విన్నావటమ్మా.. ఓ యశోద!

ఆమె..అమ్మతనానికి అసలైన రూపం..
సాక్షాత్తు దేవదేవున్నే
కట్టిపడేసి ఎంతగా
ఏడ్చిందో పాపం..
జగములనేలే నల్లనయ్య
చిక్కకుండా తప్పించుకు తిరుగుతుంటే తాళ్ళతో బంధించిన ప్రేమమూర్తి..
అఖిల చరాచర సృష్టిలో
పెంచిన ప్రేమకు నిర్వచనంగా
నిలిచిన సిసలైన మాతృమూర్తి..
అంతటి శ్రీకృష్ణుడికే
అఖండ యశస్సును
ప్రసాదించిన యశోద..
బాల కిట్టయ్య అనే జ్యోతి
ఆరిపోకుండా తనలో
దాచుకుని జగతికి
జ్ఞానజ్యోతిని ప్రసాదించిన
చిరస్మరణీయ ప్రమిద..
ఈ యశోద..!

ఆహా..ఏమి తల్లీ
నీ భాగ్యము..
అఖిల దేవతలకు..
మహాయోగులకు..
దివ్యరుషులకు..
అష్టభార్యలకు..
చివరకు కన్నతల్లి దేవకికే
పట్టుబడని అవతారమూర్తి
పెంచిన నీ ప్రేమకు కట్టుబడి
నీ చేతి దెబ్బలు
తిన్నాడంటే..యశోదమ్మా..
ఎంత పుణ్యం చేసావమ్మా…!

నీ ఒడిలో పెరిగేందుకే
యమునను నడిరేయి
దాటినాడంట..
ఎన్ని గండాలు
సుడిగుండాలు…
నీ పుణ్యఫలమునే
గట్టెక్కినాడంట…
నీ సన్నిధినే అంతటి చక్రవర్తి
గోపయ్యగా మారి..
నిన్నే ఏమార్చి..
పూతనను..వృకాసరుని పరిమార్చి
అక్కడే అవతారపురుషునిగా
మారలేదా లీలామానుష వేషధారి..
నిన్నే అబ్బురపరుస్తూ
ఆ గిరిధారి..
నీ చేతి ముద్ద తిని
తన నోటిలోనే నీకు
చూపలేదా అవని…!

ఇంతకీ..
ఒకరింట్లో వినిపిస్తే
గజ్జెల గలగల..
ఒకరింట్లో వినిపిస్తే
వేణుగానము..
ఎలా వచ్చెనో..
ఎలా వెళ్లెనో..
చిలిపి కృష్ణుని అడిగావా..
అల్లరి చేసి జవాబు చెప్పని కూన కన్నను రుబాబు
చేసి బంధించావే గాని
నువ్వు కట్టిన రోటితోనే
చెట్లనెలా విరిచేసాడని
నిలదీసినావా..!?

సరే..ఎనిమిది పెళ్ళిళ్ళు
చేసుకుంటే నీ కిట్టయ్య
ఒక్కటీ నువ్వు చూడలేదని
వాపోతే..మరోసారి కడుపున పుట్టని సుతుడు శీనయ్యగా
నీ ఒడి చేరితే వకుళమ్మా..
అప్పు చేసి మరీ చేసావే
శ్రీనివాస కల్యాణం…
కలియుగాన లోకకళ్యాణం
ఆ రుణమే మా రుణమై
తిరుపతి ప్రయాణమై..
వెంకన్న దర్శనమై..
ఈ యుగంలో ఆధ్యాత్మికతకు నిదర్శనమై!

నేడు యశోద జయంతి..

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply