-దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా?
-వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి
-ధనిక రాష్ట్రంలో రూ.11 వేల కోట్లు లేవా?
-ధరల పెంపుపై సర్కారుతో సమరమే
-పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)లో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క వెల్లడి
-మొక్కజొన్న చేను కి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్న భట్టి
-భట్టి పాదయాత్రకు అశేష జనవాహిని
-మొక్కజొన్న చేలకు వెళ్లి రైతులను కలిసిన భట్టి
-రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత
-గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమైన కూలీలు
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు తెలంగాణ బీజేపీ ఎంపీలు అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ తరువాత కేంద్రంతో యుద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం చింతకాని మండలం నేరడ, గంగమ్మ దేవాలయం, కోమట్లగూడెం, నాగలిగొండ, పొద్దుటూరు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సిపిఐ తెలుగుదేశం కార్యకర్తలు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలో ఎందుకు కొనడం లేదని నిలదీశారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ధాన్యాన్ని కేంద్రం కొనక్కుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కొనుగోలు చేసి ఆ తర్వాత కేంద్రంపై యుద్ధం చేయాలన్నారు. అందుకు తెలంగాణలోని అన్ని పక్షాలు సహకరిస్తాయని తెలిపారు. కేంద్రం కొనుగోలు చేయడం లేదనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి రైతులను మభ్య పెట్టడం కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల సమస్యను పరిష్కరించాల్సిన పాలకులు రాస్తారోకోలు ధర్నాలు చేస్తే రైతులకు కలిగే ప్రయోజనం ఏంటని అడిగారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద 12 వేల కోట్ల రూపాయలు లేవా అని ప్రశ్నించారు. లక్షల కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు కట్టామని ప్రగల్భాలు పలుకుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని సూచించారు. రైతుల జీవితాలతో రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, మిర్చి ,మొక్కజొన్న పంటలను సాగు చేయాలని ప్రచారం చేసిన పాలకులు కల్తీ విత్తనాలు అరికట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ఈ ఏడు చాలా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరల పై పడిందని అన్నారు. దీంతో సామాన్యులు, పేదలు మూడు పూటలా తిండి తినే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా కరెంటు చార్జీలను పెంచి ప్రజల పై తీరని భారం మోపిందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ, ప్రతి ఊరిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని వివరించారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) ఈ రోజు ( మంగళవారం) చింతకాని మండలం నేరడ నుంచి కోమట్లగూడెం గ్రామానికి వెళ్తుండగా నేరడ శివారులో వ్యవసాయ కూలీలు మండుటెండలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న దృశ్యాన్ని చూసి పొలం గట్ల వెంట నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు. వ్యవసాయ కూలీల సమస్యలు వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నేరేడకు చెందిన రసూల్ బి తన గోడును వెళ్లబోసుకుంటూ కన్నీటిపర్యంతమై విలపించింది. తన బిడ్డకు క్యాన్సర్ వస్తే చికిత్స చేయించడానికి 5లక్షల అప్పు చేశానని, అయినా తన బిడ్డ బతకలేదని బోరున విలపించింది. తన బిడ్డ కోసం చేసిన ఐదు లక్షల అప్పు తీర్చడానికి కూలి పని చేయడం తప్ప మరో ఆధారం లేదని వాపోయింది. ఉండటానికి సైతం ఇల్లు లేదని రేకుల షెడ్డులో ఉంటున్నామని, ఎండాకాలంలో చెట్ల కిందే జీవనం కొనసాగిస్తున్నామని తన ఆవేదనను వెలిబుచ్చింది. తనకు ఉండడానికి గూడు లేదని ఊర్లో ఎవరు ఇల్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని సర్కార్ బిల్డింగ్లో పిల్లలతో తలదాచుకుంటున్నామని మరో వ్యవసాయ కూలీ మడిపల్లి కమలమ్మ సీఎల్పీ నేతకు తన గోడు వెళ్లబోసుకుంది.
*పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని నేరడ గ్రామానికి చెందిన మొక్క జొన్న రైతు పుల్లమ్మ తన పంట పరిస్థితి గురించి సీఎల్పీ నేత కు వివరించింది. మార్కెట్లో కాంప్లెక్స్ ఎరువులు దొరకడం లేదని, గోదావరి డిఎపి అందుబాటులో లేదని, మందు బస్తాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని చెప్పింది. పెరిగిన ధరలతో ఎకరానికి పెట్టుబడి రూ.30వేలు దాటినప్పటికీ కల్తీ విత్తనాలతో దిగుబడి 10 క్వింటాలు కూడా రావడం లేదని తను పండించిన పంట గురించి మహిళా రైతు పుల్లమ్మ వివరించారు. వారి స్థితిగతులు, సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్న తర్వాత ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన వివరాలను వారికి తెలియజేశారు. మీ పొలం వద్దకు అధికారులు వచ్చి పంట నష్టం వివరాలు తెలుసుకుని పంపించి మీకు పరిహారం ఇస్తారని ధైర్యం చెప్పారు. *అధికారులు మీ పంట పొలాల వద్దకు రాకుంటే నాకు ఫోన్ చేయండి. నేను మీ పంట పొలాల వద్ద కు పంపిస్తానని వారికి భరోసా ఇచ్చి ముందుకు సాగారు.
జన జాతరను తలపించిన పాదయాత్ర
భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం చింతకాని మండలం నేరడ, గంగమ్మ దేవాలయం, కోమట్లగూడెం, నాగలిగొండ, పొద్దుటూరు గ్రామాల్లో జన జాతరను తలపించింది. పాదయాత్రకు అశేష జనవాహిని ఘన స్వాగతం పలికారు. కార్మికులు, కర్షకులు, కూలీలు, నిరుద్యోగులు, వృత్తిదారులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, చిన్న, పెద్దలు, చంటి పిల్లల తల్లులు ఇలా సబ్బండ వర్గాలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడుగులో అడుగు వేసి పీపుల్స్ మార్చ్ లో కధం తొక్కారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. దారి పొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.