుల నాడు మాత్రం రక్తదానం..
పైగా మెగా కాంప్..
ఆస్పత్రిలో పళ్ళు పంపిణీ..
ఊరంతా బానర్లు..
వాళ్ళ చుట్టూ చక్కర్లు..
గంతులెయ్యడానికి నిక్కర్లు..
బాండ్ బాజాలు..
కనిపిస్తే జేజేలు..
ఒక్క ఉపకారం చెయ్యకపోయినా..
అసలు పలకరించకపోయినా
నీ దృష్టిలో వాళ్లు రాజాలు..
నీ హీరో ఒక్కనాడైనా
ఇంటికి పిలిచాడా..
టీ నీళ్ళయినా పోసాడా..
నిన్ను రక్తం ఇవ్వమని చెప్పే
అతగాడు ఇస్తున్నాడా..
పోనీ రోజూ కనిపించే
నీ నాయకుడైనా
కేకు కోసి
నీ నోట్లో పెడుతున్నాడా
పార్టీకి పిలిచి పీటేస్తున్నాడా..
ఒకవేళ ఆయన ఇంట్లో జరిగే పెళ్ళికో..పేరంటానికో
వందలాదిమందితో పాటు నీకూ ఓ కార్డు ముక్క పడేసినా
అక్కడ..వీఐపీలకు
ఓ టెంటు..సెపరేటు ట్రీట్మెంటు
అదో పెద్ద స్టంటు..
మరి నువ్వో
నలుగురితో పాటు నారాయణా
మారు మాటాడితే
గుంపులో గోవిందా..
ఒకవేళ నువ్వు విఐపి
టెంటులోకెళ్తే డాబుగా
నీలం చొక్కా గార్డు
తరిమేస్తాడు రుబాబుగా..
ఎందుకొచ్చిన తంటా
ఇంట్లో పెద్దోళ్లకు
ఒళ్ళు మంటా..!
నాయకుల దృష్టిలో నువ్వు
ఓ వెర్రి పువ్వు..
నీపై ఓ పనికిరాని నవ్వు..
నీ చెవిలో పువ్వు..
పళ్ళు పంచు..
నీ తాతకి నివాళిగా..
నాన్నకి గుర్తుగా..
మళ్లీ ఇస్తూ ఇస్తూ ఓ ఫోటో..
పేపర్లో వార్త..
ఇవన్నీ వద్దు..
తృప్తే ముద్దు..
చెయ్యగలిగినంతా చెయ్యి..
హంగు..ఆర్భాటం వద్దు..
రక్తం ఇవ్వు…
నాన్న పుట్టిన రోజు నాడు
అమ్మ మెచ్చిన తీరున..
ఆగస్టు 15..అక్టోబర్ 2..
ఇలా ఓ గొప్ప సందర్భంలో..
ఆపై జనాలకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు..
అన్నదానం..విద్యాదానం
శ్రమదానం..అన్నిటినీ
మించి రక్తదానం..
ఆపై నేత్రదానం..గొప్పవే..
కాని హీరోలు..
నేతల పేర
అప్పు తెచ్చి మరీ చేస్తున్నావే
అది అపాత్రదానం
అందుకేరా అబ్బాయ్
కాస్త నిదానం..
ఇలా అనవసర సందర్భాలు
లేనిపోని దర్పాలు
జర భద్రం..
వారంతా కాటేసే సర్పాలు..
వారి దృష్టిలో నీలాంటి వాళ్ళు
అల్లా టప్పాలు..
నీతో చెప్పేసి నాలుగు పుచ్చుటప్పాలు..
నిన్ను వాడుకుని వదిలేసే
నయా జమానా వల్లప్పాలు..
ఇలాంటి వారిని నమ్మితే
దానాల సంగతేమో గాని
నీ బ్రతుకే బలిదానం..
గొప్పలు పోకుండా..
తనకు మాలిన ధర్మం చేయక..
నీకు ఉన్నంతలో..
చేతనైనంతలో..
అవసరమైన వారికి
అవసరమున్నంతలో
చెయ్యి దానం..
నిజమైన ఆర్తుని లోగిలి..
అది దేవుని సన్నిధానం
అలాంటి వారికి చేసే దానం
మానవతతో అనుసంధానం..
నీకు నువ్వు సమాధానం
చెప్పుకోగలిగే
అతి పెద్ద అవధానం!!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286