– వైకాపా కార్పొరేటర్ భర్త ఆవేదన
విజయవాడ : పెదబాబు అనే వైకాపా కార్పొరేటర్ భర్త వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో వైరస్గా మారింది. సొంత పార్టీ నాయకులే తనను వేధిస్తున్నారని.. వారి వేధింపులు తట్టుకోలేక పోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోవాలనుకుంటున్నట్లు వీడియోలో తన బాధను వెలిబుచ్చారు.
వైకాపా నాయకులు తనను వేధించి, తన కేబుల్ వ్యాపారాన్ని నాశనం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన నగర కార్పొరేటర్ భర్త పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. వారి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, చనిపోవాలనుకుంటున్నానని చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వైకాపా నాయకుడు అత్తులూరి పెదబాబు ఆవేదన ఆయన మాటల్లోనే… ‘నా పేరు అత్తులూరి పెదబాబు. నేను 48వ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి భర్తని. కేబుల్ ఫీల్డ్‌లో ఉన్న నన్ను కొంతమంది వైకాపా నాయకులు, పెద్దలు వేధిస్తున్నారు. ఎంఎస్‌వోలతో చేతులు కలిపి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం
చేస్తున్నారు. బెదిరించి, సిగ్నల్స్ కట్ చేసి హింసిస్తున్నారు. నేను వైకాపాకు ఎంతో సేవ చేశాను. కార్పొరేటర్‌గా నా భార్యను నిలిపి, గెలిపించినందుకు కొంతమంది పార్టీ నాయకులు ఈ శిక్ష వేస్తున్నారు.
తెదేపా నుంచి వచ్చిన వాళ్ల మాటలు విని సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు మోసం చేసి, ఇబ్బంది పెడుతున్నారు. ఈపరిస్థితి ఇలాగే ఉంటే 2 రోజుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా చావుకు వాళ్లే బాధ్యులు. నాతో పాటు మరికొందరు ఆపరేటర్లు కూడా నరకయాతన పడుతున్నారు. పార్టీలో మరో కార్యకర్తకు అన్యాయం జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాను’ అంటూ గద్గద స్వరంతో తన ఆవేదన వెలిబుచ్చారు.