Suryaa.co.in

Devotional

పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులే కాదు,ఆది ప్రేమికులు కూడా!

పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులే కాదు, ఆది ప్రేమికులు కూడా. ఇద్దరి సంపదలు సమానం కావు. ఇద్దరి రూపురేఖలు ఒకటి కావు. ఆగర్భ శ్రీమంతురాలు పార్వతి. శ్మశానంలో తిరుగుతూ కపాలంలో భిక్షాటన చేసే కడు నిరుపేద శివుడు. ఆ మాత్రానికే శివుడి కోసం పార్వతి తపస్సు చేసింది. తన జుట్టంతా ఎర్రగా చిక్కులు పడిపోయినా, తన చెక్కిళ్లు వాడిపోయినా తపస్సు వీడక, మునుల ప్రశంసలు పొందింది.
పైపెచ్చు తల్లిదండ్రుల అనుమతితోనే శివుడికోసం ఆ తపస్సును ఆచరించింది! ఎందుకు అంత కష్టపడింది పార్వతి? హిమవంతుడు చిటికె వేస్తే సంపన్నులు, సుందరాకారులు వరుసలో నిలబడతారు.
అయితే సంపదలకు, బాహ్య సౌందర్యానికి ఆశపడలేదు పార్వతి. తనతో సమానమైన పరిజ్ఞానం కలిగినవాడే తనకు భర్త కావాలనుకుంది. ఆకులను కూడా రుచి చూడకుండా తపస్సు చేస్తూ ‘అపర్ణ’ అయ్యింది. అందుకే శివపార్వతుల కల్యాణం లోకకల్యాణమైంది. శివపార్వతులు ఆదర్శ దంపతులయ్యారు. ఆ ఆదిభిక్షువు, ఈ అన్నపూర్ణ తమ పెళ్లినాటి సందర్భాలను సంభాషించుకుంటే ఎలా ఉంటుందనే ఊహకొక సృజన కథనమిది.

