Suryaa.co.in

Features

అతడు దేశభక్తికి నిర్వచనం! విప్లవానికి పర్యాయ పదం!

“అతడు దేశాన్ని ప్రేమించాడు
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రేమించాడు
విప్లవాన్ని ప్రేమించాడు.
ప్రేమను విప్లవీకరించిన విప్లవ ప్రేమికుడై
ఉరికంబాన్నే వధువుగా వరించాడు.
అతడు శిలువనే పెళ్ళాడిన స్పార్టకస్”

85 సంవత్సరాల క్రితం నేడు పాకిస్తాన్ లో వున్న లాహోరులో బ్రిటీషు సామ్రాజ్యవాదులచే రాజద్రోహం నేరం (1243) క్రింద షహీద్ సుఖదేవ్, రాజగురులతో పాటు ఉరితీయబడిన వాడు భగత్ సింగ్. ఈనాటి మన పార్లమెంటు భవనం లోపల, సమావేశం జరుగుతుండగా (అప్పుడు దానిని సెంట్రల్ అసెంబ్లీ అనేవారు) సందర్శకుల స్థానం నుండి 8-4-1929న బాంబులు విసిరిన వారిలో బటుకేశ్వర్ దత్ తో పాటు భగత్ సింగ్ కూడా ఒకరు. కార్మికుల ఉద్యమ హక్కుల్ని, పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్నీ అణచివేసే చట్టాలు చేయడాన్ని నిరసిస్తూ వారిరువురూ చాలామంది ప్రముఖులు ( విఠల్ భాయ్ పటేల్, పండిట్ మోతీలాల్ నెహ్రూ, కేల్కర్, జయకర్, జిన్నా మొ||వారు)చర్చిస్తున్న సందర్భంలో బాంబులు వేశారు. కొందరు పొరపాటుగా భావిస్తున్నట్లు భగత్ సింగ్ కు ఉరిశిక్ష పడింది ఈ బాంబులు విసిరిన కేసు సందర్భంగా కాదు. ఇందుకు వారికి యావజ్జీవిత కారాగార శిక్ష మాత్రమే విధించారు.

‘దేశభక్తి అంటే చట్టాల మీద భక్తి కాదు’ అనటానికి సెంట్రల్ అసెంబ్లీ బాంబుకేసు ఒక ఉదాహరణ. దేశప్రజలనూ, విప్లవకార్మిక వర్గాన్ని అణచివేయటాన్ని వ్యతిరేకించటమే దేశభక్తిగా భగత్ సింగ్ తన ఆచరణద్వారా ఆనాడు రుజువుపర్చాడు. అంతేకాదు బాంబులు విసిరిన తర్వాత వారిరువురూ యిచ్చిన నినాదాలు, (సామ్రాజ్యవాదం నశించాలి! విప్లవం వర్థిల్లాలి!! కార్మికవర్గం వర్ధిల్లాలి!!!) పంచిన కరపత్రాలు కూడా దేశభక్తికి ఉండాల్సిన విస్పష్ట ప్రమాణాన్ని దేశం ముందు నిలిపాయి.

ఈ రోజున దేశభక్తి గురించీ, జాతీయత గురించీ సాగుతున్న చర్చకు అర్థవంతమైన జవాబును, తమ ఆచరణ రూపంలో, తర్వాత వివరణల ద్వారా 85 ఏళ్ళ క్రితమే భగత్ సింగ్ యిచ్చి వున్నాడు.
లాహోరు పట్టణంలో పోలీసు స్టేషన్ వెలుపల సాండర్స్ అనే బ్రిటీషు పోలీసు అధికారిని 17.12.1928న కాల్చిచంపినందుకు సుఖదేవ్, రాజ్ గురు భగత్ సింగ్ లను 23.3.1931న ఉరితీశారు. ఇటీవల లాహోరులో వొక న్యాయవాది సాండర్స్ హత్య కేసు గురించిన ప్రాథమిక సమాచార పత్రం(ఎఫ్.ఐ.ఆర్)లో భగత్ సింగ్ పేరులేదనీ, ఆ కారణంగా అతని ఉరిశిక్ష అన్యాయమనీ, ఆ కేసుని తిరిగి విచారించి భగత్ సింగ్ ఉరిశిక్షను రద్దుపర్చాలనీ లాహోరు హైకోర్టులో వాదన చేస్తున్నట్లు మన పత్రికల్లో కూడా వార్తలొచ్చాయి.

