Suryaa.co.in

Entertainment National

RJ(రేడియో జాకీ) రచన హఠాన్మరణం

గుండెపోటు (Cardiac Arrest)తో సెలబ్రిటీల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న కన్నడ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్, నిన్న ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విషాదాలు మరువకముందే, తాజాగా మరో సెలబ్రిటీ గుండెపోటుతో కన్నుమూశారు. కర్ణాటకకు చెందిన ఆర్జే రచన (39) ఆకస్మిక మరణం అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం జేపీ నగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె గుండెపోటుకు గురయ్యారు.ఛాతీ నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రచన చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచన హఠాన్మరణంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

రేడియో జాకీగా దశాబ్ద కాలం పాటు అనుభవం ఉన్న రచన 2000ల మధ్యలో రేడియో మిర్చి 98.3 ఎఫ్‌ఎమ్‌లో తన హాస్యం, అద్భుతమైన నైపుణ్యంతో ‘పోరి టపోరి రచన’గా ప్రాచుర్యం పొందింది.తన వాక్చాతుర్యం, సెన్సాఫ్ హ్యూమర్‌తో లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇంతకుముందు వరల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియోలో పని చేసిన రచన, ఆ వృత్తిని విడిచి పెట్టే ముందు రేడియో సిటీలో కూడా పని చేసింది. శిక్షణ పొందిన సంగీత విద్వాంసురాలు, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు రచన. ఆమె ఊహించని మరణం రేడియో, టెలివిజన్ పరిశ్రమలను దిగ్భ్రాంతికి గురి చేసింది. రక్షిత్ శెట్టి, శ్వేత శ్రీవాస్తవ్ నటించిన బ్లాక్ బస్టర్ కన్నడ రొమాంటిక్ డ్రామా ‘సింపుల్ ఆగ్ ఒండు లవ్ స్టోరీ’ (2013)లో ఆమె ఓ పాత్రలో నటించింది.కాగా కొంత కాలంగా రచన మానసిక ఒత్తిడికి లోనైనట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారు. స్నేహితులకు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. రచన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE