పేరు తేటగీతిలో..
నచ్చిన గీతమూ
అదే శృతిలో..
ప్రతి రచనా
జనం మెచ్చే రీతిలో…
శంకరంబాడి సుందరాచారి..
ఇలా చెబితే.. ఓ కవి..
మా తెలుగు తల్లికి మల్లెపూదండ…
మా కన్నతల్లికి మంగళారతులు..
ఇది పాడితే
పరిచయమే అవసరం లేని
తెనుగింటి మహాకవి..
ప్రతి ఆంధ్రుడి మదిలో
ఆనందభైరవి!
వందేమాతరం రాసిన బంకించంద్ర..
మా తెలుగుతల్లికి
మల్లెపూదండ
పాటను పలికించిన
సుందరాచారి..
ఈ కలాలు రెండూ
ఒకే రోజు అస్తమయం..
వారి గీతాలు..
అద్భుతమైన మన గతాలు..
అవగతాలు..!
అటు సంస్కృతము కాని…
మరీ ప్రాకృతమనిపించని…
ఇటు పల్లెపదాల వల్లె
ప్రభావమే కనిపించని…
ఓ ప్రత్యేక శైలి..
పదాలతో వ్యాహ్యాళి..
అక్షరాల కేళి..
సుందరంబాడి జావళి..
పండితపామరులను
అలరించే కవితల కథకళి..!
గలగలా గోదారి కదలిపోతుంటేను..
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను..
బంగారు పంటలే పండుతాయి..
ఈ భావాలే కదా
ఆ కలం నుండి
అలవోకగా జాలువారిన
మురిపాల ముత్యాలు..!
అమరావతి నగర
అపురూప శిల్పాలు..
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు..
తిక్కయ్య కలములో
తియ్యందనాలు..
ఈ పదాలు
నిత్యమై నిఖిలమై
నిలిచి ఉండవా మరి..
పాడుతుంటే టంగుటూరి
తెలుగోడి నోరూరి..!
రుద్రమ్మ భుజశక్తి..
మల్లమ్మ పతిభక్తి..
తిమ్మరుసు ధీయుక్తి..
కృష్ణరాయల కీర్తి..
మా చెవులు రింగురింగుమని
మారుమ్రోగే దాకా
ఓ సుందరంబాడి..
నీ పాటలే పాడుతాం..
నీ ఆటలే ఆడుతామనుకున్నా..
అంతలోనే అయింది
నాటి నీ..నిన్నటి నా తెలుగునేల
ముక్కలు చెక్కలు
హృదయాలు వ్రక్కలు!
రాష్ట్రం విడివడినా..
మనసు ముడివడే…
నీ పాటే సమరస గీతమై..
ఘనమైన మన గతమై..
ఓ సమైక్య పొద్దుకు
సుప్రభాతమై..!
ఎలిశెట్టి సురేష్ కుమార్