85 ఏళ్ళ క్రితం అమలు జరిగిన ఉరిశిక్ష నేటికీ వివాదాస్పంగా ఉన్నప్పుడు; నిన్నగాక మొన్న ఉరితీయబడిన అఫ్టల్ గురు, యాకూబ్ మెమన్ లది వివాదం కావడంలో ఆశ్చర్యం లేదు. రాజకీయ ఉరిశిక్షలు ఎప్పుడూ వివాదాస్పదమే. ‘రావణకాష్టం’ అనే పలుకుబడి ఎంత పాత ‘వివాదానికి ప్రతీక?
ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ బాంబుకేసు సందర్భంగా 23 ఏళ్ళ భగత్ సింగ్ తమకు విధించిన యావజ్జీవ కారాగారవాస శిక్షను ప్రశ్నిస్తూ లాహోరు హైకోర్టులో అప్పీలు చేసి యిచ్చిన (13.1. 1930 నాటి) వాంగ్మూలం న్యాయశాస్త్ర కోవిదులందరూ తప్పక చదవాల్సినది.

ఒక చర్య వెనుక ఉద్దేశాలను పరిగణలోనికి తీసుకోకపోతే ప్రపంచంలోని సైన్యాధికారులందరూ హంతకులే అవుతారనీ, “ఉద్దేశాలను విస్మరిస్తే ప్రతి మత ప్రచారకుడూ అబద్ధాన్ని ప్రచారం చేసేవాడుగా కన్పిస్తాడు. కోట్లాది అమాయకులను, అజ్ఞానులను తప్పుదోవ పట్టిస్తున్నందుకు ప్రతివొక్క ప్రవక్త మిద నేరారోపణ చేయాల్సి వుంటుంది” అంటూ ” ఏ ప్రభుత్వమైతే మనిషికి లభించే జీవించే హక్కును గుంజుకుంటుందో అటువంటి ప్రభుత్వానికి కొనసాగే హక్కు ఎంత మాత్రమూ లేదనీ.” తామిచ్చిన “ఇంక్విలాబ్
జిందాబాద్” “సామ్రాజ్యవాదం నశించాలి” నినాదాల్ని సరిగా అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తాడు.

భారత స్వాతంత్రోద్యమంలోకి వందేమాతరం నినాదం స్థానంలోకి “ఇంక్విలాబ్ జిందాబాద్’ను దేశవ్యాపిత ప్రాచుర్యంలోకి తెచ్చినది భగత్ సింగ్ బృందమే. టెర్రరిజమే విప్లవపంధా అనుకునేవారికి కనువిప్పు కలిగేలా విప్లవమంటే బాంబుల, పిస్తోళ్ళ సంస్కృతి కాదనీ, అసమానతలు నిండిన దోపిడీ వ్యవస్థను పీడితులైన కార్మిక-కర్షకుల ఉద్యమశక్తితో పరిమార్చటమనీ స్పష్టం చేసిన వాడు భగత్ సింగ్.

గదర్ వీరుల ఆచరణనుండి స్వీకరించి, హేతువాద తాత్విక జ్ఞానం నుండి గ్రహించి, ‘రాజకీయాలలోకి మతాన్ని రానివ్వకూడదు’ అని స్పష్టంగా ప్రకటించటమే కాక తాము నిర్మించిన ‘నవ జవాన్ భారత్ సభ’ అనే యువజన సంఘం ప్రణాళికలో మతవాదులకు సభ్యత్వం యివ్వరాదని (దాని రూపకర్తలు దుర్గాబాబీ భర్త భగవతీ చరణ వోహ్ర, భగత్ సింగ్ లు ) లౌకికవాదాన్ని పాటించాలని నిర్దేశించుకున్నారు.

