Suryaa.co.in

Andhra Pradesh

వైశ్యులంటే సిఎం జగన్ కు చులకన

– రోశయ్యకు సిఎం జగన్ తగు గౌరవం ఇవ్వలేదు
– ప్రభుత్వ వేధింపులపై పోరాడుతాం
– అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతికి టిడిపి అధినేత చంద్రబాబు నివాళి
– తమపై రాష్ట్రంలో జరుగుతున్న వేధింపులను సభలో వివరించిన ఆర్యవైశ్య వర్గ నేతలు, వ్యాపారులు

.అమరావతి: పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టిశ్రీరాములు అని చంద్రబాబు కీర్తించారు. అమరజీవి జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నివాళులు అర్పించారు. తెలుగు దేశంలో ఉన్న తమను ప్రభుత్వం ఎలా వేధింపులకు గురిచేస్తుందో కార్యక్రమంలో నేతలు వివరించారు.

అధికారులను, పోలీసులను పంపి తమను వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాపారస్తులు వాపోయారు. తమకు కూడా అట్రాసిటీ లాంటి ప్రత్యేక చట్టం తెచ్చి రక్షణ కల్పించాలని వారు విన్నవించారు. ప్రభుత్వ చర్యను విమర్శిస్తే కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.రాష్ట్రంలో పాలన పూర్తిగా రౌడీ రాజ్యం అయిపోయిందని చంద్రబాబు అన్నారు. నాకు రౌడీఇజం తెలీదు…ఎప్పుడూ రౌడీలను ఉపేక్షించలేదు అని ఆయన అన్నారు.

వ్యాపారులను ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తుంది…వసూళ్లకు పాల్పడుతుంది…దీనిపై పోరాటంలో టిడిపి బాధితులను అండగా ఉంటుందని చెప్పారు. నలుగురికి ఉపాధి కల్పించే, సేవ చేసే వైశ్యవర్గంపై వేధింపులు దారుణం అని చంద్రబాబు అన్నారు. వైశ్యులు అంటే సిఎం జగన్ కు చులకనగా ఉందని
vy1 చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జిఎస్టితో పాటు జెఎస్టి (జగన్ ట్యాక్స్) అదనంగా కట్టాల్సి వస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లిన రాజకీయ ఉద్దండడు కొణిజేటి రోశయ్యను కూడా ప్రభుత్వం తగురీతిన గౌరవించలేదని అన్నారు.

రోశయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో రోశయ్య పేరు ఎందుకు పెట్టరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోశయ్యకు నివాళి ఘటించడానికి కూడా సిఎం జగన్ కు మనసు రాలేదని చంద్రబాబు అన్నారు. మాజీ సిఎంలు వెంగళరావు, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి చనిపోతే….ప్రభుత్వ సంస్థలకు వారి పేరు పెట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన తరువాత కొణిజేటి రోశయ్యకు తగిన గౌరవం ఇస్తాం అని సభలో చంద్రబాబు ప్రకటించారు. కల్తీ సారా వల్ల జంగారెడ్డి గూడెంలో ప్రజలు చనిపోతే…సిఎం స్వయంగా సహజ మరణం అంటున్నారని…ఇలాంటి పాలనను…ఇలాంటి సిఎంను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు.

సహజ మరణాలు అయితే పోలీసు కేసులు ఎందుకు పెట్టారని…..డాక్టర్ల రిపోర్ట్ లో మద్యం వల్లనే మరణాలు అని ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మళ్ళీ వైసిపి అధికారంలోకి వస్తే…ఇక ఎవ్వరూ ఇక్కడ బతకలేరు….. బతకనివ్వరని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, పార్టీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డూండీ రాకేష్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE