మంత్రి మేకపాటికి కడసారి వీడ్కోలు..

ప్రారంభమైన అంతిమయాత్ర.. 

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు మేకపాటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు మేకపాటి భౌతికకాయాన్ని నెల్లూరు నుంచి ఉదయగిరి కాలేజ్ గ్రౌండ్‌కి తరలిస్తున్నారు. అనంతరం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి కళాశాలలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా.. మేకపాటి అంత్యక్రియలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. గౌతమ్ రెడ్డి భౌతికకాయం కళాశాల గ్రౌండ్‌కు చేరుకున్న అనంతరం.. ప్రజలు స్థానికుల సందర్శనార్థం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత 11 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.

కాగా.. మేకపాటి అంత్యక్రియలకు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం జగన్ కడపకు చేరుకోనున్నారు. కడప నుంచి హెలికాప్టర్‌లో ఉదయగిరి మేకపాటి కాలేజ్‌కు చేరుకొని.. అంత్యక్రియల్లో పాల్గొంటారు. సీఎం రాక సందర్భంగా అధికార యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 6 మంది డీఎస్పీలు, 13 మంది సీఐలు, 32 మంది ఎస్సైలు, 500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 6 స్పెషల్ పార్టీ బలగాలు, 50 మంది ఏర్ పోలీస్ సిబ్బంది కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇంటికి చేరుకున్న కుమారుడు..
ఇదిలాఉంటే.. నెల్లూరులోని మేకపాటి నివాసానికి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి బుధవారం ఉదయం చేరుకున్నారు. అమెరికా నుంచి చెన్నైకి చేరుకుని.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో నెల్లూరుకి చేరుకున్నారు. తండ్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహం చూసి కృష్ణార్జున్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.

Leave a Reply