బ్రిటీషు వలసవాదులది కేవలం రాజకీయ ఆక్రమణగా భావించి వారిని వెళ్ళగొడితే సరిపోతుందన్నట్టు తమకు ముందు విప్లవకారులు భావించేవారు. భగత్ సింగ్ బృందం మరింత ఉన్నత చైతన్యంతో సమస్త సామాజిక రంగాలనూ తమ దోపిడీ పీడనలతో పీల్చిపిప్పి చేసే సామ్రాజ్యవాదాన్ని సంపూర్ణంగా ఓడించాలను కున్నారు. భవిష్యత్తులో భారతదేశం సోషలిస్టు వ్యవస్థగా నిర్మాణం కావాలనే లక్ష్యంతో తమ సంస్థ పేరును 1928 సెప్టెంబరులో హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ గా మార్పించటంలో భగత్ సింగ్ దే కీలక పాత్ర.

నేడు లౌకికవాదమూ, సోషలిజమూ అనే పదాలనే భరించలేని వర్గాలున్నాయి. ‘భగత్ సింగ్త మ్ములం’ అంటూ నినదించే వారు తమ నిజాయతీని ఆచరణలో రుజువుపరుచుకోవాలంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణకూ, మతవిద్వేష రాజకీయాలకూ వ్యతిరేకంగా నిలబడాల్సివుంటుంది.

భగత్ సింగ్ రాసిన “నేనెందుకు నాస్తికుడను?” అనే పుస్తకాన్ని చాలామంది ఉటంకిస్తారు కానీ ఆయన యింకా ‘మతకలహాలూ- వాటి నివారణోపాయాలూ’ ‘భగవంతుడు-మతము’ ‘మతము-మన స్వాతంత్ర్య సమరమూ’ ‘అసశ్యతా సమస్య’ అనే వ్యాసాలు కూడా రాశాడు. “మన పూర్వులయిన ఆర్యులు అసశ్యుల యెడల చాలా అన్యాయంగా ప్రవర్తించారు. నీచులని చీదరించుకున్నారు. నికృష్టమైన పనులకు వారిని బలవంతంగా వినియోగించారు.

ఇలా చేయటంతో పాటుగా కొంపదీసి వీళ్ళు తమ మీద తిరుగుబాటు చేయరుగదా! అనే ఆలోచన రాగానే ఆర్యులు పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రచారంలో పెట్టారు. దళితుల్ని తీవ్రమైన అణచివేతకి గురిచేసిన ఆర్యులు చాలా అన్యాయం చేశారు. ఈనాడు వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకునే తరుణం ఆసన్నమయింది.” అన్న భగత్ సింగ్ దేవుడ్నీ, మతాన్నీ రాజ్యం సాయంతో సంపన్నులు తమ దోపిడీ సాధనంగా మార్చుకున్నారు అంటాడు.

1928లోనే దళితులకు భగత్ సింగే యిచ్చిన పిలుపు చారిత్రాత్మకమైనది.
” సంఘటితపడి మీ కాళ్ళమీద నిలబడి మొత్తం సమాజాన్నే సవాలు చెయ్యండి. మీరొకరి పావుగా మారకండి. బ్యూరోక్రాట్ల మోసంలో పడకండి, మీ బానిసత్వానికీ పేదరికానికి మూలకారణం యీ పెట్టుబడిదారీ బ్యూరోక్రసీయే. అందువల్ల వాళ్ళతో ఎన్నడూ మీరు చేతులు కలపకండి. అసలైన శ్రామికులు మీరే. మీరే సంఘటితంకండి.

సంఘటితపడితే మీకు పోయేదేంలేదు. బానిస సంకెళ్ళు తెగిపోవటం తప్ప. లేవండి! నేటి వ్యవస్థ మీద తిరగబడండి. అతి నెమ్మదిగా జరిగే సంస్కరణల వల్ల ఏమి ప్రయోజనం లేదు. సాంఘికోద్యమాన్ని లేవదీసి విప్లవం తీసుకురండి. రాజకీయ ఆర్ధిక విప్లవాల కోసం సమాయత్తం కండి. మీరే దేశానికి పట్టుగొమ్మలు. నిజమైన శక్తి మీరే. నిదురిస్తున్న సింహాల్లారా! లేవండి!! తిరుగుబాటు చేయండి!!!.”