పార్వతి: స్వామీ! మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా!
శివుడు: అంత కష్టపడటం ఎందుకు? మీ తల్లిదండ్రులు నా కంటే యోగ్యులను తీసుకువచ్చి నీ వివాహం ఘనంగా జరిపించేవారు కదా!
Shiva-Parvatiపార్వతి: స్వామీ! మీరే కావాలని నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలియదా!
శివుడు: తెలియకేం.. నీ మనసు తెలుసుకోవాలనే కదా, నేను బ్రహ్మచారి వేషంలో నీ దగ్గరకు వచ్చాను.
పార్వతి: స్వామీ! నన్ను పరీక్షించడం కోసం మిమ్మల్ని మీరు ఎన్నిరకాలుగా నిందించుకున్నారో కదా! మీకు శివుడు తెలుసన్నారు. నేను ఎంత తపస్సు చేసినా ఆయన నాకు ప్రత్యక్షమవ్వకుండా, నన్ను అవమానం చేశాడన్నారు. శ్మశానంలో నివసించేవానితో వివాహం ఏమిటని కూడా వారించారు.
శివుడు: అవును పార్వతీ! నాకు అన్నీ గుర్తున్నాయి. వివాహం చేసుకునే ముందు ఇద్దరి మనసులు కలవాలి, ఇద్దరి భావాలు కలవాలి. నీ ఉద్దేశం ఎలా ఉందో తెలుసుకోవాలి కదా.
పార్వతి: చేతి కంకణం గురించి మీరు అన్న మాటలు నేటికీ నేను మరచిపోలేకపోతున్నాను. మంగళకరమైన వివాహ కంకణం ఉన్న నా చేతిని.. పాము కడియంగా ఉన్న చేతితో పట్టుకోవాలని, అది ఓర్చుకోవడం కష్టమని, ఆలోచించుకోమని నన్ను మీరు భయపెట్టారు.
శివుడు: మరో మాట కూడా అన్నాను గుర్తుందా. శివుడిని వివాహమాడితే రక్తం కారే తోలుకి, హంసలు చిహ్నంగా ఉన్న పట్టు చీరకు కొంగుముడి వేయాలని. అలాగే ‘మంచి భవనంలో పువ్వుల మీద లత్తుక చిహ్నాలుగా ఉంచడానికి అర్హములైన నీ పాదాలు, వెంట్రుకలు వ్యాపించి ఉన్న కాటిలో ఉంచడానికి పగవాడు సైతం అంగీకరించడు కదా’ అని నీకు జుగుప్స కలిగేలా మాట్లాడాను.
పార్వతి: గుర్తుంది. నేనేమన్నానో కూడా గుర్తుంది కదా. కీడును పోగొట్టి, సంపదలు కలగడానికి మంగళకరమైన చందనాలు ధరిస్తారు. అవి మళ్లీ కోరికలను పుట్టిస్తాయి. కోరికలే లేనివాడైన శివుడికి వీటితో పని ఏంటి? అన్నాను. అంతేనా ఆయన ధరించిన కాటి బూడిద పవిత్రమైనది కాబట్టే, ఆ బూడిదను దేవతలు శిరస్సు మీద ధరిస్తున్నారని కూడా చెప్పాను కదా.
శివుడు: నా వాహనం గురించి నేను చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయి కదా పార్వతీ! ఏనుగుపై ఊరేగవలసిన నువ్వు ముసలి ఎద్దు వాహనం మీద ఊరేగుతూంటే, మహాజనులంతా నవ్వుతారని చెప్పాను కదా.
పార్వతి: అందుకు నేను చెప్పిన సమాధానం మరోసారి గుర్తు చేస్తాను స్వామీ. ఐరావతం ఎక్కి తిరిగే ఇంద్రుడు.. పేదవాడై ఎద్దుని ఎక్కి తిరిగే శివుyì కి నమస్కరిస్తున్నాడు అన్నాను. అయినా మీరు అక్కడితో ఆగారా! ఇంకా ఎన్నెన్ని వ్యంగ్యాలు మాట్లాడారు. కండ్లు చక్కనివాడు కాదని, దిసమొల వాడని, శాస్త్రం తెలిసినవాడు కాదని, ఒకటి కాకపోతే ఒక్కటైనా నాకు సరితూగే లక్షణాలు శివుడిలో లేవని చెప్పారు. శివుడిని వివాహం చేసుకునే ప్రయత్నం మానుకోమని కూడా సెలవిచ్చారు.
శివుడు: అయ్యో! నేనెలా మరచిపోతాను పార్వతీ! బ్రహ్మచారి వేషంలో నేను అలా శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, నీ కనుబొమలు వంకరయ్యాయి, కండ్ల కొనలు ఎర్రబారాయి, కళ్లు అడ్డంగా తిప్పావు. (ఇష్టం లేని మాట వింటే ఉండే లక్షణాలు). నీ çసమాధానాలకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది పార్వతీ! నీ పరిజ్ఞానంతో ఎంత చక్కటి సమాధానాలు పలికావు. అంతేనా, నా పుట్టుక గురించి వారు నిందిస్తే, దానికి కూడా ఎంత బాగా సమాధానం చెప్పావు నువ్వు.
పార్వతి: నాకు పొగడ్తలు అక్కరలేదు కానీ, వారు నిందించినా సత్యమే పలికారు. స్వయంభువు అయిన మీ జన్మ మీకు ఎలా తెలుస్తుంది? స్వేచ్ఛగా తిరిగేవారైన మీరు లోకులు ఏమనుకుంటారో అని భయపడరు. ఒకరికి భయపడవలసిన అవసరం మీకు లేదు.
శివుడు: నువ్వంటే ఒక్క విషయంలో నాకు చాలా గర్వం పార్వతి. నువ్వు ఎన్నో క్లేశాలు అనుభవించి తపస్సు చేశావు. నిన్ను మునులు కీర్తిస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా.
పార్వతి: అయ్యో! స్వామీ! మునుల ఆశీర్వాద బలంతోనే కదా నేను తపస్సు ఆచరించగలిగాను.
శివుడు: పార్వతీ! చివరగా ఒక్కమాట అంటున్నాను, ‘ఈ రోజు మొదలు నీ తపస్సులచే దాసుడనైతిని’ అంటూ పార్వతిని తన శరీరంలో సగ భాగం చేసి అర్ధనారీశ్వరుడయ్యాడు.
అలా వారు ఆదిదంపతులయ్యారు. అలా వారి ప్రేమ ఆదర్శదాయకం అయింది. అలాగే ప్రేమికులకు వారి ప్రేమ మార్గదర్శకం కావాలి.

-సత్య శ్రీనివాస్.ఎం

LEAVE A RESPONSE