Suryaa.co.in

Editorial

ముగ్గురు ‘నానీ’లకు నామాలు!

– వ్రతం చెడ్డా దక్కని ఫలితం
– ఆళ్ల, పేర్నికే సానుభూతి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ క్యాబినెట్ విస్తరణ పుణ్యాన ఇకపై ముగ్గురు నానీల పేర్లు వినిపించవు. వారిలో ఏలూరుకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని, బందరుకు చెందిన పేర్ని నాని, గుడివాడ ఎమ్మెల్యే అయిన కొడాలి నాని ఉన్నారు. ఈ ముగ్గురు నానీలు మూడేళ్ల పాటు మంత్రివర్గంలో కొనసాగి, తాజా విస్తరణలో పదవులు కోల్పోయారు.

ఈ ముగ్గురు నానీలలో బాగా పాపులర్ అయిన నేత కొడాలి నాని. ఆహార్యం, బాడీలాంగ్వేజీ విచిత్రంగా ఉంటుంది. ఆయన ప్రెస్‌మీట్ పెడితే, ఏం మాట్లాడతారో, ఎవరిని కొత్త పదాలతో తిడతారోనన్న ఉత్కంఠ అందరికీ ఉంటుంది. అసలు ఆ పేరు చెబితే మీడియా, సోషల్‌మీడియాను ఫాలో అయ్యేవారికి ‘బూతులమంత్రి’ అని మాత్రమే గుర్తుకొస్తుంది. కొడాలి తన శాఖ కంటే.. టీడీపీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు-ఆయన తనయుడు లోకేష్‌ను తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయించారు. కానీ వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. మరి ఇప్పుడు కొడాలి నాని క్యాబినెట్‌లో లేనందున, ఆయన ‘బూతుల పరంపర’, వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారో, ఆ బాధ్యత జగనన్న ఎవరికి అప్పగిస్తారో చూడాలి.

ఇక సమాచార-రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పేర్ని నానికి మొన్నటి వరకూ సాత్వికుడనే పేరుండేది. హుందాగా వ్యవహరిస్తారని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారన్న పేరు కూడా ఉంది. తనకు చేతనయినంతలో సాయం చేస్తారన్న పేరుంది. అటు నియోజకవర్గంలో కూడా ఆయనంటే అందరికీ గౌరవమే. కానీ గత కొన్ని నెలల నుంచి జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ను ఏకిపారేసేందుకు జగనన్న ఆయనను సంధించారు. ఓదశలో ‘మేమూ మేమూ కాపు నాకొడుకులం’ అనేంత వరకూ వెళ్లడంతో ‘పేర్ని నాని కూడా కొడాలి నాని అయ్యార’న్న పేరు తెచ్చుకున్నారు. పవన్‌పై ఇటీవలి కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, సొంత కాపు వర్గాన్ని సైతం అసంతృప్తికి గురిచేశాయి. దానితో ఆయన స్థాయి తగ్గిపోయింది. అయినా సరే.. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. కొడాలి నానితో పోలిస్తే, పేర్ని నాని తన శాఖల సమీక్షలో ముందున్నారు.

ఏలూరుకు చెందిన ఆళ్ల నాని తొలి నుంచీ వివాదరహితుడే. తన పని తాను చేసుకుపోవడమే తప్ప, ప్రత్యర్థుల గురించి ఆలోచించని నేతగా పేరు తెచ్చుకున్నారు. శాఖాపరమైన సమీక్షల్లో ముందున్నప్పటికీ, కోవిడ్ సమయంలో చేతులు పైకెత్తేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. హుందాతనంగా వ్యవహరించే ఆళ్ల నాని హడావిడి, ప్రచారానికి దూరంగా ఉంటారు. అయితే ‘ఆయనను తొలగించడం వల్ల పార్టీకి లాభం లేదు, అలాగని నష్టం లేద’న్న వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి.

ఎటొచ్చీ ప్రతిపక్షాలను చీల్చి చెండాడిన పేర్ని-కొడాలి నానిలకు మాత్రం వ్రతం చెడ్డా ఫలితం దక్కకుండా పోవడమే బాధాకరం. అయితే విచిత్రంగా.. విస్తరణ తర్వాత వినిపించిన పేర్లలో ఈ ముగ్గురు పేర్లు లేని క్రమంలో, ఆళ్ల- పేర్ని లేకపోవడంపై చాలామంది బాధపడ్డారు. కొడాలి విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకున్నారన్న వ్యాఖ్యలు, టీవీలు చూసే వారి నుంచి వ్యక్తమవడం విశేషం. ఆ రకంగా ఒక నాని సానుభూతికి నోచుకోలేదన్నమాట.

LEAVE A RESPONSE