భగత్ సింగ్ చెప్పిన ఆర్య సంస్కృతి అంటే నిచ్చెనమెట్ల కులవ్యవస్థకు మూలమైన ఫ్యూడల్ సంస్కృతే. బ్రాహ్మణీయ భావజాలపు ఈ ఆధిపత్య సంస్కృతే నేటికీ మనకు గ్రామాల నుండి విశ్వవిద్యాలయాల దాకా సరికొత్త రూపాలలో కొనసాగుతోంది. భగత్ సింగ్భ యపడ్డట్టే భారత స్వాతంత్ర్య పోరాటం సామ్రాజ్యవాదులతో రాజీతో ముగిసింది. అది నేటికి ప్రపంచబ్యాంకు షరతుల ద్వారా దొడ్డిదారిన ప్రవేశించి అసమానతలనూ అమానవీయతనూ పెంచి పోషిస్తోంది.

గడిచిన 68 ఏళ్ళుగా ప్రశాంత విప్లవం ద్వారా సమాజాన్ని మార్చేస్తామని వాగ్దానం చేసిన పాలకులు జెండాలనైతే మార్చుకుంటున్నారు కానీ వ్యవస్థను రోజు రోజుకీ సంక్షోభంలోకి నెడుతున్నారు.
భగత్ సింగ్ అంచనా ప్రకారం గాంధీకి సామ్రాజ్యవాదం పట్ల వ్యతిరేకత కంటే విప్లవం పట్ల భయమే ఎక్కువ. హేతువాదీ, నాస్తికుడూ అయిన భగత్ సింగ్ లాగా మతవాదానికి గాంధీ వ్యతిరేకి కాడు. అలాంటి గాంధీనే సహించలేక హత్య గావించిన వారి వారసులు నేడు అధికారంలో వున్నారు. వీరు భగత్ సింగ్ బోధనలను తప్పకుండా దేశద్రోహం కింద జమకడతారు. పీడితులను తిరుగుబాటు చేయమని ప్రేరేపించటమూ, విప్లవాన్ని నడపమని బోధించటమూ నేటి పాలక సంస్కృతి లెక్కన జాతి విద్రోహకరమే అవుతుంది. భగత్ సింగే బతికొస్తే వీరు మరొకసారి ఉరికంబమెక్కిస్తారు.

నిజానికి భగత్ సింగ్ బోధనల సారాంశం ఎన్నడూ లేనంతగా దేశానికి నేడుంది. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటే ఏమిటని కోర్టువారి ప్రశ్నకూ, కలకత్తా నుండి వెలువడే ‘మోడరన్ రివ్యూ’ పత్రికకూ భగత్ సింగ్ యిచ్చిన జవాబులు ఆయన భావాల స్పష్టతకూ, పరిణతికి నిదర్శనం. ఆయన చిట్టచివరగా దేశ యువతకి యిచ్చిన పిలుపు (వీలునామాగా ప్రసిద్ధి) పూర్తి పాఠం యొక్క సారాన్ని నేటి యువతరం అర్ధం చేసుకొని, అన్వయించు కోవాలి. భగత్ సింగ్ రచనల్లోని ‘మతమూ-మన స్వాతంత్ర్య సమరం’ లోని చివరి వాక్యాలతో దీన్ని ముగిద్దాం.

“ స్పృశ్యత, అస్పృశ్యత అనే పదాలని కూకటివేళ్ళతో పెకలించి వేయాలి. మనం మన సంకుచిత దృష్టిని విడనాడనంత కాలం మనలో వాస్తవిక ఐక్యత ఏర్పడదు. మన స్వాతంత్ర్యానికి అర్థం తెల్లవారి చేతుల్లోంచి విముక్తి పొందట మొక్కటే కాదు. సంపూర్ణ స్వాతంత్ర్యం, ప్రజలు పరస్పరం కలసిమెలసి వుండటంతో పాటు మానసిక బానిసత్వం నుంచి కూడా విముక్తి పొందాలి”

-దివికుమార్

LEAVE A RESPONSE