– అయినా అప్రమత్తత అనివార్యం!?
ఇంతకీ కోవిడ్ కథ ముగింపు దశకు చేరుకుంటున్నట్టేనా..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పలకరించి రెండేళ్లకు పైగా గడచినా పాండమిగ్గా ప్రకటించి ఈ మార్చితో రెండు సంవత్సరాలు పూర్తవుతున్న వేళ మానవాళిని వెంటాడుతున్న ప్రశ్న ఇది..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఉధృతి మందగించి కేసులు,మరణాల సంఖ్య
తగ్గి ప్రజా జీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్టు అనిపిస్తున్న తరుణంలో..
ఇంకా ఎక్కడో ఓ మూల వెంటాడుతున్న భయాలు..వేధిస్తున్న ఆందోళనలు ఎన్నెన్నో..
మహమ్మారి బెడద వదిలిపోయినట్టేనా అన్న ఊరట వెనకే ఏమో..
ఏ క్షణంలోనైనా మళ్లీ విజృంభిస్తుందేమో..అన్న ఆందోళన..అయితే ఒకటే పెద్ద ఉపశమన కబురు..
ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మధ్య నాటికి పాండమిక్ ముగింపు దశకు వచ్చేస్తుందని..!?
గడచిన రెండేళ్లతో పోలిస్తే మానవాళి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నట్టే లెక్క..2020 మార్చి తొలినాళ్ళ నాటికి కరోనా బెడద నెమ్మదిగా విస్తరించడం మొదలై 22 న జనతా కర్ఫ్యూతో శ్రీకారం చుట్టి ఎడతెగని లాక్డౌన్ కష్టాలు అనుభవిస్తూ మరోపక్క వాక్సిన్ కోసం ఎదురుచూస్తూ గడిపిన భయానక రోజుల నుంచి
ఇప్పుడు చాలా దూరం వచ్చేసినట్టే..అయితే ప్రమాదం ఇంకా పొంచి ఉందనే ఆందోళన మాత్రం ఇంకా విడిచిపోలేదు.
ఇప్పటికైతే బ్రిటన్..డెన్మార్క్ వంటి దేశాలు నిబంధనలను ఇంచుమించు ఎత్తేసాయి..అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాలు ఏకంగా మాస్కే వద్దనే దశకు వచ్చేశాయి.బ్రిటన్ మాత్రం ముగింపు అని గాక కరోనాతో సహజీవనానికి అలవాటు పడుతున్నామనే స్ధాయిలో సాధారణ జీవితానికి శ్రీకారం చుట్టింది.ఇదిలా ఉండగా కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఎండమిక్ అనే పదాన్ని తప్పుడు సందర్భంలో వాడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
మహమ్మారి మందగించి సాధారణ ఫ్లూ లేదా జలుబు దశకు చేరినా గాని ప్రమాదకారిగానే ఉండే అవకాశాలు లేకపోలేదని వారు అంటున్నారు.కేవలం మలేరియా కారణంగా 2020లో ఆరు లక్షల మంది..క్షయతో 15 లక్షల మంది మృత్యువాత పడిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.కరోనా మళ్లీ వ్యాపించినా ప్రమాదం తక్కువ ఉండవచ్చు..లేదా ఇంకా ప్రమాదకరంగా ఉండే అవకాశాలూ ఉండవచ్చని వారంటున్నారు.ఒమిక్రాన్ బలహీనంగా ఉంది కదాని తక్కువగా చూస్తే దాని విస్తరణ వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయని వారు పేర్కొంటున్నారు.ఒమిక్రానే బలహీనం గనక రాబోయే రకాలు మరింత బలహీనంగా ఉంటాయని అనుకోడానికి కూడా లేదని..చైనాలో పుట్టి ప్రపంచం మొత్తానికి విస్తరించిన సార్స్ కోవిడ్ 2 కంటే డెల్టా ఎంత విద్వంసకారిగా పరిణమించిందో ప్రపంచం స్పష్టంగా చూసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు.అంతేగాక కొత్త వేరియంట్లు వచ్చే పాటికి వాటిపై వాక్సిన్ పనిచేయకపోవడం లేదా అప్పటికి ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉండడం..ఏదో ఒకటి జరిగినా ముప్పే.ఈలోగా బూస్టర్ డోసులు పెంచుకుంటూ పోవడం కూడా అంత సురక్షితం కాదు.అంతకంటే ఏ రకం కరోనాపైనైనా ప్రభావం చూపగలిగే వాక్సిన్ కనిపెట్టడం సరైన చర్య అవుతుంది.ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నా సరైన ఫలితం ఇంతవరకు లేదు.
ఇప్పటికైతే పరిస్థితులు అదుపులో ఉన్నాయి గనక శాశ్వత పరిష్కారం కోసం పరిశోధనలు కొనసాగిస్తూ..
జాగ్రత్తలు కూడా పూర్తిగా వదిలేయకుండా మంచి పరిణామాల కోసం ఎదురు చూడ్డమే మానవాళి ముందున్న కర్తవ్యం.అన్నీ బాగుండి..ప్రపంచం మొత్తం వాక్సినేషన్ పూర్తయితే ఈ ఏడాది జూన్..జూలై నాటికి మనం బయటపడిపోయినట్టే..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286