Suryaa.co.in

Telangana

గవర్నర్ ప్రసంగం లేకపోవడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమే

– కేసీఆర్ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
– సభను ప్రోరోగ్ చేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే
– అసెంబ్లీలో సర్కార్ ను నిలదీస్తాం అని సీఎల్పీ నేతభట్టి విక్రమార్క

గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదంటే ప్రతిపక్షాలు గొంతు విప్పకుండా చేయడమేనని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. “గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు” తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాంపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎల్పీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సమావేశానికి వస్తున్న క్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యంగాన్ని అవమాన పరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తీరును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగడతమన్నారు. గతేడాది అక్టోబరులో సమావేశాలు ముగిసినా ఇప్పటివరకు ప్రోరోగ్ చేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమేనని అన్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వ పాలనా అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉండేవని, సభ్యులుగా తాము చర్చించడానికి వీలు చిక్కేదని, ఇప్పుడు ఆ అవకాశం లేదన్నారు.

ఐదు నెలలుగా సభను ప్రోరోగ్ చేయకపోవడం సభా సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో భారత దేశంలో వ్యవస్థలు కొనసాగుతున్నాయని, ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. దేశంలో, రాష్ర్టంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి ఆ పార్టీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రభుత్వాలను , అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలన్నారు.

ప్రపంచదేశాలలో భారత దేశ రాజ్యాంగానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఇటువంటి రాజ్యాంగంలో రాసిన చట్టాలను రాష్ట్ర పాలకులు తుంగతో తొక్కడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించాలనే భావన కలుగుతున్నదన్నారు.

LEAVE A RESPONSE