– మాసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నంలో బ్యాంక్ ఛైర్మన్ రాము, ఎంఎల్సి లేళ్ళ అప్పిరెడ్డి
– రుణాల కుంభకోణంపై క్రిమినల్ కేసులు నమోదుచేసి సమగ్ర విచారణ జరపాలి
– – టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ డిమాండ్
గుంటూరు: రైతుల సేవలో 109 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలోని సొసైటీలలో జరిగిన కోట్లాది రూపాయల రూణాల కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మొత్తం రుణాలపై విచారణ జరిపించాలని టిడిపి సీనియర్ నేత, పొన్నూరు మాజీ శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంటరీ నియోజవర్గ పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి నరేంద్ర కుమార్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వై యస్ ఆర్ సి పి నాయకులు కొందరు జిల్లాలోని వివిధ సొసైటీల సిబ్బందిని బెదిరించి నకిలీ పాస్ పుస్తకాలు, నకిలీ ఆధార్ కార్డులతో కోట్లాది రూపాయలను అక్రమ పద్దతులలో కాజేశారని, ఈ కుంభకోణంలో నిజాలు బయటకు రాకుండా మాసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అసలైన దోషులను కాపాడేందుకు వైకాపా ముఖ్యనాయకుల సహకారంతో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు కొందరు బయలుదేరారని తెలిపారు.
దోషులను కాపాడేందుకు జిడిడిసిసి బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు @ లాల్ పురం రాము, శాసనమండలి సభ్యుడు లేళ్ళ అప్పిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని వివిధ సహకార సంఘాలలో (పి ఏ సి యస్ లలో) ఈ కుంభకోణానికి సంబందించిన మూలాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక సొసైటీల పరిధికి చెందిన వారికి రుణాలు ఇవ్వాల్సిన సహకార సొసైటీలు ముగ్గురు సభ్యుల (త్రీమెన్) కమిటీ సభ్యుల సహాకారంతో చిరుధ్యోగులపై వత్తిడి తెచ్చి అక్రమ పద్దతులలో కోట్లాది రూపాయలను కాజేసేందుకు తీవ్రప్రయత్నాలు జరిగాయని తెలిపారు.
రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తిపాడు నియోజకవర్గంలో కుంభకోణం మూలాలు బయటపడితే పోలీసు కేసులు నమోదుచేసి విచారణ చేయాల్సి ఉన్నా, బ్యాంక్ ఛైర్మన్ రాము విజిలెన్స్ విచారణ అడగటంలోనే రైతులకు తీవ్ర అనుమానాలు కలుగుతున్నాయని నరేంద్ర కుమార్ అన్నారు. నకిలీ పాస్ బుక్ లు, నకిలీ ఆధార్ కార్డ్ లతో రుణాలు పొందితే నకిలీ పత్రాలు ఎలావచ్చాయి, నకిలీ పాస్ బుక్ లలో నమోదైన వివరాలు ఈ భూమి వెబ్ సైట్లో ఎలా నమోదై ఉన్నాయని ప్రశ్నించారు.
ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఈభూమి సైట్లో లేని భూములు, లేనివ్యక్తుల పేరుతో ఎలా నమోదయ్యాయో రెవిన్యూ అధికారులు, నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. హోం మంత్రి నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ కుంభకోణంలో పాత్రదారులలో ప్రముఖులు పత్తిపాడు నియోజక వర్గానికి చెందిన వారైనా విచారణ జరిపించమని హోంమంత్రిని అడుగకుండా వ్యవసాయశాఖ మంత్రిని విజిలెన్స్ విచారణ జరపమని బ్యాంక్ ఛైర్మన్, శాసనమండలి సభ్యుడు కోరడంలోనే అసలు ఆంతర్యం దాగి ఉందని అన్నారు.
గతంలో కేవలం ఇరవై ఒక్క కోట్ల రూపాయల స్వయం సహాయక గ్రూపుల రుణాలను మాత్రమే ఇస్తున్న బ్యాంక్ ఋణ పరపతి ఆరు వందల కోట్లకు ఎలా చేరిందని ఇందులో ఉన్న అసలు రహస్యం ఏమిటో బహిర్గతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా కాకుమాను సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్ వీడియోను ఆయన ప్రదర్శించారు. జిడిసిసి బ్యాంక్ పరిధిలో ఇచ్చిన మొత్తం రుణాలపై సమగ్ర విచారణ జరగాలని, వెలుగులోకి వచ్చిన రుణాల కుంభకోణంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పోలీసు విచారణ చేపట్టాలని నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.
గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వేరే ప్రాంతాలకు చెందిన వారికి పీరంగిపురం సొసైటీ లోనూ, మాచర్ల, మాచవరం వారికి ప్రాంతాల వారికి పత్తిపాడు, కాకుమాను సొసైటీలలోనూ, నిజాంపట్నం వాళ్ళకి వట్టిచెరుకూరు సొసైటీలలో ఉధ్యోగులు (సెక్రటరీలు) రుణాలు ఇస్తుంటే ఆసొసైటీల అధ్యక్షులు (త్రీమెన్ కమిటీ) ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.