అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం -1956 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమించే ట్రిబ్యునల్ మాత్రమే నదీ జలాలను పంపిణీ చేస్తుంది. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నదీ జలాలను పంపిణీచేస్తూ ఇచ్చిన తీర్పు 1976లో నుండి అమలులో ఉంది. 2004లో ఏర్పాటైన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తీర్పు తెలుగు రాష్ట్రాలకు శరాఘాతంగా ఉండడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసింది. అది పెండింగ్ లో ఉన్నది.
పర్యవసానంగా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉన్నది. దానికి అనుగుణంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల వద్ద నీటి వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలను 1996లో జీఓ నెం.96లో విస్పష్టంగా పేర్కొనడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వాటిని ఉల్లంఘిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను పరిరక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు రాజీలేని పోరాటం చేయాలి. అందులో న్యాయ పోరాటం ఒకటి.
గోదావరి నదీ జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు 1980 నుండి అమలులో ఉన్నది. రాష్ట్ర విభజన తర్వాత ఎగువ రాష్ట్రంగా మారిన తెలంగాణ కేంద్ర జల సంఘం అనుమతి లేకుండానే పలు ప్రాజెక్టులను నిర్మించుకొని, ఎక్కువ నీటిని వాడుకోవడానికి త్వరితగతిన నిర్మాణ పనులను చేపట్టింది. పర్యవసానంగా పోలవరానికి కూడా నీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నది.
నీటి సమస్యలపై రాజకీయ పార్టీలు ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని పోరాడాలి. అలాగే, రైతు సంఘాలు, ప్రజలు స్పదించకుండా, కేవలం న్యాయ స్థానాల్లో వ్యక్తులుగా కేసులు దాఖలు చేసి చేసే పోరాటం వల్ల జరిగే ప్రయోజనం పరిమితం. బ్రజెష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ ముందు కొన్ని కేసులు విచారణలో ఉన్నాయి. నీటి వ్యాజ్యాల పరిష్కారానికి న్యాయ స్థానాల్లో సంవత్సరాలు గడిచినా న్యాయం జరగడం లేదు. తీవ్ర కాలయాపన జరుగుతున్నది. పర్యవసానంగా దిగువ రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతున్నది.
టి.లక్ష్మీనారాయణ